నకిలీ మద్యం తయారుచేస్తున్న ముఠా గుట్టు రట్టు
ABN , Publish Date - Jun 25 , 2025 | 12:30 AM
నిత్యం జనసంచారంతో రద్దీగా ఉండే ఆ ప్రాంతంలోని ఒక ఇంట్లో భారీగా నకిలీ మద్యం తయారీ చేస్తున్నారన్న సమాచారంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గత కొంత కాలం నుంచి ఒక ముఠా ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారు కావడమే కాకుండా బహిరంగ విపణిలో విక్రయాలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ యువకుడు ఇచ్చిన సమాచారంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారుల, కాకినాడ

కోనసీమ జిల్లా కొమరగిరిపట్నంలో ఎక్సైజ్ అధికారుల దాడి
1065 లీటర్ల స్పిరిట్, 6వేల ఖాళీ బాటిళ్లు, లేబుళ్లు, సీలింగ్ మిషన్లు,
ఆటోలో రవాణాకు సిద్ధంగా ఉన్న నకిలీ మద్యం స్వాధీనం
ఎనిమిది మంది అరెస్టు , కీలక సూత్రధారుల కోసం గాలింపు
వివరాలు వెల్లడించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏసీ రేణుక
(అమలాపురం-ఆంధ్రజ్యోతి)
నిత్యం జనసంచారంతో రద్దీగా ఉండే ఆ ప్రాంతంలోని ఒక ఇంట్లో భారీగా నకిలీ మద్యం తయారీ చేస్తున్నారన్న సమాచారంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గత కొంత కాలం నుంచి ఒక ముఠా ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారు కావడమే కాకుండా బహిరంగ విపణిలో విక్రయాలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ యువకుడు ఇచ్చిన సమాచారంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారుల, కాకినాడ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం సంయుక్తంగా ఆ ఇంటిపై సోమవారం అర్థరాత్రి ఆకస్మిక దాడులు చేయడంతో ఆ గ్రామమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. నివాస గృహాల మధ్య నకిలీ మద్యం తయారీ చేస్తున్న ముఠా సభ్యుల తీరుపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పక్కా సమాచారంతో...
కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమరగిరిపట్నం గ్రామంలో తిరుమనాథం దుర్గారావు అనే వ్యక్తి ఇంట్లో నకిలీ మద్యం తయారు చేస్తున్నాడన్న పక్కా సమాచారంతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌శాఖ అధికారులు రాత్రివేళ ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇంట్లో 1065 లీటర్ల స్పిరిట్, 6వేల ఖాళీ సీసాలు, 6వేల మూతలు, 6వేల లిక్కర్ ఫేక్ లేబుల్స్‌తో పాటు నకిలీ మద్యం తయారీకి ఉపయోగించే సీలింగ్ మిషన్, అప్పటికే ఒక ఆటోలో రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్న నకిలీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఎక్సైజ్‌శాఖ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేయగా హైదరాబాద్ నుంచి ఒక ఫైనాన్స్‌ర్ కొరియర్ సర్వీసు ద్వారా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు, కోనసీమ జిల్లా కొమరగిరిపట్నానికి నకిలీ మద్యం తయారీకి ఉపయోగపడే స్పిరిట్‌తో పాటు ఇతర సామాగ్రిని సరఫరా చేస్తున్నట్టు నిర్ధారణకు వచ్చారు. పాలకొల్లులో కూడా ఒక గోడౌన్‌లో 130 లీటర్ల స్పిరిట్, కారమిల్ సీలింగ్ మిషన్, ఖాళీ బాటిళ్లు, లేబుళ్ల సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకుని అక్కడ ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఏసీ బ్లాక్ క్లాసిక్ విస్కీ 180 ఎంఎల్ బాటిళ్లలో స్పిరిట్ కారమిల్ కలిపి నకిలీ మద్యం తయారు చేయడంతో పాటు మిషనరీ ద్వారా సీలు వేస్తారు. ఇది బహిరంగ విపణిలో తక్కువ ధరకు నకిలీ మద్యాన్ని విక్రయిస్తున్నారు. పక్కా సమాచారంతో కాకినాడ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ పి.రేణుక, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్కేడీవీ ప్రసాద్, సీఐ వీరబాబు, ఎస్‌ఐ రవితేజ, అమర్‌బాబు, బాలాజీ, సత్యనారాయణ దాడులు చేశారు.
అరెస్టయింది వీరే..
నకిలీ మద్యం తయారీలో కీలక పాత్ర వహిస్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేసినట్టు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ రేణుక విలేకర్లకు వెల్లడించారు. కొమరగిరిపట్నానికి చెందిన తిరుమనాథం దుర్గారావు, చింతపట్ల సోమశేఖర్, అమలాపురం రూరల్ మండలం పేరూరు వై జంక్షన్‌కు చెందిన చవ్వాకుల ప్రేమ్‌కుమార్, చిందాడగరువుకు చెందిన నేరేడుమిల్లి సుబ్రహ్మణ్యం, పిల్లా శ్రీనివాస్, కాజులూరు మండలం దుద్దిపర్రుకు చెందిన నులుకుర్తి శ్రీనివాసరావు, మాచవరానికి చెందిన బొర్రా సత్యఅప్పారావు, కొమరగిరిపట్నానికి చెందిన పితాని వెంకటదుర్గాసింహాద్రిని అరెస్టు చేసి వారి నుంచి నకిలీ మద్యం తయారీకి ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వారు ఎంతకాలం నుంచి మద్యం తయారు చేస్తున్నారు, వెనకాల సూత్ర, పాత్రధారులు ఎవరు అనే సమాచారంపై విచారణ చేస్తున్నారు. నకిలీ మద్యం తయారీ ముఠాను గుట్టు రట్టు చేసేందుకు ఎక్సైజ్ పోలీసులు చూపిన చొరవపై గ్రామస్తులు హర్షం చేస్తున్నారు.