YCP Election Funding: వైసీపీ అభ్యర్థులకు లిక్కర్ కిక్కు
ABN , Publish Date - Jun 20 , 2025 | 04:28 AM
సొంత సరుకు! సర్కారీ షాపులు! కమీషన్లు ఇచ్చిన వారికే ఆర్డర్లు! వేలకోట్ల ముడుపులు! వాటితో ఓట్లు కొని... మళ్లీ అధికారంలోకి రావాలనే ‘బిగ్ ప్లాన్’! కానీ... డామిట్ కథ అడ్డం తిరిగింది. మద్యం ముడుపుల సొమ్ములు తరలించారు కానీ...

43 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలకు వందల కోట్లు
డబ్బు తరలింపు ‘రూట్’ కనుక్కున్న సిట్
8 మంది పాత్రపై సాంకేతిక ఆధారాలు సేకరణ
రాజ్ కసిరెడ్డి ఆదేశాలు.. ఇతరుల ఆచరణ
‘హెడ్’ కుమారుడి నుంచి రాజ్ తోడల్లుడి దాకా!
కేసు నమోదు కాగానే ఒక్కొక్కరు విదేశాలకు జంప్
పది రోజుల కిందటే దుబాయ్‌కి వెళ్లిన ప్రద్యుమ్న
కేంద్ర సహకారంతో వారిని రప్పించే ప్రయత్నాలు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
సొంత సరుకు! సర్కారీ షాపులు! కమీషన్లు ఇచ్చిన వారికే ఆర్డర్లు! వేలకోట్ల ముడుపులు! వాటితో ఓట్లు కొని... మళ్లీ అధికారంలోకి రావాలనే ‘బిగ్ ప్లాన్’! కానీ... డామిట్ కథ అడ్డం తిరిగింది. మద్యం ముడుపుల సొమ్ములు తరలించారు కానీ... అధికారం మాత్రం దక్కలేదు! 2024 ఎన్నికల్లో ఐదు ఉమ్మడి జిల్లాల్లోని 43 అసెంబ్లీ స్థానాలు, నాలుగు పార్లమెంటు స్థానాల్లోని వైసీపీ అభ్యర్థులకు వందల కోట్ల రూపాయల నగదు ట్రక్కులు, కార్లలో తరలించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గుర్తించింది. దీనికి సంబంధించిన సాంకేతిక ఆధారాలు సైతం సేకరించింది. హైదరాబాద్ నుంచి విజయవాడ, తాడేపల్లి, ఒంగోలు, తిరుపతికి చేరిన రూటింగ్‌తో పాటు... తరలింపులో కీలక పాత్ర పోషించిన వారినీ గుర్తించింది. తిరుపతికి చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్ కుమారుడు, శ్రీకాళహస్తికి చెందిన ఆయన మిత్రుడు, లిక్కర్ స్కామ్‌లో ప్రధాన సూత్రధారి రాజ్ కసిరెడ్డి తోడల్లుడు, ఆయన సోదరుడు, ఒంగోలుకు చెందిన రియల్టర్, కాఫీ షాపులో పనిచేసి లిక్కర్ కంపెనీకి అన్నీ తానై వ్యవహరించిన యువకుడు.. ఇలా మొత్తం ఎనిమిది మంది పాత్రపై పక్కా ఆధారాలు సేకరించింది. వారి ఆచూకీ కోసం ఆరా తీయగా... గత ఏడాది సెప్టెంబరులో మద్యం స్కామ్‌పై సీఐడీ కేసు నమోదైన తర్వాత వీరంతా ఒక్కొక్కరుగా అమెరికా, దుబాయ్ తదితర దేశాలకు పారిపోయినట్లు గుర్తించింది. దేశంలోనే అతిపెద్ద భారీ మద్యం కేసు కొలిక్కి తెచ్చేందుకు వారిని భారత్‌కు రప్పించాలని... ఇందుకు కేంద్ర దర్యాప్తు సంస్థల సహకారం తీసుకోవాలని ‘సిట్’ నిర్ణయించుకుంది. ఆ ఎనిమిది మంది ఎవరు.. వారి పాత్ర ఏమిటి?
ఇవీ ఆ వివరాలు...
తిరుపతికి చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్ కుమారుడైన కిరణ్ కుమార్ రెడ్డి... ఏ1 రాజ్ కసిరెడ్డకి అత్యంత సన్నిహితుడు! రాజ్ సూచనల మేరకు బూనేటి చాణక్య, ముప్పిడి అవినాశ్ రెడ్డి కంపెనీల నుంచి కమీషన్లు వసూలు చేయగా... ఆ సొమ్ము మద్యం మాఫి యా ముఠాలో కీలక వ్యక్తులకు చేర్చడంలో కిరణ్ కుమార్ రెడ్డిది కీలక పాత్ర. ఎవరి వాటా వారికి చేర్చిన తర్వాత రాజ్ కసిరెడ్డి వాటాగా మిగిలిన సొమ్మును ఆదాన్ డిస్టిలరీస్, డికార్డ్ లాజిస్టిక్స్ లాంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం, అవసరం మేరకు హవాలా రూపంలో దేశం దాటించడం వంటి పనులను జాగ్రత్తగా పూర్తి చేసే బాధ్యత ఇతనిదే. కిరణ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే అసలు గుట్టు బయట పడుతుందనే... అమెరికాకు పంపించేసినట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు.
