Share News

SPF constable: ఆ ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ గతం ఎలాంటిది?

ABN , Publish Date - Jun 21 , 2025 | 01:21 AM

తిరుమలలో విధులు నిర్వహిస్తూ, తమిళనాడు రాష్ట్రం వాణియంబాడిలోని ఓ వ్యాపార వేత్త ఇంట్లో దోపిడీకి ప్లాన్‌ ఇచ్చాడని అరెస్టయిన ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ అరుణ్‌కుమార్‌ గతం ఎలాంటిది? ఈ దిశగా ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.

SPF constable: ఆ ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ గతం ఎలాంటిది?

తిరుపతి(నేరవిభాగం), జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): తిరుమలలో విధులు నిర్వహిస్తూ, తమిళనాడు రాష్ట్రం వాణియంబాడిలోని ఓ వ్యాపార వేత్త ఇంట్లో దోపిడీకి ప్లాన్‌ ఇచ్చాడని అరెస్టయిన ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ అరుణ్‌కుమార్‌ గతం ఎలాంటిది? ఈ దిశగా ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఇటీవల తిరుపతి రిజర్వు విభాగంలో పనిచేస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ రామచంద్ర, కానిస్టేబుల్‌ గుణశేఖర్‌ హైదరాబాదులోని డ్రగ్స్‌ సరఫరాలో పట్టుబడి అరెస్టయిన విషయం తెలిసిందే. వీరిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇంతలో మళ్లీ టీటీడీలో ఎస్పీఎఫ్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అరుణ్‌కుమార్‌ను తమిళనాడు పోలీసులు అరెస్టు చేయడం కలకలం రేపింది. పోలీసు శాఖకు ఇది మాయని మచ్చగా తయారైందన్న విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో అరుణ్‌కుమార్‌ తీరుపై టీటీడీ, ఎస్పీఎఫ్‌ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. మరోవైపు అరెస్టు నేపథ్యంలో అరుణ్‌కుమార్‌ను సస్పెండ్‌ చేయడానికి రాయలసీమ పరిధిలోని ఎస్పీఎఫ్‌ కమాండెంట్‌ డీకేఎస్‌ రాజు రాష్ట్రస్థాయి అధికారులకు సిఫార్సు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాగా, అరుణ్‌కుమార్‌ వాడుతున్న అన్ని సిమ్‌లు, మూడేళ్ల కాల్‌డేటా వివరాలను బయటకు తీస్తున్నారు. దీనిపై ఎస్పీఎఫ్‌.. టీటీడీ విజిలెన్సు అధికారులు వేర్వేరుగా విచారరణ జరుపుతున్నట్లు సమాచారం.

Updated Date - Jun 21 , 2025 | 01:21 AM