Gorantla Police Custody: రాజమండ్రి సెంట్రల్ జైలు టు గుంటూరుకు గోరంట్ల.. ఎందుకంటే
ABN , Publish Date - Apr 23 , 2025 | 01:18 PM
Gorantla Police Custody: గుంటూరు కోర్టు ఆదేశాల మేరకు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు మాజీ ఎంపీని విచారించనున్నారు.

రాజమండ్రి, ఏప్రిల్ 23: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను (Former MP Gorantla Madhav) రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నేడు, రేపు రెండు రోజుల పాటు గోరంట్లను పోలీసులు విచారించనున్నారు. 23, 24 తేదీల్లో రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి గుంటూరు కోర్టు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ఎంపీ గుంటూరు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పోలీసుల వాహనాలను అడ్డగించి, పోలీసుల అదుపులో ఉన్న చేబ్రోలు కిరణ్‌పై దాడికి గోరంట్ల మాధవ్ యత్నించారు.
దీంతో ఆయనను ఈనెల 10న నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఈకేసుకు సంబంధించి విచారించేందుకు గోరంట్లను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరుకు తరలించారు. గోరంట్ల మాధవ్‌తో మరో ఐదుగురిని ఎస్కార్ట్ వాహనంలో గుంటూరు పోలీసులు తీసుకెళ్లారు. టీడీపీ కార్యకర్త చేబ్రోల్ కిరణ్‌పై దాడి యత్నించిన కేసులో గోరంట్ల మాధవ్‌తో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల పాటు వీరిని విచారించనున్నారు పోలీసులు. విచారణ అనంతరం వీరిని తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. కాగా.. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ భారతిపై టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ ఇటీవల వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే.
Vamsi Court Appearance: విజయవాడ కోర్టుకు వల్లభనేని వంశీ
దీనిపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. కిరణ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో కిరణ్‌ను అరెస్ట్ చేసి తీసుకొస్తున్న సమయంలో పోలీసు వాహనాన్ని మాజీ ఎంపీ అడ్డుకున్నారు. పోలీసుల ఎదుటే కిరణ్‌పై దాడి చేసేందుకు యత్నించారు. దీంతో వెంటనే అడ్డుకున్న పోలీసులు గోరంట్లను అరెస్ట్ చేశారు. ఆపై కోర్టులో హాజరుపర్చగా.. ఆయనకు రిమాండ్ విధించింది కోర్టు. ఈ క్రమంలో గోరంట్లను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. ఈ కేసులో విచారించేందుకు గోరంట్లను కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు గుంటూరు కోర్టులో పిటిషన్ వేయగా.. అందుకు న్యాయస్థానం అంగీకరించింది. గోరంట్లను రెండు రోజుల పాటు విచారించేందుకు అనుమతించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం గోరంట్ల మాధవ్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలులో పోలీసులు అదుపులోకి తీసుకుని గుంటూరుకు తరలించారు.
ఇవి కూడా చదవండి
PSR Remand Report: పీఎస్‌ఆర్ రిమాండ్ రిపోర్ట్‌లో విస్తుపోయే వాస్తవాలు
Pahalgam Attack: బైసారన్ నరమేధంపై విస్తుపోయే వాస్తవాలు చెప్పిన మహిళ
Read Latest AP News And Telugu News