CM Chandrababu: రైతుకు అండగా నిలవండి!
ABN , Publish Date - Jun 19 , 2025 | 07:01 AM
పొగాకు, మామిడి తదితర పంట ఉత్పత్తుల విషయంలో ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రైతులకు అండగా నిలవాలని అధికారులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.

ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేయండి
సాంకేతికతతో క్రయవిక్రయాలను పర్యవేక్షించండి
పంట ఉత్పత్తులను వాణిజ్య కోణంలోనే చూడండి
ఎగుమతులు పెరిగేలా గ్రేడింగ్ విధానం ఉండాలి
హెచ్‌డీ బర్లీ పొగాకు కొనుగోళ్లలో వేగం పెంచండి
మామిడి, పొగాకు, కోకో పంటల మద్దతు ధరలపై సమీక్షలో అధికారులకు సీఎం చంద్రబాబు నిర్ధేశం
అమరావతి, జూన్ 18(ఆంధ్రజ్యోతి): పొగాకు, మామిడి తదితర పంట ఉత్పత్తుల విషయంలో ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రైతులకు అండగా నిలవాలని అధికారులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. హెచ్‌డీ బర్లీ పొగాకు కొనుగోళ్లలో వేగం పెంచాలని, రైతులకు ఇబ్బంది లేకుండా పంట ఉత్పత్తుల కొనుగోళ్లు చేయాలని ఆదేశించారు. ‘‘పంట వివరాలు, కొనుగోళ్ల పర్యవేక్షణకు సాంకేతికతను వినియోగించాలి. ఎగుమతులను పెంచేందుకు అత్యుత్తమ గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయాలి’’ అని సీఎం అధికారులకు సూచించారు. పొగాకు, మామిడి, కోకో ఉత్పత్తులకు మద్దతు ధరతో పాటు కొనుగోళ్ల అంశాలపై బుధవారం అమరావతి సచివాలయంలో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పంట ఉత్పత్తులను వాణిజ్య కోణంలోనే చూడాలని స్పష్టం చేశారు. రైతుకు వీలైనంత మెరుగైన ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని, అంతర్జాతీయ మార్కెట్‌కు అవసరమైనట్లుగా పంట ఉత్పత్తుల ఎగుమతులు పెంచేందుకు అత్యుత్తమ గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయాలని చంద్రబాబు నిర్దేశించారు.
మరిన్ని పండ్ల ప్రొసెసింగ్ యూనిట్లు ఏర్పాటు
రాష్ట్రవ్యాప్తంగా పండ్లకు సంబంధించిన ప్రొసెసింగ్ యూనిట్లను మరిన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. పొగాకు విషయంలో ఈ ఏడాది హెచ్‌డీ బర్లీ రకం 80 మిలియన్ కిలోల ఉత్పత్తి వచ్చిందని, ఇప్పటి వరకు 27 మిలియన్ కిలోలు విక్రయాలు పూర్తయ్యాయని అధికారులు చెప్పగా, మిగిలిన 53 మిలియన్ కిలోల హెచ్‌డీ బర్లీ పొగాకును త్వరగా కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. ఇందులో 33 మిలియన్ కిలోల పొగాకును 24 కంపెనీల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. మిగతా 20 మిలియన్ కిలోల పొగాకును బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని 7 కేంద్రాల్లో మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలపగా, కొనుగోలు కేంద్రాల వివరాలతో పాటు సంబంధిత సమాచారాన్ని ప్రతి పొగాకు రైతుకూ తెలిసేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
జీఎస్టీ తగ్గింపుపై కేంద్రంతో మాట్లాడాను
పామాయిల్‌పై సుంకం తగ్గింపు, మ్యాంగో పల్ప్‌పై జీఎస్టీని 12శాతం నుంచి 5శాతానికి తగ్గించే అంశంపై ఇప్పటికే కేంద్రంతో మాట్లాడానని, దీనిపై అధికారులు సంబంధిత కేంద్ర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. మామిడికి సంబంధించి పంట ప్రణాళికపై రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. పండించిన పంటకు సరైన ధర దక్కాలంటే ఆ పంటకు మార్కెట్‌లో ఎలాంటి డిమాండ్ ఉందనే సమాచారం రైతుకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం మామిడికి ఒక్కో కిలోకు రూ.4 చొప్పున అదనంగా మద్దతు ధర ఇస్తున్నామని, ప్రొసెసింగ్ యూనిట్లు రూ.8కి తగ్గకుండా కొనుగోలు చేసేలా చూడాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. రైతుకు నష్టం రాకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. అలాగే కోకో పంట 12వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి రాగా, ఇప్పటికే 10వేల టన్నులు విక్రయం కూడా జరిగిందని, రోజూ 80-100 టన్నుల టన్నుల మేర కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. జూలై మొదటి వారానికి మిగిలిన ఉత్పత్తిని కూడా కొనుగోలు చేయించాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ, ఉద్యానశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.