Tourism: ప్రకృతి, సంస్కృతి ప్రభుత్వ ప్రాధాన్యాలు
ABN , Publish Date - Jan 21 , 2025 | 01:11 AM
ప్రకృతిని సంస్కృతిని గుర్తుపెట్టుకోవడమే కాకుండా వాటి ద్వారా పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయాలన్నదే కూటమి ప్రభుత్వం ఉద్దేశమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.

జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్
సూళ్లూరుపేట/తడ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ప్రకృతిని సంస్కృతిని గుర్తుపెట్టుకోవడమే కాకుండా వాటి ద్వారా పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయాలన్నదే కూటమి ప్రభుత్వం ఉద్దేశమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. సూళ్లూరుపేట కళాశాల మైదానంలో సోమవారం జరిగిన మూడు రోజుల పక్షుల పండుగ ముగింపు సభలో ముఖ్య అతిథిగా మంత్రి మాట్లాడారు. తమ ప్రభుత్వం పర్యాటకరంగాన్ని ప్రోత్సహిస్తుందని, అందులో భాగంగానే నాలుగేళ్లుగా నిలిచిపోయిన పక్షుల పండుగను మళ్లీ నిర్వహించామని తెలిపారు. ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణించి ఈ ప్రాంతానికి వచ్చే విదేశీ వలసపక్షుల విన్యాసాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంటాయన్నారు. అందుకే 2001లో అప్పటి తమ టీడీపీ ప్రభుత్వం పక్షుల పండుగను ప్రారంభించిందని గుర్తుచేశారు. వైసీపీ నిలిపేసిన ఈ పండుగను తమ ప్రభుత్వం వచ్చిరాగానే తిరిగి ప్రారంభించాలని చంద్రబాబు ఆదేశించారన్నారు. సీఎం సూచనల మేరకు ఫ్లెమింగో ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించామన్నారు.
క్లుప్తంగా ప్రసంగాలు
ముగింపు రోజున సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించేందుకు ప్రజలు పోటెత్తి వచ్చారు. సూళ్లూరుపేట కాలేజీ మైదానం నిండిపోయి, ప్రజలు బయటకూడా బారులు తీరారు. సినీరంగానికి చెందిన కళాకారులు నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమాలను ఆపి సభను ప్రారంభించారు. ఇటువంటి సందర్భంలో ఎక్కువ సేపు ఉపన్యాసాలు మంచిది కాదనే ఉద్దేశ్యంతో మంత్రి తర్వాత ప్రసంగించిన వారంతా సంక్షిప్త సందేశాలతో ముగించారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పండుగ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇక జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సైతం ఎమ్మెల్యే విజయశ్రీని అనుసరించి ముగించేశారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సైతం ‘ఇప్పుడు మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి జనాలకు లేదు’ అంటూ ధన్యవాదాలతో ముగించారు. హీరోయిన్లు సంయుక్త మీనన్, కృతిశెట్టి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మంగ్లీ పాట హుషారెత్తించింది.
హాజరైన ఐదుగురు ఎమ్మెల్యేలు
ముగింపు సమావేశంలో గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, చీరాల ఎమ్మెల్యేలు పాశిం సునీల్‌కుమార్, కురుగుండ్ల రామకృష్ణ, బొజ్జల సుధీర్‌రెడ్డి, ఎంఎం కొండయ్యలు పాల్గొన్నారు. శ్రీసిటీ ఎండీ డాక్టర్ రవీంద్రసన్నారెడ్డి, చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్టు సెల్వం, పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాకాటి నారాయణరెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం, తానంకి నానాజీ, మాజీ మంత్రి పరసారత్నం, జనసేన నాయకుడు ఉయ్యాల ప్రవీణ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సన్నారెడ్డి దయాకర్‌రెడ్డి, టూరీజం ఆర్డీ రమణప్రసాద్, ఆర్డీవో కిరణ్మయి, జిల్లా పర్యాటక అధికారి జనార్థన్‌రెడ్డి పాల్గొన్నారు.
20 నిమిషాల్లోనే సభ పూర్తి
తడ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): పక్షుల పండుగ చివరిరోజు సమావేశం కేవలం 20 నిమిషాలలోనే ముగిసిపోయింది. మంత్రులు, నాయకులు, అధికారులు ముఖ్య అతిథులంతా 7 గంటలకే వేదిక వద్దకువచ్చి వేదిక ముందు ఆశీనులయ్యారు. సుమారు గంటకుపైగా నిమిషాలపాటు సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు. 8.10 గంటల సమయంలో అందరిని స్టేజీపైకి ఆహ్వానించగా 20 నిమిషాలలోనే అంటే 8.30 గంటలకు సమావేశంలో వక్తలు మాట్లాడటం పూర్తయిపోయింది. దేవదాయశాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి 7 గంటలకే వచ్చి వేదిక ముందు ఆశీనులయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించిన ఆయన 8 గంటల సమయంలో స్టేజీ పైకి రాకుండానే అలాగే వెళ్లిపోయారు.
ఘనంగా ముగిసిన పక్షుల పండుగ
సూళ్లూరుపేట, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల తరువాత మూడురోజులపాటు జరిగిన ఫ్లెమెంగో ఫెస్టివల్ ఘనంగా ముగిసింది. తొలిరోజు ఏర్పాట్లలో తడబడినా మిగిలిన రెండు రోజులూ అన్ని విభాగాల అధికారులూ సమన్వయంతో సక్సెస్ చేశారు. ముఖ్యంగా సూళ్లూరుపేట ప్రభుత్వ కళాశాల మైదానంలో సాయంత్రాలు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు హుషారెత్తించాయి. సినీ నటులూ, గాయకులూ రావడంతో జనం పోటెత్తారు. మూడోరోజు సోమవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల నుంచి పాఠశాలలు, కళాశాలల విద్యార్ధులు వేలాదిగా పక్షుల పండుగకు తరలివచ్చారు. రంగు రంగుల యూనిఫారాల్లో పిల్లలు సందడి చేశారు. నేలపట్టులో పక్షుల వీక్షణకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అటకానితిప్ప వద్ద కూడా ఆటలతో సందడిగా గడిపారు. బీవీపాలెం పడవల రేవు మూడో రోజు కూడా కిక్కిరిసిపోయింది. సూళ్లూరుపేట ప్రధాన వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్ వద్ద జనం బారులు తీరారు. ఈ ప్రాంతంలో జరిగే చెంగాళమ్మ జాతరను ఫ్లెమింగో ఫెస్టివల్ తలపించింది. మరోవైపు ఆటల్లోనూ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఉత్సాహంగా క్రీడలు
నిజానికి తొలిరోజు కురిసిన వర్షంతో ఆదివారం సాయంత్రం వరకు క్రీడలు జరగలేదు. నిర్వాహకులు ఆగమేఘాలమీద మట్టి, ఇసుక తోలి చదును చేసి క్రీడాప్రాంగణాన్ని సిద్ధం చేశారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచే కబడీ, వాలీబాల్ పోటీలు ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆడారు. రాత్రి 7 గంటల వరకూ క్రీడా పోటీలు జరిగాయి.