Share News

Fake Property Registration: మామూళ్ల మత్తులో నకిలీ రిజిస్ట్రేషన్లు!

ABN , Publish Date - Jul 24 , 2025 | 03:57 AM

గుంటూరు సమీపంలోని గోరంట్ల పరిధిలో రూ.40కోట్ల విలువైన భూమికి నకిలీ రిజిస్ర్టేషన్‌ చేయడం వెనుక భారీగా..

Fake Property Registration: మామూళ్ల మత్తులో నకిలీ రిజిస్ట్రేషన్లు!

  • రూ.40కోట్ల ఆస్తి రిజిస్ట్రేషన్‌కు భారీగా వసూళ్లు

  • విశ్రాంత జాయింట్‌ రిజిస్ర్టార్‌పై కేసు నమోదు

గుంటూరు సిటీ, జూలై 23(ఆంధ్రజ్యోతి): గుంటూరు సమీపంలోని గోరంట్ల పరిధిలో రూ.40కోట్ల విలువైన భూమికి నకిలీ రిజిస్ర్టేషన్‌ చేయడం వెనుక భారీగా ముడుపులు చేతులు మారినట్లు తెలిసింది. కొద్దినెలల కిందట ఉద్యోగ విరమణ పొందిన నరసరావుపేట జాయింట్‌ రిజిస్ర్టార్‌ ముందుగానే అన్నీ మాట్లాడుకుని నకిలీ రిజిస్ట్రేషన్‌కు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. ప్రస్తుతం నల్లపాడు పోలీసుల అదుపులో ఉన్న కీలక నిందితుడు మొత్తం గుట్టు విప్పినట్లు తెలుస్తోంది. ఆ విశ్రాంత జాయింట్‌ రిజిస్ర్టార్‌ గుంటూరులో పనిచేసిన సమయంలో మానస సరోవరాన్ని కూడా పలువురికి రిజిస్టర్‌ చేశారని, కలెక్టర్‌ జోక్యంతో దానిని రద్దు చేసినట్లు సమాచారం. పిడుగురాళ్ల, ఒంగోలు, నెల్లూరు తదితర ప్రాంతాల్లో కూడా ఆయన కొన్ని వందల నకిలీ రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒంగోలులో జరిగిన నకిలీ చలానాల కుంభకోణంలో కూడా ఆయన పాత్ర ఉన్నట్లు చెబుతున్నారు. గోరంట్లలో రూ.40కోట్ల ఆస్తి రిజిస్ర్టేషన్‌ వ్యవహరంలో సదరు జాయింట్‌ రిజిస్ర్టార్‌ భారీగా వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహరంలో ఓ సీనియర్‌ అసిస్టెంట్‌తోనే 18 జీపీఏలు చేయించినట్లు తెలిసింది. ప్రస్తుతం పల్నాడులో ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ర్టార్‌గా ఉన్న ఆ సీనియర్‌ అసిస్టెంట్‌పై కూడా కేసు పెట్టాలని బాధితులు కోరుతున్నారు. ఆ జాయింట్‌ రిజిస్ర్టార్‌తో పాటు గుంటూరుకు చెందిన మరో రిజిస్ర్టార్‌పై నల్లపాడు పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. గోరంట్ల పరిధిలోని ఆస్తి యజమాని కొత్తపల్లి పద్మజ గతంలోనే మృతి చెందారు. ఆమె ఆధార్‌ కార్డు ఆధారంగానే ఆస్తి బదలాయింపు జరగాలి. రిజిస్ట్రేషన్‌ సమయంలో అసలు యజమాని వేలిముద్రలు కూడా సరిపోలాలి. అయితే మామూళ్ల మత్తులో ఉన్న విశ్రాంత జాయింట్‌ రిజిస్ర్టార్‌ ఇష్టానుసారంగా వ్యవహరించి నకిలీ వ్యక్తితో రిజిస్ట్రేషన్‌ చేసేశారు. ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్లకు కొరిటుపాడులో అనుమతి ఇచ్చారని సమాచారం. ఈ నకిలీ రిజిస్ట్రేషన్‌పై పద్మజ భర్త కొత్తపల్లి శ్రీనివాసరావు అప్పట్లోనే నరసరావుపేట వెళ్లి అధికారులను సంప్రదించినా పట్టించుకోలేదు. దీంతో బాధితుడు స్టాంప్స్‌, రిజిస్ర్టేషన్‌ గుంటూరు డీఐజీకి ఫిర్యాదు చేశారు. దీంతో నకిలీ రిజిస్ట్రేషన్‌పై మాజీ జాయింట్‌ రిజిస్ర్టార్‌ అప్పట్లో హడావిడిగా నరసరావుపేట పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

Also Read:

దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!

శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!

For More Health News

Updated Date - Jul 24 , 2025 | 03:57 AM