Deputy CM Pawan: మీరెలా వస్తారో చూస్తాం
ABN , Publish Date - Jul 05 , 2025 | 03:52 AM
వైసీపీ నాయకులు ప్రజల కోసం ఆలోచించరు. రౌడీయిజం, గూండాయిజం చేయాలన్నదే వారి భావన. మళ్లీ మేమొస్తే... అని ఇప్పటి నుంచే బెదిరిస్తున్నారు. వాళ్లను మళ్లీ అధికారంలోకి రానివ్వం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

వైసీపీని మళ్లీ రానివ్వం.. ఆ పార్టీ రౌడీయిజానికి భయపడం
నరుకుతాం అంటే మౌనంగా ఉంటామా?
గూండాయిజం తప్ప ప్రజలకు మేలు చేయటం ఆ పార్టీ నేతలకు తెలియదు
తాటాకు చప్పుళ్లకు కూటమి భయపడదు
మరో పదిహేనేళ్ల వరకు కలిసే ఉంటాం
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టీకరణ
మార్కాపురంలో ‘జల్‌జీవన్’ పనులకు శ్రీకారం
‘వైసీపీ నాయకులు గత ఐదేళ్లూ అభివృద్ధిని గాలికొదిలేశారు. అధికారం చేజారిపోయాక మళ్లీ మేమొస్తే అంటూ బెదిరించాలని చూస్తున్నారు. 2029లో వైసీపీ అధికారంలోకి ఎలా వస్తుందో చూస్తాం’
- ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
ఒంగోలు, జూలై 4(ఆంధ్రజ్యోతి): ‘‘వైసీపీ నాయకులు ప్రజల కోసం ఆలోచించరు. రౌడీయిజం, గూండాయిజం చేయాలన్నదే వారి భావన. మళ్లీ మేమొస్తే... అని ఇప్పటి నుంచే బెదిరిస్తున్నారు. వాళ్లను మళ్లీ అధికారంలోకి రానివ్వం’’ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. సినిమా డైలాగులు ప్రజలకు వినోదం కోసం, ఉత్సాహం నింపటానికి మాత్రమేనన్నారు. రాజకీయాల్లో తాను సినిమా డైలాగులు చెప్పనని తెలిపారు. అయితే, వైసీపీ నాయకులు సినిమా డైలాగులు ఉపయోగించి నరుకుతాం, చంపుతాం, రంపాలు తెస్తాం, రప్పా రప్పా కోస్తాం.. అని అంటున్నారని, ఇలాంటి బెదిరింపులకు భయపడేవాళ్లం కాదని పవన్ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నరసింహాపురంలో జల్ జీవన్ మిషన్ కింద రూ.1,290 కోట్లతో చేపడుతున్న తాగునీటి పథకానికి శుక్రవారం పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో లేనప్పుడు, రెండు చోట్ల ఓడిపోయినప్పుడే పోరాటం చేశానని, ఇక్కడ ఉన్న మీతోపాటు నాకూ గుండెల్లో దమ్ము, రక్తంలో వేడి ఉందన్నారు. రౌడీయిజం చేసే వాళ్లు మెడకాయలు కోస్తామని బెదిరిస్తే తామేమైన చొక్కాలు విప్పుకొని ఉన్నామా? అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి కూటమిగా ఉన్నామని, ప్రజలు తమపై నమ్మకంతో రికార్డు మెజారిటీ ఇచ్చారని తెలిపారు.
కూటమి... పిడికిలి!
అన్నివేళ్లు కలిసి ఉన్నట్టు కూటమి అంటే పిడికిలి లాంటిదని పవన్ కల్యాణ్ తెలిపారు. వైసీపీ తాటాకు చప్పుళ్లకు తాము భయపడేది లేదన్నారు. వ్యక్తిగతంగా తమకు ఏ ఒక్కరిపైనా ద్వేషం లేదని చెబుతూ సగటు మనిషిని మనిషిగా చూడకుండా నరుకుతాం అంటూ భయభ్రాంతులకు గురిచేస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ‘‘వైసీపీ నాయకులు మాట్లాడితే.. మళ్లీ మేమొస్తే.. మేమొస్తే.. అని అంటున్నారు. అసలు మళ్లీ 2029లో మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం.’’ అని పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. వైసీపీని అధికారంలో రాకుండా చేసేందుకే టీడీపీ, బీజేపీ, జనసేన మరో 15 ఏళ్లు కలిసే ఉంటాయని, వైసీపీ ఆటలు సాగనిచ్చేది లేదని స్పష్టం చేశారు. ‘‘మాట్లాడితే.. వైసీపీ వారేదో అద్భుతమైన పాలన చేసినట్టు ప్రజల ముందు వాపోతున్నారు కదా? నిజంగా ప్రజలకు మేలు చేసి ఉంటే 11 సీట్లకు ఎందుకు పరిమితమయ్యారు.’’ అని ప్రశ్నించారు. జల్ జీవన్ మిషన్ కింద గత ఐదేళ్లలో కేంద్రం రూ.26 వేల కోట్ల నిధులు మంజూరు చేస్తే వాటికి రాష్ట్రప్రభుత్వం 50 శాతం వాటా కూడా ఇవ్వకుండా వదిలేశారని దుయ్యబట్టారు. ఐదేళ్లలో కేవలం రూ.4 వేల కోట్లు మాత్రమే ఖర్చుచేశారని, అది కూడా ప్రణాళిక లేని పనులతో కేవలం పైపులైన్లు వేసి చేతులు దులుపుకొన్నారని తెలిపారు.
