Share News

CM Chandrababu: నేరస్థులు, హత్యా రాజకీయాలు చేసే వాళ్లు అవసరమా?

ABN , Publish Date - Jul 19 , 2025 | 04:36 PM

రాజకీయాలు కలుషితమైపోయాయని, నేరచరిత్ర ఉన్నవారు రాజకీయాల్లోకి వచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. నేర రాజకీయాలు చేసేవారు మనకు అవసరమా? అంటూ ఆయన ప్రశ్నించారు.

CM Chandrababu: నేరస్థులు, హత్యా రాజకీయాలు చేసే వాళ్లు అవసరమా?
CM Chandrababu

తిరుపతి, జులై 19: తిరుపతిలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. ముందుగా కార్యక్రమంలో పాల్గొని స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించారు. ఏపీని స్వచ్ఛాంధ్రగా మారుస్తూ అనేక అవార్డులు సాధిస్తున్నామని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో ఏపీకి ఐదు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు వచ్చాయని, అవార్డులు సాధించిన వారందరికీ అభినందనలు తెలియజేశారు సీఎం చంద్రబాబు. రాష్ట్రాభివృద్ధి కోసం ఒక్కో నెల ఒక్కో కార్యక్రమం చేపట్టామన్నారు.

'పర్యావరణాన్ని కాపాడుదాం.. ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం' అని పిలుపునిచ్చిన సీఎం చంద్రబాబు.. ప్లాస్టిక్ ఎక్కువగా వాడితే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎంతో ప్రమాదకరమని చంద్రబాబు చెప్పారు. 120 మైక్రాన్ ఉన్న కవర్లను పూర్తిగా నిలిపేద్దామన్నారు. క్లాత్ బ్యాగ్ వెండింగ్ యంత్రాలను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పిన సీఎం.. ప్రపంచంలో ఏ వస్తువు నిరుపయోగం కాదని.. నిరుపయోగంగా ఉన్న వస్తువు నుంచి సంపద సృష్టించవచ్చని తెలిపారు. ప్రగతి పథంలో ముందుకెళ్తున్న మన రాష్ట్రానికి ఇప్పుడు నేర, హత్యా రాజకీయాలు చేసేవాళ్లు అవసరమా? అని సీఎం ప్రశ్నించారు.


ఏపీలో పేరుకుపోయిన చెత్తను అక్టోబర్‌లోగా శుభ్రం చేస్తామన్న చంద్రబాబు.. ఏపీ స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారాలంటే స్వచ్ఛాంధ్ర ప్రదేశ్‌గా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ బాగుండాలంటే అందరూ స్వచ్ఛత పాటించాలని, ఆగస్టు నెలలోగా సచివాలయంలో ప్లాస్టిక్ పూర్తిగా నిషేధమని చంద్రబాబు తెలిపారు. డిసెంబర్‌లోగా ప్రభుత్వ ఆఫీసుల్లోనూ ప్లాస్టిక్ నిషేధం జరుగుతుందని చెప్పారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మించి.. AIని అభివృద్ధి చేస్తామని, క్వాంటమ్ వ్యాలీకి చిరునామాగా అమరావతి మారుతుందని చంద్రబాబు అన్నారు.

ఒకప్పుడు ఐటీకి ప్రాధాన్యం.. ఇప్పుడు క్యాంటమ్ వ్యాలీకి ప్రాధాన్యం ఉందని చంద్రబాబు అన్నారు. 'వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చి ప్రభుత్వ సేవలను సులభతరం చేశాం. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 700 సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.' అని ఆయన చెప్పారు.

రాజకీయాలు కలుషితమైపోయాయని తెలిపిన సీఎం చంద్రబాబు.. నేరచరిత్ర ఉన్నవారు రాజకీయాల్లోకి వచ్చారని, నేర రాజకీయాలు చేసేవారు మనకు అవసరమా? అంటూ ప్రశ్నించారు. ఇంట్లో చెత్తను ఊడ్చినట్టు.. నేర చరిత్ర ఉన్న నేతలను ఊడ్చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 'నా జీవితంలో ఎప్పుడూ హత్యా రాజకీయాలు లేవు. నక్సలిజం, ఫ్యాక్షన్, మతకలహాలపై పోరాడాను. నక్సలైట్లు నన్ను చంపాలని చూస్తే వేంకటేశ్వరస్వామి కాపాడారు. గత ఐదేళ్లు ప్రజలకు స్వేచ్ఛ లేదు. గత పాలకులు ప్రజల ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయలేదు. ప్రజల భూములను కబ్జా చేసేందుకు యత్నించారు. మేం వచ్చాక ఫ్యాక్షనిజం, మతకలహాలను నివారించాం. హత్యా రాజకీయాలు చేయాలని చూస్తే ఎవరినీ వదిలిపెట్టను. నేరస్థుల గుండెల్లో నిద్రపోతా. వైసీపీ నేతలు వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించారు. నారాసుర రక్తచరిత్ర అని నాపై వివేకా హత్య నింద వేశారు. మామిడి రైతులకు టన్నుకు రూ.12వేలు ఇచ్చి ఆదుకుంటే, రోడ్డుపై మామిడి కాయలు పారబోసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల రాజకీయం చేశారు' అని సీఎం చంద్రబాబు విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తాడిపత్రిలో టెన్షన్‌ టెన్షన్‌

ప్రభుత్వ బడుల్లో నో వేకెన్సీ పరిస్థితి తేవాలి

Read latest AP News And Telugu News

Updated Date - Jul 19 , 2025 | 06:01 PM