ఆన్‌లైన్ రిజిస్టర్లు లేవు..
ABN , Publish Date - Nov 24 , 2025 | 12:35 AM
రాజమహేంద్రవరం అర్బన్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వాసుపత్రుల్లో కాలం చెల్లిన మందులను ఇస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు చేపట్టిన దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగు చూశాయి. సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి వచ్చిన మందులను ఆన్‌లైన్ చేయకుండా ఆఫ్‌లైన్‌లో
మాన్యువల్‌గా చూస్తున్నారు
కాలం చెల్లిన మందుల విచారణలో అధికారుల నివేదిక?
రాజమహేంద్రవరం అర్బన్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వాసుపత్రుల్లో కాలం చెల్లిన మందులను ఇస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు చేపట్టిన దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగు చూశాయి. సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి వచ్చిన మందులను ఆన్‌లైన్ చేయకుండా ఆఫ్‌లైన్‌లో రిజిస్టర్‌లు నిర్వహిస్తున్నారంటూ దర్యాప్తులో పేర్కొన్నారు. దీనివల్ల ఏ మెడిసిన్ ఎవరికి అందుతున్నదానిపై పూర్తి వివరాలు తెలియడం లేదని, దీనిపై వైద్యాధికారులకు శిక్షణ ఇవ్వాలని సూచించినట్టు సమాచారం. అయితే కాలం చెల్లిన మందులను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ సక్రమంగా నిర్వహణ చేయడంలేదనే విషయాన్ని దర్యాప్తు అధికారులు ప్రధానంగా ప్రస్తావించినట్టు సమాచారం. ఇదిలా ఉంటే కాలం చెల్లిన మందులను ఇచ్చారంటూ సీఎంకు వెళ్లిన ఫిర్యాదు, తదనంతర పరిణామాలపై దర్యాప్తు అధికారులు స్పష్టమైన నివేదిక రూపొందించలేదని తెలుస్తోంది. నారాయణపురం పరిధిలోని చౌడేశ్వరీనగర్ అర్బన్ హెల్త్ సెంటర్ నుంచి 55 ఏళ్ల మహిళ రెండు దఫాలుగా మందులను తీసుకున్నట్టు నిర్ధారించినా ఆ మందుల ఎక్స్‌పైర్ విషయంలో ఎలాంటి స్పష్టత రావడంలేదు. ఆఫ్‌లైన్‌లో రిజిస్టర్‌లు ఉండడంతో వివరాలు దర్యాప్తులో తేలనట్టు సమాచారం.
జీజీహెచ్‌కు సంబంధం లేదు
అయినా సమగ్ర విచారణకు ఆదేశం
48 గంటల్లో కలెక్టర్‌కు నివేదిక : జీజీహెచ్ సూపరింటెండెంట్
రాజమహేంద్రవరం అర్బన్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాసుపత్రికి వైద్యం కోసం వచ్చిన ఒక వ్యక్తికి కాలం చెల్లిన బీపీ మందులు ఇచ్చారంటూ సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలతో రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పీవీవీ సత్యనారాయణ స్పష్టం చేశారు. అయినా ఈ ఆరోపణలపై సమగ్ర విచారణకు ఆదేశించామని, 48 గంటల్లో కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామని స్పష్టంచేశారు. ఈమేరకు ఆదివారం రాజమహేంద్రవరం జీజీహెచ్‌లోని తన చాంబర్‌లో సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులను దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రి డ్రగ్ స్టోర్, ఫార్మసీ రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు, ఇతర అంశాలను సమగ్రంగా పరిశీలించామని తెలిపారు. సంబంధిత కాలం చెల్లిన బీపీ మాత్రల బ్యాచ్ జీజీహెచ్‌లో ఎప్పుడూ రాలేదని, అయినా దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇప్పటికే ప్రాథమిక నివేదికను కలెక్టర్ ద్వారా ప్రభుత్వాధికారులకు నివేదించామని తెలిపారు. కాలం చెల్లిన టాబ్లెట్లు రాజమహేంద్రవరంలోని ఒక అర్బన్‌హెల్త్ సెంటర్ ద్వారా ఇచ్చినట్టు సమాచారం ఉందని, అయితే సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వారి వివరాలు, స్థలం కచ్చితంగా తెలపకపోవడంతో నిర్ధారించడానికి అవకాశం లేకుండా పోయిందన్నారు. ఈ విషయమై నిజానిజాలు, వాస్తవాలను ప్రజలకు తెలియజేయడానికి నలుగురు అధికారులతో విచారణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. డిప్యుటీ సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణంరాజు, ఆర్‌ఎంవో డాక్టర్ ఆర్‌వీ సుబ్బారావు, ఇన్‌చార్జి మెడికల్ ఆఫీసర్ (డ్రగ్‌స్టోర్స్) డాక్టర్ షేక్ నసీరుద్దీన్, చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ పి.శ్రీనివాస్‌లతో కూడిన కమిటీ రెండు రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదికను కలెక్టర్‌కు సమర్పించాల్సిందిగా ఆదేశించినట్టు ఆయన పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ పి.శ్రీనివాస్, ఆర్‌ఎంవో డాక్టర్ సుబ్బారావు, డ్రగ్ స్టోర్ ఇన్‌చార్జి డాక్టర్ నసీరుద్దీన్ పాల్గొన్నారు.