Godavari Flood: పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
ABN , Publish Date - Jun 28 , 2025 | 03:08 AM
పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది.

పోలవరం స్పిల్‌వే నుంచి 25,741 క్యూసెక్కులు విడుదల
పోలవరం, జూన్ 27(ఆంధ్రజ్యోతి): పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉప నదులు మంజీర, ప్రాణహిత, కిన్నెరసాని, ఇంద్రావతి, శబరి, సీలేరు వార్థా, పెన్‌గంగ, ప్రవర, పూర్ణ, మానేరు, బిందుసార, వైన, కడెం నదుల నుంచి వస్తున్న వరద, కొండవాగుల జలాలతో నదిలో నీటిమట్టం పెరుగుతోంది. దీంతో పోలవరం ప్రాజెక్టులోకి అదనంగా వస్తున్న 25,741 క్యూసెక్కుల నీటిని అధికారులు స్పిల్‌వే 48 గేట్లు, స్లూయిజ్ 6 గేట్ల నుంచి దిగువకు విడుదల చేశారు.
స్పిల్‌వే ఎగువన 26.02 మీటర్లు, దిగువన 16.7 మీటర్లు, ఎగువ కాఫర్ డ్యాం ఎగువన 26.1 మీటర్లు, దిగువ కాఫర్ డ్యాం దిగువన 14.12 మీటర్లు, ఎగువ దిగువ కాఫర్ డ్యాంల నడుమ 15.3 మీటర్ల నీటిమట్టం నమోదైనట్లు జల వనరులశాఖ అధికారులు తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజీకి 11,617 క్యూసెక్కులు వస్తుంటే.. 11,000 క్యూసెక్కులు సముద్రంలోకి వదులుతున్నారు.