DGP Dwaraka Tirumala Rao : మార్చిలోగా లక్ష సీసీ కెమెరాలు
ABN , Publish Date - Jan 21 , 2025 | 04:38 AM
‘రాష్ట్రవాప్తంగా నేరాలను అరికట్టేందుకు మార్చి 31 లోపు లక్ష సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నాం.

నేరాలను అరికట్టడమే లక్ష్యం
ఇప్పటికే క్రైం హాట్ స్పాట్స్‌లో 18 వేలు ఏర్పాటు
సైబర్ తప్ప మిగిలిన నేరాలు తగ్గాయి
డ్రోన్ల వినియోగంతో సత్ఫలితాలు: డీజీపీ
కాకినాడ క్రైం, జనవరి 20(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రవాప్తంగా నేరాలను అరికట్టేందుకు మార్చి 31 లోపు లక్ష సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నాం. ఇప్పటికే క్రైం హాట్ స్పాట్స్‌లో 18 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం’ అని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లో సోమవారం ఆయన పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆర్టీసీ డిపోలను ఆ సంస్థ ఎండీ హోదాలో పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీజీపీ మాట్లాడారు. ‘రాష్ట్రంలో సైబర్ నేరాలు మినహా మిగతా నేరాలు తగ్గుముఖం పట్టాయి. గత 7, 8 నెలల్లో శాంతి భద్రతలను పరిరక్షించడంలో, నేరాలను అదుపు చేయడంలో అధునాతన సాంకేతికతతో కూడిన పురోభివృద్ధిని సాధించాం. ప్రజా సంక్షేమం కోసం మరిన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. డ్రోన్స్‌ను వినియోగంలోకి తేవడం ద్వారా నిర్జన ప్రదేశాల్లో జరిగే అరాచకాలను, అసాంఘిక కార్యకలాపాలాను నిరోధించగలుగుతున్నాం. ఫింగర్ ప్రింట్స్ విభాగంలో జాతీయ స్థాయిలో పోటీ జరిగితే ఆంధ్రప్రదేశ్ ఒకసారి మొదటి స్థానంలో ఉంటే మరోసారి తెలంగాణ ఉంటుంది. రెండేళ్లుగా పరిష్కారం కాని హత్య కేసులు, హత్యాచారం కేసులను ఈ ప్రభుత్వంలో ఛేదించాం. గతంలో జరిగిన సోషల్ మీడియా కేసులను కూడా బయటకు తీసి దర్యాప్తు వేగవంతం చేశాం.
సైబర్ నేరాలు దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోయాయి. వీటిని అరికట్టడానికి సులువైన మార్గం అవగాహనా కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయడమే. మౌలిక సదుపాయాల్లో భాగంగా ట్రాఫిక్ విభాగానికి రూ.10 కోట్లు ఖర్చు చేశాం. పోలీసు సంక్షేమానికి ఈ ప్రభుత్వం పెద్దపీట వేసింది. గతంలో పోలీస్ అమరవీరుల దినోత్సవానికి రూ.10 కోట్లు ఖర్చుపెడితే ప్రసుత్తం రూ.20 కోట్లు మంజూరు చేశాం. ఈ ప్రభుత్వంలో 14 మంది సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పించాం. కొత్త ప్యానల్ తయారైన వెంటనే మరో వారంలో 39 మంది సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తాం. మహిళలు, చిన్న పిల్లలపై జరుగుతున్న అరాచకాలు, అత్యాచారాలను అరికట్టేందుకు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం’ అని డీజీపీ వివరించారు. కార్యక్రమంలో ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్, కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్, అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ బి.కృష్ణారావ్, ట్రైనీ ఏఎస్పీ సుస్మీత, ఏఎస్పీ భాస్కర్‌రావ్, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.