Share News

CPI Opposes: బలవంతపు భూసేకరణకే వ్యతిరేకం

ABN , Publish Date - Jul 11 , 2025 | 03:40 AM

పరిశ్రమల స్థాపనకు, రాష్ట్ర అభివృద్ధికి, ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదని, ప్రజాభీష్టం లేకుండా బలవంతపు భూసేకరణ ఎక్కడ జరిగినా వ్యతిరేకిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పష్టంచేశారు.

CPI Opposes: బలవంతపు భూసేకరణకే వ్యతిరేకం

  • కరేడు రైతుల ఉద్యమాన్ని సీఎంకు తెలియపరుస్తాం

  • మొండిగా ముందుకు వెళితే పోరాటమే: సీపీఐ రామకృష్ణ

ఉలవపాడు, జూలై 10 (ఆంధ్రజ్యోతి): పరిశ్రమల స్థాపనకు, రాష్ట్ర అభివృద్ధికి, ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదని, ప్రజాభీష్టం లేకుండా బలవంతపు భూసేకరణ ఎక్కడ జరిగినా వ్యతిరేకిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పష్టంచేశారు. గురువారం ఆయన ప్రకాశం, నెల్లూరు జిల్లాల సీపీఐ నాయకులతో కలిసి కరేడు గ్రామంలో పర్యటించారు. రైతులు, రైతు కూలీల స్థితిగతులు, ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. అమరావతిలో రైతులు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశ్యంతో స్వచ్ఛందంగా భూములు ప్రభుత్వానికి కట్టపెట్టారని, కానీ కరేడులో పరిస్థితులు అలా లేవన్నారు. కరేడు రైతులు ఇండోసోల్‌ పరిశ్రమకు భూములు ఇవ్వరని, బలవంతపు భూసేకరణ వ్యతిరేకిస్తామనే ఏకాభిప్రాయాన్ని నేరుగా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామన్నారు. రైతులను ఒప్పించి భూములు తీసుకుంటామని కందుకూరు సబ్‌కలెక్టర్‌ పత్రికలకు ఇంటర్వ్యూలు ఇవ్వడం సమంజసం కాదని, స్థానిక ఎమ్మెల్యే రైతుల అభిప్రాయాన్ని వక్రీకరించి చెప్పడం గందరగోళం సృష్టించడమే అని రామకృష్ణ విమర్శించారు. ప్రజాభిప్రాయం లేకుండా ఒక్క గజం భూమిని సేకరించాలని చూసినా సీపీఐ, వామపక్ష పార్టీలు కరేడు రైతులకు అండగా ముందుండి పోరాటం చేస్తాయని హెచ్చరించారు.

Updated Date - Jul 11 , 2025 | 03:40 AM