Kakinada Water Scam: ద్వారంపూడి దర్జా
ABN , Publish Date - Jul 18 , 2025 | 04:16 AM
వైసీపీ ప్రభుత్వంలో సీఎం తర్వాత సీఎంలా గోదావరి జిల్లాలో చెలరేగిపోయిన కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ..

రూ.13.84కోట్ల ప్రభుత్వ ధనానికి ‘నీళ్లు’
కాకినాడలో అడ్డగోలుగా నీళ్ల వ్యాపారం
చార్జీలు కట్టకుండా 11 ఏళ్లుగా ఎగవేత
కాకినాడ పోర్టు, ఓడలకు నీళ్లు విక్రయుస్తూ రూ.కోట్లలో ఆర్జిస్తున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే
(కాకినాడ, ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో సీఎం తర్వాత సీఎంలా గోదావరి జిల్లాలో చెలరేగిపోయిన కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఇప్పటికీ తన తీరుతో అధికారులకు ‘నీళ్లు’ తాగిస్తున్నారు. గనులు, గ్రావెల్, ఇసుక ఒకటేంటి ఎక్కడపడితే అక్కడ వాలిపోయి ఆనాడు రూ.కోట్లలో వెనకేసుకున్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే అడ్డగోలు వ్యవహారం మరొకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. కాకినాడలో ద్వారంపూడి చాన్నాళ్లుగా నీళ్ల వ్యాపారం చేస్తున్నారు. కాకినాడ పోర్టు, పోర్టుకు వచ్చే నౌకలకు నీళ్లు విక్రయిస్తూ రూ.కోట్లు సంపాదిస్తున్నారు. కానీ, ప్రభుత్వానికి చెల్లించాల్సిన నీటి బకాయిలు మాత్రం కట్టడం లేదు. పదకొండేళ్ల నుంచీ ఎగవేస్తుండటంతో ఇప్పుడు ఆ బకాయి రూ.13.84కోట్లకు చేరింది.
కాకినాడ నగరాన్ని ఆనుకుని ఎరువుల కర్మాగారం, ఆయిల్ ఫ్యాక్టరీలు, కాకినాడ సీ పోర్టు ఉన్నాయి. వీటికి నిత్యం పారిశ్రామిక అవసరాలకు నీళ్లు అవసరం. బాయిలర్ల కూలింగ్ దగ్గర నుంచి గ్రీన్ బెల్ట్ నిర్వహణ, ఉద్యోగులు, కార్మికుల అవసరాలకు నీళ్లు కావాలి. కాకినాడ సీపోర్టులో కార్గో ఎగుమతి దిగుమతుల సందర్భంగా పనిచేసే కార్మికులకు, లోపలకు లారీలు వెళ్లి వచ్చే సమయంలో రేగే ధూళి నియంత్రణ, నిత్యం వచ్చిపోయే నౌకల్లో వివిధ అవసరాలకు నీళ్లు పెద్దఎత్తున అవసరం. ఈ నేపథ్యంలో పారిశ్రామిక, ఓడరేవు అవసరాలు తీర్చేలా జిల్లా పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం నీటిపారుదలశాఖ ద్వారా గోదావరి నీటిని వివిధ ప్రైవేటు సంస్థలకు పైపులైన్ల ద్వారా కేటాయిస్తోంది. ఈ సంస్థలు నీటిని తీసుకుని వివిధ పరిశ్రమలకు విక్రయించుకుంటాయి.
నీటి సరఫరా చేసినందుకు ఈ సంస్థల నుంచి నామమాత్రపు చార్జీలను ప్రభుత్వం వసూలు చేస్తోంది. ద్వారంపూడి తన తనయ అంజని పేరుతో గోదావరి నీటిని ఎప్పటినుంచో తీసుకుంటున్నారు. అంజనీ ఏజెన్సీస్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో నిత్యం 0.25ఎంజీడీ నీటిని పైపులైన్ల ద్వారా తీసుకుంటున్నారు. ఈ నీటిని కాకినాడ పోర్టుకు సమీపంలోని శ్రీ విద్యా కాలనీలో శుద్ధి చేస్తున్నారు. ఇందుకోసం నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ శుద్ధి చేసిన నీటిని ద్వారంపూడి కాకినాడ సీపోర్టు, అందులోకి వచ్చే నౌకలకు విక్రయిస్తున్నారు.
నోటీసులు ఇచ్చినా..
ద్వారంపూడి కంపెనీ తరహాలోనే నీళ్ల వ్యాపారం చేస్తున్న తక్కిన కంపెనీలు దాదాపుగా బాకీలు చెల్లిస్తున్నాయి. నాగార్జున ఎరువుల కర్మాగారం ప్రభుత్వానికి రూ.1.47కోట్లు బాకీ ఉంది. నోటీసులు జారీ చేయడంతో బాకీలు చెల్లించడానికి ఆ కంపెనీ ముందుకు వచ్చింది. కానీ సదరు ద్వారంపూడి మాత్రం తననెవరూ ఏం చేయలేరనే ధీమాతో వ్యవహరిస్తున్నారు. ఇటీవల అధికారులు నీటి చార్జీల ఎగవేత గుర్తించి తక్షణం బాకీలు చెల్లించాలని గత నెల 27న నోటీసులు జారీ చేశారు. ద్వారంపూడికి 14రోజులు గడువు ఇచ్చారు. ఈ గడువు ఇప్పటికే ముగిసిపోయింది. కానీ ద్వారంపూడి కంపెనీ నుంచి మాత్రం చలనం లేదు. ఇదిలాఉంటే బాకీలు చెల్లించని నేపథ్యంలో ఈ కంపెనీకి గోదావరి ముడి నీటి సరఫరా నిలిపివేయాల్సి ఉన్నా కనీసం ఆ దిశగా నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.
యథేచ్ఛగా నీళ్ల దందా..
ప్రభుత్వం నుంచి ద్వారంపూడి కంపెనీ నీటిని లీటరు రూ.10 చొప్పున కొనుగోలు చేస్తోంది. అదే నీటిని శుద్ధి చేసి రూ.30 చొప్పున పోర్టు, నౌకలు, వివిధ పరిశ్రమలకు విక్రయిస్తున్నారు. ఇలా సరఫరా చేసినందుకు ఎప్పటికప్పుడు ఆయా కంపెనీల నుంచి ఠంచనుగా తమకు రావాల్సిన డబ్బులను వసూలు చేస్తూ ద్వారంపూడి ఏటా కోట్లలో సంపాదిస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి తీసుకుంటున్న గోదావరి నీటికి మాత్రం అసలు చార్జీలే చెల్లించడం లేదు. 2014, ఏప్రిల్ 18 నుంచి 2025, మే 31 వరకు ఒక్క పైసా కూడా ప్రభుత్వానికి కట్టకుండా నీళ్ల దందా కొనసాగిస్తున్నారు. ఏడాదికి రూ.1.24కోట్ల చొప్పున 11ఏళ్లపాటు ద్వారంపూడి కంపెనీ చెల్లించాల్సిన బాకీలు పేరుకుపోయాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్