Share News

Excise Department: పర్మిట్‌తో ఆదాయం పెంచుదాం

ABN , Publish Date - Jun 30 , 2025 | 02:46 AM

ఆదాయం పెంచుకోవడంపై ఎక్సైజ్‌ శాఖ దృష్టి సారించింది. గతేడాది కొత్త మద్యం షాపుల పాలసీ వల్ల భారీగా ఆదాయం వచ్చింది. దరఖాస్తు ఫీజుల రూపంలోనే రూ.1,906 కోట్లు వచ్చింది.

Excise Department: పర్మిట్‌తో ఆదాయం పెంచుదాం

  • పర్మిట్‌ రూమ్‌లతో 200 కోట్లు రాబడి

  • నగరాల్లో 7.5 లక్షలు, మిగిలినచోట్ల 5 లక్షలు

  • పర్మిట్‌ రూమ్‌లకు ఫీజుల ప్రతిపాదన

  • గతేడాది దరఖాస్తు ఫీజులతో భారీ ఆదాయం

  • ఇప్పుడు పర్మిట్‌ రూమ్‌లు, బార్‌ పాలసీపై ఎక్సైజ్‌ దృష్టి

  • సెప్టెంబరు నుంచి కొత్త బార్‌ పాలసీ

అమరావతి, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): ఆదాయం పెంచుకోవడంపై ఎక్సైజ్‌ శాఖ దృష్టి సారించింది. గతేడాది కొత్త మద్యం షాపుల పాలసీ వల్ల భారీగా ఆదాయం వచ్చింది. దరఖాస్తు ఫీజుల రూపంలోనే రూ.1,906 కోట్లు వచ్చింది. ఇంత పెద్దమొత్తంలో ఆదాయం వస్తుందని ఎక్సైజ్‌ అధికారులు ఊహించలేదు. దీనివల్ల 2024-25లో రూ.28,842 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తుల ఫీజులు ఉండవు. అందువల్ల ఆ రూ.1900 కోట్ల ఆదాయం రాబట్టుకోవడంపై ఎక్సైజ్‌ శాఖ దృష్టి పెట్టింది. పర్మిట్‌ రూమ్‌లకు అనుమతి ఇవ్వడం ద్వారా దీన్ని భర్తీ చేసుకోవాలని భావిస్తోంది. సెప్టెంబరు నుంచి మద్యం షాపుల వద్ద పర్మిట్‌ రూమ్‌ల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలనే నిర్ణయానికి కొచ్చింది. గతంలో అన్ని షాపులకూ ఏడాదికి రూ.5 లక్షలు పర్మిట్‌ రూమ్‌ ఫీజుగా ఉండేది. ఇప్పుడు దానిని రెండు కేటగిరీలు చేశారు. మున్సిపల్‌ కార్పొరేషన్లలోని షాపులకు రూ.7.5 లక్షలు, మిగిలిన షాపులకు రూ.5 లక్షల చొప్పున ఫీజులుగా ప్రతిపాదించారు. రాష్ట్రంలో 3,736 మద్యం షాపులు ఉన్నాయి. వాటికి రూ.5లక్షల చొప్పున పర్మిట్‌ రూమ్‌ ఫీజుల రూపంలో రూ.186 కోట్లు వస్తుంది. కార్పొరేషన్లలోని షాపులకు రూ.2.5లక్షలు అదనం కాబట్టి మొత్తంగా పర్మిట్‌ రూమ్‌ల ఆదాయం రూ.200 కోట్లు దాటుతుంది. ఆగస్టు వరకు బార్‌ పాలసీకి గడువు ఉన్నందున, కొత్త బార్‌ పాలసీతోపాటు పర్మిట్‌ రూమ్‌లకు అనుమతులు ఇచ్చి, ఆదాయాన్ని భర్తీ చేసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.


ఇప్పటికే ఏడాది నష్టం

వాస్తవానికి పర్మిట్‌ రూమ్‌ల ఆదాయం 2024-25 ఆర్థిక సంవత్సరంలోనూ రావాలి. కానీ కేబినెట్‌ సబ్‌కమిటీ సిఫారసు, ఎక్సైజ్‌ శాఖ అనాలోచిత నిర్ణయం కారణంగా గతేడాది ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది. పర్మిట్‌ రూమ్‌లకు అనుమతిస్తే షాపులే బార్లుగా మారిపోతాయని అప్పట్లో కేబినెట్‌ సబ్‌ కమిటీ అభిప్రాయపడింది. గతంలోనూ ఈ విధానం ఉన్నప్పటికీ ఎక్సైజ్‌ అధికారులు కూడా సబ్‌ కమిటీ అభిప్రాయాన్నే అమలు చేశారు. దీంతో ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోయింది.

పెరుగుతున్న అమ్మకాలు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని బ్రాండ్లను అందుబాటులోకి తీసుకురావడంతో మద్యం అమ్మకాలు పెరుగుతున్నాయి. ఉదాహరణకు ఈ ఏడాది ఏప్రిల్‌లో భారీగా అమ్మకాలు నమోదయ్యాయి. మద్యం విలువలో 11.29 శాతం వృద్ధి రేటు నమోదైంది. పరిమాణం రూపంలో చూస్తే లిక్కర్‌లో 26.09శాతం, బీరులో ఏకంగా 149.14శాతం వృద్ధి కనిపించింది. 2024 ఏప్రిల్‌లో 8.85లక్షల కేసుల బీరు అమ్మితే, ఈ ఏడాది ఏకంగా 22.06లక్షల కేసుల బీరు అమ్ముడైంది. లిక్కర్‌ గతేడాది ఏప్రిల్‌లో 26.23లక్షల కేసులు అమ్మితే, ఈ ఏడాది ఏప్రిల్‌లో 33.07లక్షలు కేసులు అమ్మారు. కాగా కూటమి ప్రభుత్వం ధరలు తగ్గించడంతో అమ్మకాలు పెరిగినా రాబడి ఆ స్థాయిలో కనిపించట్లేదు. మరోవైపు అమ్మకాలు భారీగానే ఉన్నా టార్గెట్ల పేరుతో జిల్లాల అధికారులపై ఉన్నతాధికారులు ఇంకా ఒత్తిడి చేస్తున్నారు. అమ్మకాలు తగ్గితే జిల్లాల అధికారులదే బాధ్యత అని హెచ్చరికలు చేస్తున్నారు.


బార్‌ పాలసీతోనూ రాబడి

ఈ ఏడాది సెప్టెంబరు నుంచి కొత్త బార్‌ పాలసీ అమల్లోకి రానుంది. రాష్ట్రంలో 870 బార్లు ఉన్నాయి. వాటిలో 44 ఖాళీగా ఉండిపోయాయి. త్వరలోనే మొత్తం 870 బార్లకు ఎక్సైజ్‌ శాఖ నోటిఫికేషన్‌ జారీచేయనుంది. తద్వారా దరఖాస్తు ఫీజుల రూపంలో ఆదాయం సమకూరుతుంది. 2022లో తెచ్చిన బార్‌ పాలసీ సమయంలో దరఖాస్తు ఫీజులు రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు మూడు కేటగిరీలుగా పెట్టారు. ఈసారి లైసెన్స్‌ ఫీజులు తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. లైసెన్స్‌ ఫీజులు తగ్గితే దరఖాస్తులు పెరిగే అవకాశం ఉంది. తద్వారా ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరుతుంది. మొత్తంగా గతేడాది దరఖాస్తు ఫీజులతో వచ్చిన రూ.1900 కోట్ల ఆదాయాన్ని వివిధ మార్గాల్లో రాబట్టేందుకు ఎక్సైజ్‌ శాఖ ప్రయత్నిస్తోంది.

Updated Date - Jun 30 , 2025 | 02:47 AM