CM Chandrababu: సింగపూర్ పర్యటన పూర్తి.. అమరావతికి బయలుదేరిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jul 30 , 2025 | 05:17 PM
నాలుగు రోజుల పర్యటన ముగించుకుని సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ నుంచి అమరావతికి బయలుదేరారు. రాత్రికి ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకోనున్నారు.

అమరావతి, జులై 30: సింగపూర్‌లోని తెలుగు ప్రజల అత్మీయ స్వాగతం.. ప్రేమాభిమానాలు మరువలేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సింగపూర్ పర్యటన ముగించుకుని బుధవారం సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌కు బయలుదేరారు. అంతకు ముందు ఆయన బస చేసిన హోటల్‌కు సింగపూర్‌లోని తెలుగు ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చారు. వారితో ఆయన ముచ్చటించారు.
ఈ సందర్భంగా వారికి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన సింగపూర్‌లోని ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. ఆయనకు వీడ్కోలు పలికేందుకు స్థానిక అధికారులతోపాటు తెలుగు ప్రజలు ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో జై సీబీఎన్ అంటూ తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
అర్థరాత్రి అమరావతికి..
సింగపూర్ నుంచి బుధవారం రాత్రి 10.30 గంటలకు హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఆయన చేరుకోనున్నారు. ఆ వెంటనే ప్రత్యేక విమానంలో ఎయిర్ పోర్ట్ నుంచి విజయవాడకు బయల్దేరి వెళ్లనున్నారు. రాత్రి 11.30 గంటలకు సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు.
నాలుగు రోజుల్లో..
నాలుగు రోజుల పాటు 26 సమావేశాలతోపాటు వివిధ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
ఇంకా సింగపూర్‌లోనే..
అయితే సింగపూర్‌లోనే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి. నారాయణ పర్యటన కొనసాగుతోంది. బుధవారం ఉదయం సింగపూర్‌లోని ఎస్‌జే సంస్థ (సుర్బానా జురాంగ్) కార్యాలయాన్ని మంత్రి నారాయణతోపాటు సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు సందర్శించారు. ఈ సందర్భంగా అమరావతిలో సూక్ష్మ స్థాయిలో పచ్చదనం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఆ సంస్థ ప్రతినిధులతో వీరు చర్చించారు.
అయితే అమరావతి మాస్టర్ ప్లాన్‌కు అనుగునంగా పచ్చదనం పెంపునకు సంబంధించి గతంలో స్తూల ప్రణాళిక ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే అమరావతిలో పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేస్తూ.. బ్లూ - గ్రీన్ సిటీగా ప్రభుత్వం నిర్మిస్తున్న విషయం విదితమే.
అమరావతి మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా పార్కులు, రహదారులు పక్కన పచ్చదనం పెంపునకు సంబంధించి పలు ప్రణాళికలు ఈ సందర్భంగా సుర్బాన జురాంగ్ సంస్థ ప్రతినిధులు.. మంత్రి నారాయణతోపాటు ఉన్నతాధికారులకు వివరించారు. ఇక పట్టణ మౌలిక వసతులకు సంబంధించి డిజైన్ల రూప కల్పనలో దశాబ్దాల అనుభవం ఈ ఎస్‌జే సంస్థకు ఉంది.
నాలుగు రోజుల పర్యటన కోసం..
బ్రాండ్ ఏపీ ప్రమోషన్‌లో భాగంగా రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా జులై 26వ తేదీన సింగపూర్‌కు సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, పి నారాయణతోపాటు పలువురు ఉన్నతాధికారులు రాజధాని అమరావతి నుంచి బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే.
ఈ పర్యటనలో భాగంగా సింగపూర్ దేశాధ్యక్షుడితో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. అలాగే పలు దిగ్గజ సంస్థల ప్రతినిధులు, కంపెనీ సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో ఆయన ప్రతినిధి బృందం వరుసగా సమావేశామైంది. ఆ క్రమంలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, వనరులు, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, పారిశ్రామిక పాలసీ, భూమి లభ్యత తదితర అంశాలను వారికి సీఎం చంద్రబాబు సోదాహరణగా వివరించారు. అలాగే ఈ ఏడాది నవంబర్‌లో విశాఖపట్నం వేదికగా జరగనున్న సదస్సుకు వారిని ఆహ్వానించారు.
అలాగే పలు రౌండ్ టేబుల్ సమావేశాలు జరిపారు. సింగపూర్‌లో రోడ్ షో సైతం నిర్వహించారు. అదే విధంగా ఆ దేశంలోని వివిధ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ సంస్థలను సైతం సీఎం చంద్రబాబు సందర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఖాతాల్లోకి నగదు ఎప్పుడంటే.. గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి అచ్చెన్న
ఈ ఆకును నాన్ వేజ్‌తో కలిపి వండుకుని తింటే ..
For More AndhraPradesh News And Telugu News