వసతి గృహ విద్యార్థుల వైద్య సేవలకు యాప్
ABN , Publish Date - Feb 11 , 2025 | 12:27 AM
ప్రభుత్వ వసతిగృహ విద్యార్థులకు అత్యవసరంగా ఉచిత వైద్య సేవలు అందించేందుకు ఐసీఐసీఐ లాంబార్డు సంస్థ మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసినట్టు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. జిల్లాలోని సంక్షేమ వసతిగృహాలు, గురుకుల పాఠశాలలు, చైల్డ్‌కేర్ సెంటర్ల నుంచి చదువుకుంటున్న విద్యార్థులకు అత్యవసర సమయంలో ఉచిత వైద్యసేవలు అందిస్తారన్నారు.

అమలాపురం, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వసతిగృహ విద్యార్థులకు అత్యవసరంగా ఉచిత వైద్య సేవలు అందించేందుకు ఐసీఐసీఐ లాంబార్డు సంస్థ మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసినట్టు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. జిల్లాలోని సంక్షేమ వసతిగృహాలు, గురుకుల పాఠశాలలు, చైల్డ్‌కేర్ సెంటర్ల నుంచి చదువుకుంటున్న విద్యార్థులకు అత్యవసర సమయంలో ఉచిత వైద్యసేవలు అందిస్తారన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం లాంబార్డు సంస్థ ప్రతినిధులు విద్యార్థులకు ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పించడానికి అభివృద్ధి చేసిన మొబైల్ యాప్‌ను ఏవిధంగా వినియోగించాలో అనే అంశంపై జిల్లాలోని సాంఘిక, వెనుకబడిన తరగతుల వసతిగృహాల సంక్షేమాధికారులు, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్స్‌తో వర్కుషాపు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రమాదాలు జరిగినప్పుడు విద్యార్థులు నాన్ క్వాలిఫైడ్ వైద్యుల వద్దకు వెళుతుండడంతో వారు సరైన వైద్య పద్ధతులు పాటించకపోవడంతో అనేక రోగాల బారిన పడుతున్నారన్నారు. 1970 నుంచి 2000 సంవత్సరం వరకు సరైన స్టెరిలైజేషన్ పద్ధతులు పాటించకపోవడంతో జిల్లాలో హెపటైటిస్-సి బాగా వ్యాప్తి చెందిందన్నారు. ఆరోగ్య బీమా పరిధిలోకి వచ్చే విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ వైద్యులు ఉన్న ఆసుపత్రులకు మాత్రమే తీసుకువెళ్లాలని సూచించారు. విద్యార్థులు ఉన్న ప్రాంతాలకు సమీపంలోని ఆసుపత్రులను, నర్సింగ్ హోమ్‌లను మ్యాపింగ్ చేసినట్లు చెప్పారు. జిల్లా సాంఘిక సంక్షేమాధికారి పి.జ్యోతిలక్ష్మీదేవి, వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి పి.సత్యరమేష్, డీఎంహెచ్‌వో డాక్టర్ ఎం.దుర్గారావుదొర పాల్గొన్నారు.