Share News

Chevireddy: చెవిరెడ్డి చుట్టూ తుడా ఉచ్చు

ABN , Publish Date - Jul 21 , 2025 | 12:56 AM

లిక్కర్‌ స్కామ్‌లో అరెస్టయి ప్రస్తుతం జైల్లో ఉన్న తుడా మాజీ చైర్మన్‌, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చుట్టూ తుడా ఉచ్చు బిగుసుకుంటోంది.

Chevireddy: చెవిరెడ్డి చుట్టూ తుడా ఉచ్చు
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

ప్రభుత్వ ఆదేశాలతో కేసు నమోదుకు అవకాశం

తిరుపతి(నేరవిభాగం), జూలై 20(ఆంధ్రజ్యోతి): లిక్కర్‌ స్కామ్‌లో అరెస్టయి ప్రస్తుతం జైల్లో ఉన్న తుడా మాజీ చైర్మన్‌, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చుట్టూ తుడా ఉచ్చు బిగుసుకుంటోంది. తుడాలో నిధుల దుర్వినియోగానికి సంబంధించి తిరుపతి ప్రాంతీయ విజిలెన్సు అధికారులు ప్రభుత్వానికి దాదాపు 4300 పేజీల నివేదికను పంపారు. దీంతో ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సిన పరిస్థితి చెవిరెడ్డికీ, అప్పటి తుడా అధికారులకూ ఎదురైంది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు దాదాపు రూ.380 కోట్ల పైచిలుకు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా ఖర్చు చేసినట్లు విజిలెన్సు నివేదికలో పొందుపరిచారు. ఇందులో ఎక్కువ శాతం నిధులు సొంత ప్రయోజనాలకు వాడుకున్నట్లు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. చివరకు తెలంగాణ ఎన్నికల సమయంలోనూ పొలిటికల్‌ సర్వే కోసం తుడా డబ్బును వాడినట్లుగా అధికారులు గుర్తించారు. తుడా నిధులు దాదాపు 90 శాతం వరకు చంద్రగిరి నియోజకవర్గంలోని పనులకు మళ్లించారు. ఇలా చేయడం నేరమని అధికారులు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ఇక చెవిరెడ్డి సొంత ఊరైన తుమ్మలగుంట ట్యాంక్‌ ఆధునికీకరణ పేరుతో కోట్లు దుర్వినియోగం అయిందనీ, ప్రజాధనంతో బెంచీలు ఏర్పాటు చేసి వాటిపై వారి పేర్లు రాసుకున్నారనీ, తుడా చైర్మన్‌గా ఉన్నప్పుడు వ్యక్తిగత పర్యటనలకు కూడా తుడా డబ్బులే ఖర్చు చేశారనీ అధికారుల నివేదికలో పొందుపరిచారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల ఎంపీడీవోలకు అనధికారికంగా పనులు, బడ్జెట్‌ కేటాయించినట్లు చూపించారు. ఆ నిధులను వ్యక్తిగత ఖాతాలో జమచేశారు. అలాగే చెవిరెడ్డి కుటుంబానికి చెందిన సీఎంఆర్‌ కంపెనీనే చాలా కాంట్రాక్టు పనులు చేపట్టింది.


మొత్తంగా చెవిరెడ్డి కుటుంబం తుడా నుంచి భారీగానే నిధులు దుర్వినియోగం చేసినట్లు విజిలెన్సు తేల్చింది. అయితే చైర్మన్‌కు సంతకం చేసే అధికారం లేదని, తనకేం తెలియదని చెవిరెడ్డి మీడియా సమావేశంలో చెప్పారు. దీనిద్వారా తన మాటవిని సంతకాలు పెట్టిన అధికారుల మెడకు కూడా ఉచ్చు బిగుసుకునేలా చేశారాయన. తుడా నిధుల దుర్వినియోగంపై విజిలెన్సు విచారణలో గుర్తించిన అంశాలను బట్టీ ఆయన తప్పించుకోలేరని అధికారుల వాదన. దీంతో లిక్కర్‌ స్కాం కేసులో అరెస్టయి జైలులో ఉన్న చెవిరెడ్డి మెడకు తుడా నిధుల దుర్వినియోగం కేసు కూడా చుట్టుకున్నట్టే అంటున్నారు.

Updated Date - Jul 21 , 2025 | 12:56 AM