Floods in North: ఉత్తరాన వరదలు.. దక్షిణాన ఎండలు
ABN , Publish Date - Jul 11 , 2025 | 03:29 AM
ఉత్తరాది రాష్ట్రాల్లో కుంభవృష్టిగా వర్షాలు కురుస్తుంటే.. దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు వర్షాల కోసం ఎదురుచూపులు చూస్తున్నాయి.

మధ్య, తూర్పు, వాయువ్య భారతాన కుంభవృష్టి
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు
విశాఖపట్నం, జూలై 10(ఆంధ్రజ్యోతి): ఉత్తరాది రాష్ట్రాల్లో కుంభవృష్టిగా వర్షాలు కురుస్తుంటే.. దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు వర్షాల కోసం ఎదురుచూపులు చూస్తున్నాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగా వచ్చినప్పటికీ... తొలి ఆరు రోజులే దక్షిణాదిలో మంచి వర్షాలు కురిశాయి. మే 29 నుంచి జూన్ 16 వరకు రుతు పవనాలు దక్షిణాదిలోనే ఉన్నా.. రాష్ట్రంలో వర్షాభావం కొనసాగింది. మళ్లీ జూన్ మూడు, నాలుగు వారాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. జూలైలో వర్షాలు మెరుగుపడతాయని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. జూన్ 1 నుంచి గురువారం వరకు రాష్ట్రంలో 141.9 మి.మీ.కు గాను 101 (28.8ు తక్కువ) మి.మీ. వర్షపాతమే నమోదైంది. రాష్ట్రంలోని 8 జిల్లాల్లో సాధారణ, మిగిలిన జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. పల్నాడు, నెల్లూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి.
అక్కడ వరద.. ఇక్కడ ఎండ మంట
నైరుతి రుతుపవనాలు కొద్దిరోజులుగా మధ్య, వాయువ్య, తూర్పు భారతదేశంలో నిలకడగా ఉండిపోయాయి. అక్కడి రాష్ట్రాల్లో కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్నాయి. కేరళ, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు దక్షిణ భారతంలోని మిగిలిన ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎండలు మండిపోతుండటంతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి గత రెండు వారాల్లో పశ్చిమబెంగాల్‌కు ఆనుకుని బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడ్డాయి. నైరుతి రుతు పవనాల (4నెలలు) కాలంలో తడి, పొడి దశలు ఉంటాయని, ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పొడి దశ కొనసాగుతోందని, కొద్దిరోజుల్లో తడి (వర్షాలు కురవడం) దశ వస్తుందని వాతావరణ నిపుణులు తెలిపారు.
రెండు మూడు రోజుల్లో మనకూ వర్షాలు!
రుతుపవన ద్రోణి రానున్న రెండు మూడు రోజుల్లో దక్షిణాది వైపు వచ్చే అవకాశం ఉందని, దీంతో ఈ నెల 13 నుంచి ఉత్తర కోస్తాలో ఓ మాదిరి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణుడొకరు చెప్పారు. 15 తర్వాత రాయలసీమ, మధ్య కోస్తాలోనూ ఓ మాదిరి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఇస్రో వాతావరణ నిపుణుడు తెలిపారు.