నేనే పర్యవేక్షిస్తా!
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం చంద్రబాబుతో కలిసి కేంద్రంతో సంప్రదింపులు జరిపితే తొలివిడతగా రూ.1,290 కోట్లు మంజూరు చేశారని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆ నిధులతోనే ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంత ప్రజల దాహార్తి తీర్చేందుకు పనులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఈ పనులు కేవలం 18 నెలల్లో పూర్తిచేసేలా తానే స్వయంగా పర్యవేక్షిస్తానని వివరించారు. వైసీపీ నాయకులు ఐదేళ్లూ నిధులు దోచుకుని ఎన్నికల్లో ఓడిపోతున్నామని తెలుసుకున్నాక శిలాఫలకాలు వేస్తే చూస్తూ ఉండటానికి ప్రజలు అమాయకులు కారని అన్నారు. ‘‘దోచుకున్న డబ్బులతో ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చుచేస్తారు. కానీ, వెలిగొండ వంటి ప్రాజెక్ట్‌ను పూర్తిచేయాలనే ఆలోచన మాత్రం వారి లో ఉండదు. కానీ, కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతో సీఎం చంద్రబాబు సారథ్యంలో వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తిచేసేందుకు కృతనిశ్చయంతో ఉంది. పూర్తిచేసేది కూటమి ప్రభుత్వమే.’’ అని పవన్ కల్యాణ్ అన్నారు. కార్యక్రమానికి ముందు జిల్లాలోని 578 ఆవాసాలకు రూ.1,290 కోట్లతో తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని పవన్‌కల్యాణ్ ఆవిష్కరించారు.
కూటమిలో కలిసి ఉండండి
జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి తనకు ఆత్మీయుడని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆయన వైసీపీలో ఉన్నా వ్యక్తిగతంగా ఆయనతో తనకు గొడవలు లేవన్నారు. గత ప్రభుత్వంలో కూడా కొన్ని సందర్భాల్లో బాలినేని తనకు అండ గా నిలిచారని తెలిపారు. సమస్యలపై అవగాహ న ఉన్న వ్యక్తి అని, రాజకీయాలు ఎలా చేయాలో తెలిసిన వ్యక్తి అని పేర్కొన్నారు. అందుకే ఆయనను జనసేనలోకి ఆహ్వానించానని, కుటుంబంలోకి కొత్త వ్యక్తి వస్తే కొన్ని సమస్యలు వస్తాయని సరిదిద్దుకోవాలని సూచించారు. కూటమిలో అందరూ కలిసి ఉండాలన్నారు.
తనయులతో మంగళగిరికి పవన్
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో తన పెద్ద కుమారుడు అకీరా నందన్, చిన్న కుమారుడు మార్క్ శంకర్‌తో కలిసి మంగళగిరిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద హెలికాప్టర్ దిగి ముగ్గురూ లోపలికి వెళ్తుండగా తీసిన ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిం ది. సింగపూర్ స్కూలులో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ ఇటీవలే కోలుకున్నాడు. దీంతో పవన్.. వీలునుబట్టి మార్క్ శంకర్‌తో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇప్పుడు ముగ్గురూ ఒకే ఫొటోలో కనిపించడం అభిమానులకు కనుల పండువగా మారింది. కాగా, మంగళగిరి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అధికారులు, పార్టీ ప్రతినిధులతో ముఖ్యమైన విషయాలపై చర్చించారు.
కీరవాణికి పవన్ జన్మదిన శుభాకాంక్షలు
సినీ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణికి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఓ ప్రకటనలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘మీరు మరిన్ని సంవత్సరాలు అద్భుతమైన సంగీతాన్ని అందించాలి. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు అందించాలి’ అని ఆకాంక్షించారు.