CM Chandrababu Naidu: రాష్ట్ర క్రీడారంగ అభివృద్ధికి సహకరించండి
ABN , Publish Date - Jul 17 , 2025 | 03:53 AM
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు సహకారం ..

కేంద్రమంత్రికి చంద్రబాబు విజ్ఞప్తి
న్యూఢిల్లీ, జూలై 16(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు సహకారం అందించాలని కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. సీఎం ఢిల్లీ పర్యటనలో భాగంగా రెండోరోజు కేంద్రమంత్రితో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి రూ.341 కోట్లు, విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధికి రూ.27కోట్లు, గుంటూరు బీఆర్ స్టేడియంలో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు రూ.170 కోట్లు మంజూరు చేయాలని కోరారు. ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్-2025ను ఏపీలో నిర్వహించేందుకు అవకాశం ఇవ్వడంపై కేంద్రమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. వీటి నిర్వహణకు రూ.25 కోట్లు విడుదల చేయాలని కోరారు. తిరుపతి, రాజమహేంద్రవరం, కాకినాడ, నరసరావుపేటలలో ఖేలో ఇండియా కింద మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులను పూర్తి చేయాలని విన్నవించారు. రాష్ట్రంలో క్రీడరంగ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అమరావతిలో జాతీయ జల క్రీడల శిక్షణ హబ్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) శిక్షణ కేంద్రం ఏర్పాటును పరిశీలించాలని కోరారు. 2024-29 స్పోర్ట్స్ పాలసీలో భాగంగా ఏపీలో స్పోర్ట్స్ ఎకో సిస్టం అభివృద్ధికి చర్యలు చేపట్టామని, ఇందుకు సహకరించాలని సీఎం కోరారు.