Free Travel for Women: రాష్ట్రమంతా ఉచిత ప్రయాణం
ABN , Publish Date - Jul 30 , 2025 | 05:09 AM
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కింద మహిళలు రాష్ట్రమంతటా.. ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగొచ్చు. దీనిపై ఎలాంటి

మహిళలకు పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో, సిటీ సర్వీసుల్లో అవకాశం
మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడి
తిరుపతి(ఆర్టీసీ), జూలై 29(ఆంధ్రజ్యోతి): ‘ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కింద మహిళలు రాష్ట్రమంతటా.. ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగొచ్చు. దీనిపై ఎలాంటి పరిమితి లేదు. పల్లెవెలుగు, అల్ర్టా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో, సిటీ సర్వీసుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం చేయొచ్చు’ అని రవాణా శాఖ మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి, ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు తెలిపారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై మంగళవారం తిరుపతిలోని సంస్కృత విద్యాపీఠం కాన్ఫరెన్స్ హాల్లో రాయలసీమ జోన్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పథకం అమలుపై డీపీటీవోలు, సీటీఎంలు, సీఎంఈలు, డిపో మేనేజర్లకు దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించి త్వరలోనే తుది మార్గదర్శకాలు వెలువరిస్తామని చెప్పారు. అనంతరం మంత్రి, ఆర్టీసీ ఎండీ మీడియాతో మాట్లాడారు. ఈ పథకం అమలుతో ప్రస్తుతం బస్సుల్లో తిరుగుతున్న మహిళల సంఖ్య 35శాతం నుంచి సుమారు 60శాతానికి పెరగవచ్చని అంచనా వేశామని వివరించారు. రద్దీకి తగ్గట్లు బస్సుల నిర్వహణ, కండిషన్‌ను మరింత మెరుగుపరిచే చర్యలు చేపట్టాలని, ట్రిప్పుల సంఖ్య పెంచాలని అధికారులను ఆదేశించామని అన్నారు. త్వరలో 1,050 ఎలక్ర్టిక్ బస్సులు రానున్నాయని, ఇవి కాకుండా దాదాపు 1,500 బస్సులకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని పేర్కొన్నారు. సిబ్బంది కొరతను అధిగమించే మార్గాలు చూడాలని, బస్సు కండిషన్‌లో ఉంటేనే రోడ్డెక్కించాలని స్పష్టంగా చెప్పామన్నారు. అందరూ సమన్వయం చేసుకొని పథకం అమలుకు సహకరించాలని కోరారు. తిరుమల ఘాట్ విషయంలో ప్రభుత్వం త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటుందని, ఇందులో తాము కల్పించుకోలేమని మంత్రి, ఈడీ చెప్పారు. సమావేశంలో ఆర్టీసీ ఈడీలు ఎ.అప్పలరాజు, చెంగల్‌రెడ్డి, చంద్రశేఖర్, జగదీష్, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
గుడ్ న్యూస్.. రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏనుగుల గుంపు కదలికలపై వాట్సాప్ ద్వారా హెచ్చరికలు.. పవన్ కల్యాణ్ న్యూ ప్లాన్
Read latest AndhraPradesh News And Telugu News