Share News

Transportation: ఒడిశా టూ శివకాశి

ABN , Publish Date - Nov 11 , 2025 | 01:44 AM

ఒడిశా నుంచి తిరుపతి మీదుగా తమిళనాడుకు తరలిస్తున్న 32 కిలోల గంజాయిని చంద్రగిరి పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు పొన్నుస్వామి సెల్వరాజ్‌ను అరెస్టు చేశారు.

Transportation: ఒడిశా టూ శివకాశి
సీజ్‌ చేసిన గంజాయిని పరిశీలిస్తున్న ఎస్పీ

తిరుపతి(నేరవిభాగం), నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి తిరుపతి మీదుగా తమిళనాడుకు తరలిస్తున్న 32 కిలోల గంజాయిని చంద్రగిరి పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు పొన్నుస్వామి సెల్వరాజ్‌ను అరెస్టు చేశారు. ఈ వివరాలను సోమవారం ఎస్పీ సుబ్బరాయుడు మీడియాకు వివరించారు. ఆయన తెలిపిన ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం శివగంగై జిల్లా కలనివాసల్‌కు చెందిన పొన్నుస్వామి శెల్వరాజ్‌ ఒడిశాలో కొంతకాలం చదువుకున్నాడు. ఆ సమయంలో అతడికి గంజాయి స్మగ్లర్లతో సంబంధాలు ఏర్పడ్డాయి. సులభ సంపాదన కోసం ఇతరుల ప్రోద్బలంతో వాహనం తీసుకుని ఒడిశా వెళ్లాడు. తనకు సంబంధాలున్న స్మగ్లర్లను కలిశాడు. పోలీసులకు కనిపించకుండా ఉండేలా వాహనంలోని డాష్‌ బోర్డు, గేర్‌ బాక్సు, టైర్‌ స్టెప్‌ భాగంలో గంజాయి ఉంచుకుని బయలుదేరాడు. ఎస్పీకి అందిన సమాచారం మేరకు తిరుపతి- నాయుడుపేట జాతీయ రహదారి తువ్వచేనుపల్లి వద్ద చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్‌, సీఐ సురే్‌షకుమార్‌, పాకాల సీఐ సుదర్శన్‌కుమార్‌, ఆర్‌సీపురం ఎస్‌ఐ భక్తవత్సలం, చంద్రగిరి ఎస్‌ఐ అనిత, సిబ్బంది కలసి వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో వీరి వాహనంలో దాచి వుంచిన దాదాపు రూ.6 లక్షల విలువైన 32.730 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తీసుకెళుతున్న తమిళనాడుకు చెందిన పొన్నుస్వామి శెల్వరాజ్‌ను అరెస్టు చేశారు. అతడి నుంచి రెండు మొబైల్‌ ఫోన్లు సీజ్‌ చేసినట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఎక్కడైనా మత్తు పదార్థాలు రవాణా చేసినా, వినియోగిస్తున్న వారి వివరాలు అందించాలని, వారి పేర్లు గోప్యంగా వుంచుతామని ఎస్పీ చెప్పారు. ఎర్రచందనం కేసుల్లో ఇటీవల నిందితులకు 80 శాతం వరకు కఠినంగా శిక్షలు పడుతుండడం అభినందనీయమన్నారు.

Updated Date - Nov 11 , 2025 | 01:44 AM