CM Chandrababu Naidu: ప్రాజెక్టు మీది.. భరోసా మాది
ABN , Publish Date - Jul 17 , 2025 | 02:55 AM
ప్రాజెక్టు మీది.. భరోసా మాది. ఏపీలో పెట్టుబడి పెట్టి మీరు ప్రారంభించే ప్రాజెక్టులను ప్రభుత్వానివిగా భావిస్తాం.

ఏపీలో పెట్టుబడులు పెట్టండి..
మీ ప్రాజెక్టులను సర్కారువిగా భావిస్తాం
2047 నాటికి దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా ఏపీ
అంతర్జాతీయ ప్రమాణాల మేరకు అభివృద్ధి చేసేందుకు కృత నిశ్చయంతో అడుగులేస్తున్నాం
ఐటీలో బిల్‌గేట్స్ వంటి వారితో కలిసి పనిచేస్తున్నాం
పెట్టుబడిదారులకు రాష్ట్రంలో అపార అవకాశాలు
పరిశ్రమల సమాఖ్య సమావేశంలో ‘స్వర్ణాంధ్ర-2047’ నివేదికను ఆవిష్కరించిన సీఎం
న్యూఢిల్లీ, జూలై 16(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రాజెక్టు మీది.. భరోసా మాది. ఏపీలో పెట్టుబడి పెట్టి మీరు ప్రారంభించే ప్రాజెక్టులను ప్రభుత్వానివిగా భావిస్తాం. 2047 నాటికి ఏపీ దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుంది. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు అభివృద్ధి చేసేందుకు కృత నిశ్చయంతో అడుగులు వేస్తున్నాం.’’ అని జాతీయస్థాయి పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బుధవారం ఢిల్లీలో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) సమావేశంలో రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి సంబంధించి సమగ్ర వివరాలతో రూపొందించిన ‘స్వర్ణాంధ్రప్రదేశ్-2047’ నివేదికను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. 2047 నాటికి ఏపీ రూపురేఖలు ఏ విధంగా మారుతాయో వివరిస్తూ సీఐఐ సహకారంతో ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ రూపొందించిన నివేదికలో ఈ బ్లూప్రింట్‌ను పొందుపరిచారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 2020లో తాను రూపొందించి విజన్-2020లో చెప్పిన విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తన లక్ష్యాలను విజయవంతంగా సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే.. ఇప్పుడు అంతకంటే బృహత్తర లక్ష్యాలు నిర్దేశించుకుని ఈ బ్లూప్రింట్‌ను రూపొందించినట్టు వివరించారు. ఈ లక్ష్యాలను కూడా సాధిస్తామని తెలిపారు. పెద్ద సంఖ్యలో పారిశ్రామిక వేత్తలు హాజరైన ఈ సమావేశంలో చంద్రబాబు.. భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అచ్చెరువొందేలా వివరించారు.
మానవ వనరులే వరం!
రాష్ట్రానికి మానవ వనరులే వరమని సీఎం చంద్రబాబు తెలిపారు. పండ్లతోటలు, ఆక్వాకల్చర్, వాణిజ్య పంటలు ఏపీని సుసంపన్నంగా మార్చాయన్నారు. అత్యంత పొడవైన కోస్తా తీరంలో ప్రతి 50 కిలో మీటర్లకు ఒక రేవు ఉందని, పెద్ద ఎత్తున విమానాశ్రయాలను, ఉత్తమ ప్రమాణాలతో రహదారులను నిర్మిస్తున్నామని తెలిపారు. పరిశ్రమలకు అవసరమయ్యే అన్ని వనరులు, మౌలిక సదుపాయాలకు ఏపీ దేశంలో ఒక కీలక కేంద్రంగా మారుతుందన్నారు. అవకాశాలను అందిపుచ్చుకునేందుకు, అంతర్జాతీయ, జాతీయ సంస్థలు అమరావతికి వచ్చేందుకు నైపుణ్యంతో కూడిన మానవ వనరులను సిద్ధం చేస్తున్నామని వివరించారు. ఏపీకి అద్భుతమైన ఖనిజ సంపద ఉందని, ప్రధాన పరిశ్రమలన్నీ ఏపీకి తరలి వస్తున్నాయని చెప్పారు. 2047 నాటికి ఏపీ ఆర్థిక వ్యవస్థ 180 బిలియన్ల డాలర్ల నుంచి 2.4 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని తెలిపారు. తలసరి ఆదాయం రూ.2.91 లక్షల(3,400 డాలర్ల) నుంచి రూ.36.06 లక్షల(42 వేల డాలర్లు)కు చేరుతుందన్నారు. 2047 నాటికి ఏపీ జనాభా 5.8 కోట్లకు చేరుతుందని, 60 శాతం పట్టణీకరణ జరుగుతుందని వివరించారు.
