CM Chandrababu: త్వరలో ఏర్పాటు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
ABN , Publish Date - Dec 02 , 2025 | 05:31 PM
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీకి మరో వెయ్యి ఈవీ బస్సులు వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై చర్చించారు.
అమరావతి, డిసెంబర్ 2: ఆర్టీసీకి మరో వెయ్యి ఈవీ బస్సులు వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం సచివాలయంలో విద్యుదుత్పత్తి, పంపిణీలో వ్యయం తగ్గింపుపై అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం(CM Chandrababu) మాట్లాడారు.
‘ప్రభుత్వ భవనాలపై విస్తృత స్థాయిలో సౌర విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు మరో ఏడాది ప్రోత్సాహకాలు కొనసాగించాలి. ఆర్టీసీకి త్వరలోనే వెయ్యి ఈవీ బస్సులు వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేయాలి. ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులు 60 రోజుల్లో కార్యరూపం దాల్చాలి. విద్యుత్ కొనుగోళ్ల భారం తగ్గించుకునేందుకు ఎంవోయూలు కుదుర్చుకోవాలి. ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ ఎంవోయూలు చేసుకోవాలి. ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజల్లోనూ విద్యుత్ పొదుపుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి’ అని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
వైసీపీపై విమర్శలు..
సమీక్షలో సీఎం చంద్రబాబు గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విద్యుత్ వ్యవస్థపై గత ప్రభుత్వం చేసిన పనులపై ఆయన మాట్లాడారు. ‘అసమర్థ నిర్ణయాలతో విద్యుత్ రంగాన్ని గత పాలకులు అస్తవ్యస్థం చేశారు. పీపీఏ రద్దుతో రూ.9వేల కోట్ల భారాన్ని వైసీపీ ప్రభుత్వం ప్రజలపై మోపింది. విద్యుత్ వినియోగించకుండానే ప్రజా ధనాన్ని కంపెనీలకు చెల్లించింది’ అని విమర్శించారు.
నిధులు విడుదల..
కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీలో అభివృద్ధి పనులకు ఏపీ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రూ.7.92 కోట్ల అదనపు నిధులు విడుదలకు ప్రభుత్వం పరిపాలనా పరమైన ఉత్తర్వులు జారీ చేసింది. రాయలసీమ యూనివర్సిటీలో భవన నిర్మాణాల చెల్లింపులకు నిధులు వెచ్చించాలని సూచించింది. తదుపరి చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ రిజిస్ట్రార్, ఉన్నత విద్యాశాఖను ప్రభుత్వం ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మాఫియా లేడీ డాన్ కామాక్షమ్మ ఇంటిని కూల్చివేసిన స్థానికులు
For More AP News And Telugu News