రాజ్ కసిరెడ్డికి నిత్యం అందుబాటులో ఉండే బూనేటి చాణక్యకు సైఫ్ అహ్మద్ కుడిభుజం. ఆయనది శ్రీకాళహస్తి. ఇద్దరూ బాల్య మిత్రులు. దీంతో మద్యం వ్యాపార లావాదేవీలు సైఫ్‌కు అప్పగించారు. ప్రతి రోజూ ఏ బ్రాండ్ లిక్కర్ ఎంత సేల్ అయిందో అనూష అనే ఉద్యోగి నుంచి డేటా తీసుకుని... ఎక్సెల్ పట్టికలు వేసి ఏ డిస్టిలరీ నుంచి కమీషన్ రూపంలో ఎన్ని కోట్లు వసూలు చేయాలనే వివరాలు రాజ్ కసిరెడ్డికి పంపేవాడు. అవే వివరాలను చాణక్యకు ఇచ్చి ఆయా లిక్కర్ వ్యాపారులతో డబ్బులు వసూలు చేసే బాధ్యత రాజ్ అప్పగించేవారు. వారాంతంలో కమీషన్ డబ్బులు ఇవ్వని వాళ్ల వివరాలు చాణక్య ద్వారా సైఫ్‌కు.. ఆయన నుంచి సత్య ప్రసాద్(ఎక్సైజ్ అధికారి)కు చేరుతాయి. ముడుపులు ఇవ్వని వారికి మద్యం ఆర్డర్లు వెంటనే ఆపేస్తారు.
వరుణ్ పురుషోత్తం 2016లో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో నీరసించి బంజారా హిల్స్‌లోని ఒక కాఫీ షాపులో చేరాడు. జీతం... నెలకు 32వేల రూపాయలు. అమెరికాలో స్థిరపడ్డ డాక్టర్ రమేశ్ రెడ్డి అనే ఎన్‌ఆర్‌ఐ పరిచయంతో ఆయన దశ తిరిగింది. ఒక మద్యం కంపెనీలో మంచి ఉద్యోగం ఉందని, భారీగా డబ్బులు సైతం సంపాదించుకోవచ్చని పురుషోత్తంకు ఆ డాక్టర్ ఒక ‘దారి’ చూపించారు. మద్యం మాఫియాకు కమీషన్లు ఇవ్వలేక, వ్యాపారం సవ్యంగా చేసుకోలేక ఇబ్బంది పడుతున్న లీలా డిస్టిలరీస్ ను లిక్కర్ స్కామర్లు బలవంతంగా లాగేసుకున్నారు. పాండిచ్చేరిలో లీలా డిస్టిలరీస్ ఉత్పత్తుల వ్యవహారాలు చూసుకునే బాధ్యతనుపురుషోత్తంకు అప్పగించారు. ఆ తర్వాత... ఏపీకి ఇన్‌చార్జిగా నియమించి.. ఆయన పేరుతో వందల కోట్ల మద్యం వ్యాపారం చేశారు. ఐదేళ్లలో 459 కోట్లు సంపాదించగా.. అత్యధికం అప్పటి అధికార పార్టీ పెద్దలకు, మద్యం మాఫియా ముఠాకు చేర్చాడు. మద్యం స్కాంపై విచారణకు ఆదేశిస్తామని చంద్రబాబు ప్రకటించిన వెంటనే పురుషోత్తం దేశం వదిలి పారిపోయాడు. అమెరికాలో ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు.
మద్యం వ్యాపారుల నుంచి కమీషన్లు తీసుకుని పెద్దలకు సింహభాగం పంచగా మిగిలే అరకొరతో రాజ్ కసిరెడ్డి సంతృప్తి చెందలేదు. సొంత బ్రాండ్ మద్యం తయారీ, సరఫరా చేస్తే భారీగా డబ్బులు మిగుల్చుకోవచ్చని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఆయన సలహా ఇచ్చారు. పెట్టుబడి కోసం డబ్బులు ఇప్పిస్తే వాటా ఇస్తానని చెప్పడంతో... అరబిందో శరత్ చంద్రారెడ్డితో సాయిరెడ్డి భారీగా అప్పు ఇప్పించారు. దీంతోనే కసిరెడ్డి ఆదాన్ డిస్టిలరీస్ ద్వారా లిక్కర్ తయారీ వ్యాపారం మొదలు పెట్టారు. అందు లో తన తోడల్లుడు ముప్పిడి అవినాశ్‌రెడ్డి తమ్ముడు అనిరుధ్ రెడ్డిని డైరెక్టర్‌గా రాజ్ నియమించారు. ప్రతినెలా వాటాలు పంచే విషయంలో తేడాలు రావడంతో ఆదాన్ వ్యవహారం రచ్చకెక్కింది. ఈ గొడవలు తాను భరించలేనంటూ అనిరుధ్ రెడ్డి ఆదాన్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసి విదేశాలకు వెళ్లిపోయారు.
