Tirupati Tragedy: తిరుపతిలో విషాదం
ABN , Publish Date - Apr 29 , 2025 | 12:18 PM
Tirupati Tragedy: ఐదవ అంతస్తు నుంచి కింద పడి ముగ్గురు కార్మికులు మృతి చెందిన ఘటన తిరుపతిలో పెను విషాదాన్ని నింపింది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తిరుపతి, ఏప్రిల్ 29: తిరుపతిలో (Tirupati) విషాద ఘటన చోటు చేసుకుంది. ఈరోజు (మంగళవారం) ఉదయం మంగళం తుడా క్వార్టర్స్‌లో భవనంపై నుంచి పడి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. కరకంబాడి రోడ్డులోని స్ప్రింగ్ డెల్ ఎదురుగా ఈ ఘటన జరిగింది. సిమెంటు ప్లాస్టరింగ్ పనుల కోసం కర్రలతో నిర్మాణం చేపట్టారు. కర్రలు విడిపోవడంతో ఐదవ అంతస్తు నుంచి కార్మికులు కింద పడిపోయారు. తీవ్రంగా గాయపడిన కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనా స్థలిని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
తుడా క్వార్టర్స్‌లో ఓ రిటైర్డ్ టీచర్ భవనాన్ని నిర్మిస్తున్నారు. జీ ప్లస్ నాలుగు అంతస్థులకు గాను మరో అంతస్థును అదనంగా నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఐదవ అంతస్థులో సిమెంట్ ప్లాస్టరింగ్ చేసేందుకు కింద నుంచి పైకి కర్రల నిర్మాణం చేపట్టారు. అది పూర్తి అయిన తర్వాత పూర్తి భవనాన్ని ప్లాస్టరింగ్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఐదవ అంతస్థు వద్ద ముగ్గురు కార్మికులు కలిసి కర్రలను కడుతున్నారు. ఈ సమయంలో కొయ్యలు ఊడిపోయి ముగ్గురు కార్మికులు కూడా ఐదు అంతస్థుల పై నుంచి కిందపడిపోయారు. ఈ ప్రమాదాన్ని చూసిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. దీంతో 108 సిబ్బంది అక్కడకు చేరుకుని కార్మికులను చూసి వారు చనిపోయినట్లుగా ధృవీకరించారు.
Pawan On Pahalgam Attack: కాల్చుకుంటూ పోతే చూస్తూ ఊరుకోవాలా.. అతిమంచితనం వద్దు
అలాగే పోలీసులు కూడా ఘటనా స్థలికి చేరుకున్నారు. అంతేకాకుండా ఈ భవనానికి అనుమతి ఇచ్చిన తుడా అధికారులు కూడా అక్కడకు చేరుకున్నారు. చనిపోయిన కార్మికులు శ్రీకాళహస్తికి చెందిన వారుగా గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే కార్మికుల కుటుంబసభ్యులు కూడా ఆ ప్రాంతానికి వచ్చి.. తమ వారి మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చనిపోయిన వారిలో పిల్లకూరు మండలానికి చెందిన శ్రీనివాసులు మెయిన్ మేస్త్రీగా ఉన్నారు. అలాగే మిగిలిన ఇద్దరు శ్రీనివాస్, వసంత్ శ్రీకాళహస్తికి చెందిన వారుగా తెలుస్తోంది. శ్రీకాళహస్తి నుంచి వచ్చిన ఈ కార్మికులు.. భవన నిర్మాణం జరుగుతున్న భవనంలోనే ఉండి నిర్మాణ పనులు చూసుకుంటున్నారు. 15 రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లి వస్తున్నట్లు భవన యజమాని తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Rahul letter to PM: పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధానికి రాహుల్ లేఖ
Pakistani Citizens: హైదరాబాద్‌ను వీడిన పాకిస్థానీలు
Read Latest AP News And Telugu News