AP DSC Relaxation 2025: డీఎస్సీ అభ్యర్థులకు ఉపశమనం
ABN , Publish Date - Apr 30 , 2025 | 04:58 AM
డీఎస్సీ అర్హతకు డిగ్రీలో 40 శాతం మార్కులు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు అవకాశం కల్పిస్తూ విద్యాశాఖ సవరణలు చేసింది. దరఖాస్తులో సర్టిఫికెట్ల అప్‌లోడ్‌ను ఐచ్ఛికంగా మార్చింది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 40 శాతం మార్కులున్నా అర్హులే
సర్టిఫికెట్ల అప్‌లోడ్ ఐచ్ఛికం: విద్యాశాఖ
అమరావతి, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ అభ్యర్థులకు డిగ్రీ మార్కుల విషయంలో ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. టెట్‌తో సమానంగా డీఎస్సీ అర్హతకు సవరణలు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 40 శాతం మార్కులు ఉన్నా డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఓసీ అభ్యర్థులు 50 శాతం, మిగిలినవారు 45 శాతం మార్కులు డిగ్రీలో కలిగి ఉండాలనే నిబంధన పెట్టారు. కానీ, గతేడాది నిర్వహించిన టెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు 40శాతం డిగ్రీ మార్కులు ఉన్నా టెట్‌కు అనుమతించారు. కానీ, ఇప్పుడు వారికి 45శాతం చేయడంతో అనేక మంది అర్హత కోల్పోయారు. డీఎస్సీకి అర్హత లేనప్పుడు టెట్‌లో ఎందుకు అర్హత కల్పించారని అభ్యర్థులు ప్రశ్న లేవనెత్తారు. టెట్‌లో అర్హత సాధించిన వారందరికీ డీఎస్సీలో అర్హత కల్పించాలని డిమాండ్ చేశారు. అభ్యర్థుల వినతులను పరిగణలోకి తీసుకున్న పాఠశాల విద్యాశాఖ టెట్‌తో సమానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 40 శాతం మార్కులున్నా డీఎస్సీలోకి అనుమతించేలా ఈ సవరణలు చేసింది. స్కూల్ అసిస్టెంట్, టీజీటీ పోస్టులకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. అలాగే, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయడం ఐచ్ఛికమని పేర్కొంది. నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో తప్పనిసరిగా దరఖాస్తు సమయంలోనే సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాలనే నిబంధన పెట్టారు. దీనివల్ల సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని, ఉద్యోగాలకు ఎంపికైన వారి సర్టిఫికెట్లు మాత్రమే పరిశీలించాలని అభ్యర్థులు కోరారు. దీనిపై స్పందించిన పాఠశాల విద్యాశాఖ సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయడాన్ని ఆప్షనల్‌గా మారుస్తున్నట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఏకరీతిన ఉండాలి: ఏపీటీఎఫ్
ఉపాధ్యాయుల నియామకం అన్ని పాఠశాలలకు ఏకరీతిన ఉండాలని ఏపీటీఎఫ్-1938 అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, ఎస్.చిరంజీవి అన్నారు. మంగళవారం విజయవాడలో జరిగిన ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడుతూ జీవో 117ను రద్దుచేసి, మూడంచెల పాఠశాలల విధానం అమలు చేయాలన్నారు.