Vishakhapatnam: కలెక్టర్ కారు, కుర్చీ, కంప్యూటర్ అటాచ్
ABN , Publish Date - Jun 26 , 2025 | 06:24 AM
ప్రభుత్వ న్యాయవాది గా పనిచేసిన వ్యక్తికి గౌరవ వేతనంతో పాటు ఖర్చులు చెల్లించనందుకు గాను కలెక్టర్ కారు, కుర్చీ, కంప్యూటర్‌తో పాటు మరిన్ని వస్తువులను అటాచ్ చేస్తూ నగరంలోని ఏడో అదనపు జిల్లా కోర్టు న్యాయాధికారి తీర్పునిచ్చారు

ఏడో అదనపు జిల్లా కోర్టు న్యాయాధికారి తీర్పు
ప్రభుత్వ మాజీ న్యాయవాదికి గౌరవ వేతనం ఇవ్వనందుకు చర్యలు
డాబాగార్డెన్స్(విశాఖపట్నం), జూన్ 25(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ న్యాయవాది గా పనిచేసిన వ్యక్తికి గౌరవ వేతనంతో పాటు ఖర్చులు చెల్లించనందుకు గాను కలెక్టర్ కారు, కుర్చీ, కంప్యూటర్‌తో పాటు మరిన్ని వస్తువులను అటాచ్ చేస్తూ నగరంలోని ఏడో అదనపు జిల్లా కోర్టు న్యాయాధికారి తీర్పునిచ్చారు. నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది తాళ్లూరు రవికుమార్ గతంలో జిల్లా కోర్టులో ప్ర భుత్వ న్యాయవాదిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయనకు చెల్లించాల్సిన నెలవారీ వేతనంతోపాటు కేసుల్లో ఖర్చుచేసిన బిల్లు మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించలే దు. దీంతో రవికుమార్ జిల్లా కోర్టులో కేసు వేశారు.
ఈ కేసును ఏడో అదనపు జిల్లా న్యాయాధికారి విచారించారు. న్యాయవాదికి చెల్లించాల్సిన రూ.50 లక్షల గౌరవ వేతనంతో పాటు ఆయన ఖర్చుచేసిన రూ.25 లక్షలు కూడా చెల్లించాలని గత జనవరిలో తీర్పునిచ్చారు. అది అమలు కాకపోవడంతో తీర్పును అమలుచేయాలని కోరుతూ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రాష్ట్రప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. న్యాయవాది పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయాధికారి.. రూ.75 లక్షలకు కలెక్టర్ కారు, కుర్చీ, కంప్యూటర్, కార్యాలయంలోని మరిన్ని కంప్యూటర్లు, కలెక్టర్ చాంబర్‌లో 25 కుర్చీలు, ఇతర సామగ్రిని అటాచ్ చేయాలంటూ బుధవారం తీర్పునిచ్చారు.