విధాన సంస్కరణలతోనే సాధ్యం
90వ దశకంలో ఐటీ విప్లవం ఫలితాలను ఏపీలో అమలు చేసేందుకు తాను చేసిన కృషిని సీఎం చంద్రబాబు వివరించారు. వినూత్న ఆవిష్కరణలు, విధాన సంస్కరణలు ఉంటే ఎంతటి గొప్ప లక్ష్యాలనైనా సాధించవచ్చునని తెలిపారు. ఎన్ని విమర్శలెదురైనా బిల్ గేట్స్ వంటివారి తోడ్పాటుతో ఐటీ విప్లవాన్ని సాధించామన్నారు. ఈ రోజు ప్రపంచంలోని నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు భారతీయుడు కాగా, నలుగురు భారతీయుల్లో ఒకరిద్దరు తెలుగువారున్నారని తెలిపారు. దేశంలో ఐటీ కొత్త పుంతలు తొక్కేందుకు పునాది వేసిన టెలీకమ్ విప్లవానికి తోడ్పాటు నిచ్చిన ఘనత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయికి దక్కిందన్నారు. ఆర్థిక సంస్కరణలు, జనాభా వల్ల వచ్చే లాభాలు, ఐటీ తొలి ఫలితాలను అందిపుచ్చుకోవడం అనే ఈ మూడు అంశాలు దేశానికి ప్రయోజనం చేకూర్చాయని వివరించారు. దాని వ ల్లే ఈ రోజు ప్రపంచంలో నాలుగవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని చెప్పారు. 2047 నాటికి భారత దేశం మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్నారు. ప్రధాని మోదీ దేశం వేగంగా అభివృద్ధి చెందేలా ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధిలో భాగస్వాములు కావాలనుకున్న ప్రతి ఒక్కరూ విశాల దృక్పథంలో ఆలోచించి నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తే ఏ లక్ష్యమైనా సాధించగలమన్నారు.
టెక్నాలజీ గేమ్ చేంజర్
విశాఖ, విజయవాడ నగరాలు దేశంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ‘నాన్ మెట్రో’ నగరాలని ‘లింక్డ్ ఇన్’ నివేదిక వెల్లడించిందని సీఎం తెలిపారు. సుపరిపాలనలో సాంకేతికతే గేమ్ చేంజర్‌గా తోడ్పడుతుందన్నారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్‌అండ్‌టీ తోడ్పాడుతో రాష్ట్రంలో క్వాంటమ్ కం ప్యూటింగ్‌ను వచ్చే ఏడాది జనవరి నాటికి ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఈ ఆగస్టు 15 కల్లా ఏపీలో అన్ని ప్రజా సేవలు వాస్తవ సమయం(రియల్ టైం)లో వాట్సాప్ ద్వారా లభ్యమవుతాయని, ప్రజలు ఏ కార్యాలయానికీ వెళ్లనవసరం లేదని తెలిపారు.
నాలుగో స్థానంలో ఏపీ
దేశంలో పెట్టుబడులకు కేంద్రాలుగా గుర్తింపు పొందిన రాష్ట్రాల్లో ఏపీ నాల్గవ స్థానంలో ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే తాము రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామన్నారు. దీనివల్ల 8.5 లక్షల మందికి ఉపాధి లభించిందని చెప్పారు. విశాఖ, అమరావతి, తిరుపతి నగరాలను అకడమిక్ హబ్ లుగా తీర్చిదిద్ది వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అమరావతి ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా రూపొందుతోందన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామిక వేత్త తయారు కావాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. పర్యాటక రంగమే దేశ భవిష్యత్తు అని, ఏఐ సహాయంతో పర్యాటక రంగం అత్యధిక ఉద్యోగాలను కల్పించనుందని తెలిపారు. పర్యాటక రంగానికి తమ ప్రభుత్వం పరిశ్రమ హోదా కల్పించిందని చెప్పారు. టాస్క్ ఫోర్స్ కో చైర్మన్, టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, సీఐఐని చంద్రబాబు అభినందించారు. సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, ఇతర టాస్క్ ఫోర్స్ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
చంద్రబాబు ‘గుడ్‌విల్’ వల్లే ఏపీలో పెట్టుబడుల వర్షం
అమెరికాలోని సిలికాన్ వ్యాలీ మాదిరిగా.. దేశంలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ మారేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని, ఈ క్వాంటమ్ వ్యాలీలో తాము కూడా భాగస్వామ్యమయ్యామని టాస్క్ ఫోర్స్ కో చైర్మన్, టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి, విజన్-2047 సాధనకు తాము 120 సిఫారసులు చేశామని తెలిపారు. సీఐఐ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీని అభివృద్ధి చేసేందుకు లక్ష్యాలు నిర్దేశించుకున్న సీఎం చంద్రబాబు విజనరీ నేత అని ప్రశంసించారు. ఏపీలో పుష్కలంగా ఉన్న అవకాశాలను వినియోగించుకునేందుకు ముందుకు రావాలని పారిశ్రామిక వేత్తలకు ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు విజన్‌ను దృష్టిలో పెట్టుకుని ‘ఏపీ ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి నివేదిక’ను సిద్ధం చేశామన్నారు. చంద్రబాబుకు ఉన్న గుడ్ విల్ ఏపీకి పెట్టుబడులు ప్రవాహం మాదిరిగా వచ్చేలా చేస్తోందన్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పడితే దేశంలో ఒక ఏకో సిస్టమ్ ఏర్పడుతుందని, ఏపీకి ప్రముఖ డేటా సెంటర్లు వచ్చేందుకు అవకాశం ఉంటుందని చంద్రశేఖరన్ వివరించారు.