Share News

Ananthapuram News: తాగి.. ఊగుతున్నారుగా...

ABN , Publish Date - Nov 19 , 2025 | 11:11 AM

కర్ణాటక సరిహద్దులోనే మండలం ఉంది. కర్ణాటకలో మద్యంతాగి.. మండలానికి చెందిన యువకులు ఊగుతున్నారు. సరిహద్దు దాటి అవతలికి వెల్లి పూటుగా మద్యం తాగుతున్నారు. అదే మత్తులో ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతూ మండలంలోకి వస్తున్నారు.

Ananthapuram News: తాగి.. ఊగుతున్నారుగా...

- కర్ణాటకలో మద్యపానం

- వాహనాల్లో వేగంగా.. రోడ్లకు అడ్డంగా వస్తున్న మందుబాబులు

- ప్రమాదాలకు కారణమవుతున్న వైనం

చిలమత్తూరు(అనంతపురం): కర్ణాటక(Karnataka) సరిహద్దులోనే మండలం ఉంది. కర్ణాటకలో మద్యంతాగి.. మండలానికి చెందిన యువకులు ఊగుతున్నారు. సరిహద్దు దాటి అవతలికి వెల్లి పూటుగా మద్యం తాగుతున్నారు. అదే మత్తులో ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతూ మండలంలోకి వస్తున్నారు. ప్రమాదాలకు కారణమవుతున్నారు. కిక్కు ఎక్కువైన కొందరూ.. రోడ్లకు అడ్డంగా వస్తూ.. వాహనదారులను బెంబేలెత్తిస్తున్నారు. ప్రమాదాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమవుతున్నారు.


యువతే అధికం

మండలంలో గత ఆరు నెలల్లో 48 వరకు డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయి. పట్టుబడిన వారిలో అత్యధికంగా యువకులే ఉండటం గమనార్హం. మండలానికి సరిహద్దుగా ఉన్న కర్ణాటకలోని బాగేపల్లిలో మద్యం తాగి వస్తూ కొడికొండ చెక్‌పోస్టులో పోలీసులకు పట్టుబడుతున్నారు. యువత.. స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకునేందుకు బాగేపల్లి వద్దకు వెళ్తున్నారు. అక్కడ మద్యం సేవించి ద్విచక్రవాహనాలను అతివేగంగా నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. మద్యం తాగడంతోపాటు ఒకే బైకలో ముగ్గురు, నలుగురు అతివేగంతో వస్తున్నారు. రోడ్డు దాటుతున్న వారిని గమనించకుండా దూసుకుపోతున్నారు. తద్వారా ప్రమాదాలకు కారణమవుతున్నారు.


pandu3.3.jpg

తనిఖీలు చేస్తున్నా తగ్గని వైనం..

కర్ణాటక నుంచి మద్యం తాగి వాహనాలు నడుపుకుంటూ వస్తున్న వారి కోసం స్థానిక పోలీసులు ఇటీవలిగా రోజూ సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు కొడికొండ చెక్‌పోస్టులో డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపడుతున్నారు. ఊగుతూ వాహనాలను నడుపుతున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. అయినా మందుబాబులు తగ్గట్లేదు. చిన్నచిన్న జరిమానాలతో సరిపుచ్చుకుంటుండటంతో వారిలో భయంలేకుండా పోతోందని ప్రజలు చర్చించుకుంటున్నారు.


తాగి వాహనాలు నడపవద్దు..

మద్యం తాగి వాహనాలు నడపడం ప్రమాదాలు కొనితెచ్చుకోవడమే అవుతుంది. మద్యం మత్తులో ఎదరుగా వచ్చే వాహనాలు, వ్యక్తులను ఢీకొట్టడం, రోడ్డుపై వెళ్లే వాహనదారులను ఇబ్బందులు పెట్టడం వంటివి ఘోర ప్రమాదాలకు దారితీస్తున్నాయి. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చ ర్యలు తీసుకుంటాం. అలాచేస్తే వాహనాన్ని సీజ్‌ చేయడంతోపాటు కేసులు నమోదు చేస్తాం.

- మునీర్‌ అహమ్మద్‌,

ఎస్‌ఐ, చిలమత్తూరు


pandu3.jpg

మద్యం ప్రియులకు కేరాఫ్‌ బాగేపల్లి టీబీ క్రాస్‌..

మద్యానికి అలవాటుపడిన వారు కర్ణాటక(Karnataka)లోని టీబీ క్రాస్‌ హైవే ధాబాలకు వెళ్తున్నారు. అక్కడ పీకలదాకా తాగి వాహనాలు నడుపుకుంటూ ఇళ్లకు అతికష్టం మీద చేరుకుంటున్నారు. కర్ణాటకలో మద్యం ధరలు కొంతవరకు ఏపీలో కంటే తక్కువగా ఉండటంతోపాటు టీబీ క్రాస్‌ హైవేలో ఉన్న మద్యం దుకాణాల్లో కోరిన బ్రాండ్లు దొరుకుతున్నాయి. మద్యం సేవించడానికి అనుగుణంగా ధాబాలు ఉంటున్నాయి. అర్ధరాత్రి వరకు తాగినా అక్కడి పోలీసులు చర్యలు తీసుకోరు. దాంతో మద్యంప్రియులకు టీబీ క్రాస్‌, హైవే ప్రాంతాలు కేరాఫ్ గా మారాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

సినిమాల‌కు.. ఇక సెల‌వు! నటనకు వీడ్కోలు.. పలికిన న‌టి తులసి

Read Latest Telangana News and National News

Updated Date - Nov 19 , 2025 | 11:11 AM