Bill Gates: మీ నాయకత్వ ప్రతిభ అద్భుతం
ABN , Publish Date - May 20 , 2025 | 03:51 AM
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నాయకత్వాన్ని బిల్ గేట్స్ ప్రశంసించారు. టెక్నాలజీ ఆధారిత పాలన, ప్రజలకు మెరుగైన సేవలందింపుపై ఆయన లేఖలో ప్రశంసలు వెల్లువెత్తించారు.

సీఎం చంద్రబాబుకు బిల్ గేట్స్ ప్రశంసలు
టెక్నాలజీతో ప్రజలకు మెరుగైన సేవలు
మీ విజన్‌కు ఏఐ ఆధారిత నిర్ణయాలు, మానవ అభివృద్ధి వంటివి నిదర్శనం
మీరు చేస్తున్న కృషి ఏపీకే కాదు.. భారత్ సహా అల్పాదాయ దేశాలకూ ఎంతో ఉపయోగం
మన భాగస్వామ్యం అద్భుతంగా పురోగమిస్తుంది
రాష్ట్ర భవిష్యత్ కోసం కలసికట్టుగా పనిచేద్దాం
ముఖ్యమంత్రికి రాసిన లేఖలో గేట్స్ వ్యాఖ్యలు
అమరావతి, మే 19(ఆంధ్రజ్యోతి): ‘మీరు ఆశించే ఏఐ డ్రివెన్ డెసిషన్ మేకింగ్, రియల్ టైమ్ డేటా సిస్టమ్, హ్యూమన్ కేపిటల్ డెవల్‌పమెంట్ వంటివి మీ నాయకత్వ ప్రతిభను ప్రస్ఫుటం చేస్తున్నాయి. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ప్రభుత్వ సేవల్లో ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు మీరు చేస్తున్న కృషి ఆంధ్రప్రదేశ్‌కే కాదు భారత్ సహా అల్పాదాయ దేశాలకు ఎంతో ఉపయోగపడుతుంది’ అంటూ సీఎం చంద్రబాబుపై గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రశంసల వర్షం కురిపించారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో గేట్స్ ఫౌండేషన్ బృందంతో ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం, సమావేశాన్ని ప్రస్తావిస్తూ సీఎంకి ధన్యవాదాలు తెలుపుతూ బిల్ గేట్స్ లేఖ రాశారు. పేదలు - అట్టడుగువర్గాల విద్య, ఆరోగ్యం, వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధి విషయంలో గేట్స్ ఫౌండేషన్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడాన్ని అభినందిస్తున్నానని బిల్ గేట్స్ పేర్కొన్నారు. ఆరోగ్య రంగాన్ని పటిష్ఠపర్చడం, హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్, ఏఐ అసిస్టెడ్ క్ల్లినికల్ డెసిషన్ మేకింగ్, మెడ్‌టెక్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దడం తదితర అంశా లపై చంద్రబాబుతో జరిపిన చర్చ ఎంతో ఫలవంతంగా ఉందని బిల్ గేట్స్ లేఖలో ప్రస్తావించారు. పాలనలో టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ను బలోపేతం చేయడం ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు మీరు చూపిన ఆసక్తి మీ చిత్తశుద్ధికి.. విజన్‌కు నిదర్శనమని బిల్ గేట్స్ ప్రశంసించారు. ఈసారి తాను ఏపీకి వచ్చేనాటికి చంద్రబాబు నాయకత్వంలో తమ భాగస్వామ్యం అద్భుతమైన పురోగతిని సాధిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. గేట్స్ ఫౌండేషన్ - ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యం మున్ముందు కొనసాగాలని గేట్స్ తన లేఖలో పేర్కొన్నారు.