CM Chandrababu : సమాజ సేవకు అంకితం కావాలి
ABN , Publish Date - Feb 16 , 2025 | 03:09 AM
పేదరికం, అసమానతలు లేని సమాజం కోసం ప్రతి ఒక్కరు జీవితాంతం సమాజ సేవలో ఉండాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

మనుషులు లేకున్నా వారి ఆశయాలు కొనసాగాలి
ఎన్టీఆర్ ట్రస్ట్, బసవతారకం ఆస్పత్రి శాశ్వతం
యుఫోరియా మ్యూజికల్ నైట్‌లో సీఎం చంద్రబాబు
నా వంతుగా రూ. 50 లక్షల విరాళం ఇస్తున్నా: పవన్
ప్రజలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్: మంత్రి లోకేశ్
అమరావతిలో తలసీమియా సెంటర్: బాలకృష్ణ
అందరూ రక్తదానం చేయాలి: నారా భువనేశ్వరి
విజయవాడ/అమరావతి, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): పేదరికం, అసమానతలు లేని సమాజం కోసం ప్రతి ఒక్కరు జీవితాంతం సమాజ సేవలో ఉండాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 28సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తలసీమియా బాధితుల సహాయం కోసం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం రాత్రి యుఫోరియా సంగీత విభావరి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మంచి సమాజం కోసం ఎన్టీఆర్ నిరంతరం తపించారన్నారు. ఆయన సతీమణి బసవ తారకం క్యాన్సర్‌తో చనిపోయినప్పుడు ఎన్టీఆర్ చాలా బాధపడ్డారన్నారు. ఒక విషాదం ఒక మంచికి విత్తనం వేసిందని, అదే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి అని వివరించారు. మనుషులు లేకపోయినా వారి ఆశయాలు కొనసాగాలన్నారు. ట్రస్ట్, క్యాన్సర్ ఆసుపత్రి శాశ్వతంగా ఉంటాయని వెల్లడించారు. ఫ్యాక్షన్ రాజకీయాల్లో కార్యకర్తల కుటుంబాలు అనాథలు కాకుండా ఉండేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ ఏర్పాటు చేశామన్నారు. ఎన్‌ఆర్‌ఐలతో కలిసి నాంది ఫౌండేషన్ ఏర్పాటు చేశామని, అదిప్పుడు దేశంలో పెద్ద ఎన్జీవోగా మారిందన్నారు.
ట్రస్ట్ ద్వారా ప్రజల గుండెల్లో ఎన్టీఆర్: పవన్
ఎటువంటి హంగామా లేకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు చేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. విదేశాల నుంచి ప్రముఖ వైద్యులు వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నారంటే ట్రస్ట్‌పై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుందన్నారు. ట్రస్ట్ ద్వారా ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. తనవంతుగా ట్రస్ట్‌కు రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు.
నమ్మకమే చిరునామా: లోకేశ్
చిరునవ్వు, భరోసా, నమ్మకానికి ఎన్టీఆర్ ట్రస్ట్ చిరునామాగా ఉంటుందని మంత్రి లోకేశ్ అన్నారు. విద్య, వైద్యంలోనే కాకుండా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రజలకు అండగా ఉందన్నారు. త్వరలో రక్తనిధి కేంద్రాలు, రక్త పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
అధునాతన సదుపాయాలతో కొత్త వార్డు: బాలకృష్ణ
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో అధునాతన సదుపాయాలతో కొత్త వార్డు ప్రారంభించామని ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పారు. హైదరాబాద్‌లో ఎనిమిది పడకలతో తలసీమియా బాధితుల కోసం ఏర్పాటు చేసిన సెంటర్‌ను 25 పడకలకు పెంచుతున్నామని వెల్లడించారు. త్వరలో అమరావతిలో తలసీమియా సెంటర్ నిర్మిస్తామని చెప్పారు.
ఎన్టీఆర్ ట్రస్టుకు 28 ఏళ్లు
సమాజ సేవలో 28 ఏళ్లు పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ ట్రస్టు సిబ్బందికి, నిర్వాహకులకు, దాతలకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. ‘ఆరోగ్య సంరక్షణ, విద్య, విపత్తు నిర్వహణ-సాయం, సాధికారత-జీవనోపాధి రంగాల్లో పేదలకు, ఆపన్నులకు చేయూతనిస్తున్న మీ సేవా స్ఫూర్తి ప్రశంసనీయం. మహనీయుడు ఎన్టీఆర్ ఆశయాలను నెరవేరుస్తూ... మీ కృషి ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నా’ అని ‘ఎక్స్’లో చంద్రబాబు పేర్కొన్నారు. మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ... ‘ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే పేదవారి ముఖంలో చిరునవ్వు. ఎన్టీఆర్ స్ఫూర్తి, చంద్రబాబు ఆలోచన, భువనేశ్వరి ఆచరణే ఎన్టీఆర్ ట్రస్టు. ఈ ట్రస్టు నిర్వహిస్తున్న అనేక సేవా కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములు అవ్వండి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు.
బాధితుల కష్టాలు చూసి..
- నారా భువనేశ్వరి
భయంకరమైన తలసీమియా వ్యాధి బాధితుల కష్టాలు చూసి తలసీమియా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. ఒక్కో సెంటర్ ఏర్పాటుకు రూ.40-50 లక్షలు ఖర్చవుతుందన్నారు. దానికి నిధులను సమీకరించడానికి ఈ మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేశామన్నారు. యాంకర్ సుమ, సంగీత దర్శకుడు తమన్ ఏమీ ఆశించకుండా కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. అందరూ రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ద్వారా చేసిన సేవలను వివరించారు. తలసీమియా వ్యాధిగ్రస్తుల చికిత్స కోసం అమెరికాలోని అట్లాంటాకు చెందిన సజ్జా సురేష్ రూ.5 లక్షల విరాళాన్ని భువనేశ్వరికి అందజేశారు.