CBI Traps IT Inspector: సీబీఐ వలలో ఐటీ ఇన్‌స్పెక్టర్
ABN , Publish Date - Jul 30 , 2025 | 06:02 AM
మొబైల్ షాపు యజమాని నుంచి భారీగా ముడుపులు డిమాండ్ చేసిన ఆదాయ పన్ను శాఖ ఇన్‌స్పెక్టర్ సీబీఐ అధికారులకు చిక్కాడు.

మొబైల్ షాపు యజమాని నుంచి రూ.5లక్షలు డిమాండ్
విజయవాడ/విశాఖపట్నం, జూలై 29 (ఆంధ్రజ్యోతి) : మొబైల్ షాపు యజమాని నుంచి భారీగా ముడుపులు డిమాండ్ చేసిన ఆదాయ పన్ను శాఖ ఇన్‌స్పెక్టర్ సీబీఐ అధికారులకు చిక్కాడు. ఓ మధ్యవర్తి నుంచి డబ్బులు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ఏలూరు రామచంద్రరావుపేటలో ఉన్న సెల్‌ఫోన్ సర్వీస్ షాపు యజమానిపై విజయవాడలోని ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ కార్యాలయానికి పలు ఫిర్యాదులు అందాయి. వాటిని ఏలూరు జిల్లా పరిధికి చెందిన ఇన్‌స్పెక్టర్ బి.రామచంద్రరావుకు అధికారులు విచారణ నిమిత్తం ఇచ్చారు. సెల్‌ఫోన్ సర్వీస్ షాపు యజమానికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉండేందుకు, విచారణకు ఆయనను పిలవకుండా ఉండేందుకు ఐటీ ఇన్‌స్పెక్టర్ రూ.5 లక్షలు డిమాండ్ చేశాడు. ఏలూరు జిల్లా పాలగూడేనికి చెందిన రాజు అలియాస్ రాజారత్నం మధ్యవర్తిగా రూ.1.20 లక్షలకు బేరం కుదిర్చాడు. రూ.20 వేలు మధ్యవర్తికి, ఐటీ ఇన్‌స్పెక్టర్‌కు రూ.లక్ష ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఆ మధ్యవర్తి వ్యాపారి నుంచి రూ.70 వేలు తీసుకుని ఐటీ ఇన్‌స్పెక్టర్‌కు ఇస్తుండగా సీబీఐ అధికారులు పట్టుకున్నారు. ఐటీ ఇన్‌స్పెక్టర్‌తోపాటు మధ్యవర్తిని అరెస్టు చేశారు. వారిని సీబీఐ కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది.