Former Minister Kanna: రాత్రి చంపి ఉదయాన్నే శవానికి దండేసినట్లుగా..
ABN , Publish Date - Jun 18 , 2025 | 05:36 AM
సినిమాల్లో విలన్లు ఒక వ్యక్తిని రాత్రి చంపి.. ఉదయాన్నే వెళ్లి శవానికి దండేసి సానుభూతి తెలిపినట్లుగా వైసీపీ అధినేత జగన్ సత్తెనపల్లి పర్యటన ఉందని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.

నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు పరోక్షంగా జగనే కారణం: కన్నా
గుంటూరు, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): సినిమాల్లో విలన్లు ఒక వ్యక్తిని రాత్రి చంపి.. ఉదయాన్నే వెళ్లి శవానికి దండేసి సానుభూతి తెలిపినట్లుగా వైసీపీ అధినేత జగన్ సత్తెనపల్లి పర్యటన ఉందని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు గత ఎన్నికల్లో వారి పార్టీ అధికారంలోకి వస్తుందని నమ్మి ఇంట్లో సొమ్మంతా పోసి రూ.2 కోట్లు పైనే బెట్టింగ్‌లు పెట్టాడని, చివరకు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. వైసీపీ తప్పుడు సర్వేలతోనే ఆయన మృతిచెందాడని, దానికి పరోక్షంగా జగనే కారణమని ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో వైసీపీ తప్పుడు సర్వేలు నమ్మి చాలా మంది కార్యకర్తలు ఆస్తులు పోగొట్టుకొని రోడ్డున పడ్డారని అన్నారు. గత ఏడాది జూన్ 9న నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడని, కూటమి ప్రభుత్వం 12న అధికారం చేపట్టిందన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగమని మాట్లాడే వారు జగన్ హయాంలో చలో ఆత్మకూరుకు వెళ్లకుండా చంద్రబాబును అడ్డుకున్నది మరిచిపోయారా అని ప్రశ్నించారు. ఇటీవల తెనాలి పర్యటనలో జగన్ నేరచరిత్ర ఉన్నవారిని పరామర్శించడం అరాచకశక్తులను ప్రోత్సహించడమేనన్నారు. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో 11 సీట్లు కూడా దక్కవన్నారు. ఈ సందర్భంగా సత్తెనపల్లిలో నలుగురు వైసీపీ కౌన్సిలర్లు కన్నా సమక్షంలో టీడీపీలో చేరారు.