ఆదాన్ డిస్టిలరీస్ డైరెక్టర్ బాధ్యతల నుంచి అనిరుధ్ రెడ్డి తప్పుకోవడంతో... బొల్లారం శివకుమార్‌ను నియమించారు. ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. సిట్ దర్యాప్తు మొదలు పెట్టగానే ఆయన విదేశాలకు వెళ్లిపోయారు. డిస్టిలరీస్ యజమానుల నుంచి పలుమార్లు డబ్బులు వసూలు చేయడంతోపాటు... ఆదాన్ వాటా కింద అందించిన సొమ్మును తరలించినట్లు ‘సిట్’ గుర్తించింది.
రాజ్ కసిరెడ్డి నడిపిస్తున్న ఆదాన్ డిస్టిలరీ్‌స వ్యవహారాలన్నీ... ఆయన తోడల్లుడు ముప్పిడి అవినాశ్‌రెడ్డి చూసేవారు. తనను కసిరెడ్డి మోసం చేస్తున్నారని విజయసాయిరెడ్డి తాడేపల్లి పెద్దలకు ఫిర్యాదు చేయగా... ‘సాయన్నను చూసుకోండి’ అంటూ కసిరెడ్డికి ఆదేశాలొచ్చాయి. ‘ఇందులో ఆయన చేసిందేమీ లేదు. ఇప్పుడు ఇస్తున్నది కూడా ఎక్కువే’ అని కసిరెడ్డి తక్కువ చేసి మాట్లాడటంతో సాయిరెడ్డి రచ్చ చేశారు. ఆదాన్ పేరు మార్కెట్లో చెడిపోవడంతో... ఎన్‌ఎన్‌జే యజమాని గోవాలో రిజిస్టర్ చేయించిన లీలా డిస్టిలరీ్‌సను వాసుదేవరెడ్డి ద్వారా బెదిరించి స్వాధీనం చేసుకున్నారు. ఆదాన్‌లో ఉత్పత్తయ్యే మద్యాన్ని లీలా ద్వారా చేయించి ఆర్డర్లు అటు మళ్లించారు.
రాజ్ కసిరెడ్డికి సన్నిహితుల్లో ఒకరైన సైమన్ ఐఐటీ గ్రాడ్యుయేట్. మొదట్లో డిస్టిలరీస్ నుంచి కమీషన్లు వసూలు చేసే బృందంలో ఉండేవారు. రాజ్ కసిరెడ్డి సూచనల మేరకు ఆ డబ్బును చేర్చాల్సిన చోటుకు చేర్చేవారు. ‘ఫలానా వైసీపీ నేతకు ఇంత ఇవ్వాలి. సిద్ధం సభకు ఇంత పంపండి’ అని రాజ్ కసిరెడ్డి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి, బూనేటి చాణక్యకు ఆదేశాలు అందేవి. వీరిద్దరూ సైమన్ ద్వారా ఆ ఆదేశాలను అమలు చేసేవారు. 2023 డిసెంబరు నుంచి చెవిరెడ్డి అనుచరులు బాలాజీ, నవీన్, గిరి, మదన్‌కు పద్దెనిమిదిసార్లు డబ్బుల బాక్సులు కార్లలో పెట్టి పంపించినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. సైమన్ మూడుసార్లు నేరుగా తాడేపల్లికి వచ్చి చెవిరెడ్డి కోసం డబ్బులు ఇచ్చి వెళ్లినట్లు కూడా తెలుస్తోంది.
హైదరాబాద్‌లో ఉంటున్న వెంకటేష్ నాయుడు(ఏ-34) లారీలో విజయవాడకు తరలిస్తున్న రూ.8.37కోట్లు 2024 మే 8న రాష్ట్ర సరిహద్దుల్లోని చిల్లకల్లు వద్ద పోలీసులకు పట్టుబడింది. ఆ సొమ్ము తనదేనని, వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయం అంటూ కోర్టులో ప్రద్యుమ్న పిటిషన్ వేశారు. నిర్మాణ రంగంలో ఉన్న తాను కూలీలకు ఇచ్చేందుకు విజయవాడకు ఆ డబ్బు తరలిస్తున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు. సిట్ అధికారులు ఆరా తీయగా... వ్యవసాయం ద్వారా ఎనిమిది కోట్లకు పైగా ఆదాయం వచ్చేంత భూమి ప్రద్యుమ్నకు లేదని, ఆయన కన్‌స్ట్రక్షన్ కంపెనీకి కూడా అంత డబ్బు కూలీలకు పంచే శక్తి లేదని తేలింది. సిట్ అధికారులు ఆరా తీస్తున్న విషయాన్ని తెలుసుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి... తనకు ముప్పు రాకుండా ప్రద్యుమ్నను పది రోజుల క్రితం దుబాయ్‌కి పంపించినట్లు సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు.