Share News

Deputy CM Pawan Kalyan: గోదారి కుర్రాళ్ల బైకుల్లా అభివృద్ధి పరుగు

ABN , Publish Date - Jun 27 , 2025 | 03:30 AM

గోదావరి కుర్రాళ్ల బైక్‌ల వేగం మాదిరిగా.. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో కేంద్రం, రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతమైంది. ఇంజన్‌లో సీసీ పవర్‌ ఎంత ఎక్కువగా ఉంటే.. బైక్‌ కూడా అంత వేగంగా ముందుకెళ్తుంది.

Deputy CM Pawan Kalyan: గోదారి కుర్రాళ్ల బైకుల్లా అభివృద్ధి పరుగు

  • శక్తిమంతమైన నాయకుల వల్లే ఇది సాధ్యం

  • ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నేతృత్వంలో డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వంలో అభివృద్ధి వేగం

  • ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌

  • అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన.. సైన్స్‌ మ్యూజియం ప్రారంభం

రాజమహేంద్రవరం అనగానే గుర్తొచ్చేది గోదావరి తీరం. తీరం వెంబడి నాగరికత, భాష అన్నీ అభివృద్ధి చెందుతాయి. అలాంటి ఈ గోదావరి నేల మీద ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ జన్మించారు. మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన నన్నయ్య నడయాడారు. ఎంతోమంది కళాకారులు, సామాజిక వేత్తలకు జన్మనిచ్చిన నేల ఇది.

పవన్‌ కల్యాణ్‌

రాజమహేంద్రవరం, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): ‘గోదావరి కుర్రాళ్ల బైక్‌ల వేగం మాదిరిగా.. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో కేంద్రం, రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతమైంది. ఇంజన్‌లో సీసీ పవర్‌ ఎంత ఎక్కువగా ఉంటే.. బైక్‌ కూడా అంత వేగంగా ముందుకెళ్తుంది. ఆ వేగం మనల్ని గమ్యం చేర్చేలా ఉండాలి. అటు కేంద్రంలో.. ఇటు రాష్ట్రంలో.. శక్తిమంతమైన నాయకులు ఉండడం వల్లే అభివృద్ధి వేగవంతం అవుతుంది. అది డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం వల్లే సాధ్యమవుతుంది’ అని ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.


తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం ఆయన కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి, మంత్రులు కందుల దుర్గేశ్‌, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. సైన్స్‌ మ్యూజియం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. దివాన్‌చెరువులో ఫారెస్ట్‌ అకాడమీ భవన సముదాయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పుష్కరఘాట్‌లో ఏర్పాటు చేసిన సభలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ... ఈ రోజు ఇక్కడ రూ.430 కోట్లతో ఏడు టూరిజం ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నామని, వీటిలో కొన్నింటికి ప్రణాళికలు పూర్తయ్యాయని, మరికొన్ని పనులు పూర్తిచేశామని చెప్పారు.


ఏపీని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయాలని 2024 ఎన్నికల్లో ఎన్‌డీఏ సర్కారు నిర్ణయించిందని, అందులో భాగంగానే అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టును అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని, టూరిజం ప్రాజెక్టులు పూర్తయితే 4 లక్షల కంటే ఎక్కువ మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు. ఏపీకి ఎల్లప్పుడూ సహకారం అందిస్తున్న కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌కు ధన్యవాదాలు తెలిపారు. కాగా, బొమ్మూరులో రూ.15.20 కోట్లతో నిర్మించిన రాజమహేంద్రవరం విజ్ఞాన కేంద్రానికి ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త శ్రీస్వామి జ్ఞానానంద పేరును ఈ కేంద్రానికి పెట్టాలనే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.


ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌!

  • వెంటనే సవరించుకున్న ఎంపీ పురందేశ్వరి

అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టు శంకుస్థాపన అనంతరం జరిగిన సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడుతూ.. పవన్‌ కల్యాణ్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి అని అన్నారు. వెంటనే పక్కనే ఉన్న బీజేపీ నేత గుర్తుచేయడంతో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అని సవరించుకున్నారు. వేదిక మీద ముఖ్యుల పేర్ల పరిచయం సమయంలో పొరపాటున ఇలా అనేసి సరిచేసుకున్నారు. సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.

Updated Date - Jun 27 , 2025 | 03:34 AM