Mali Kidnapping: ఆరు రోజులైనా తెలియని ఆచూకీ
ABN , Publish Date - Jul 07 , 2025 | 03:21 AM
ఉపాధి కోసం ఆఫ్రికాలోని మాలి దేశం వెళ్లి ఆరు రోజుల క్రితం ఉగ్రవాదుల చేతిలో కిడ్నా్‌పకు గురైన ఇద్దరు ఆంధ్రప్రదేశ్ వాసుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. కిడ్నాప్ అయిన వారిలో పల్నాడు జిల్లా మాచర్ల మండలం జమ్మలమడక గ్రామానికి చెందిన కూరాకుల అమరలింగేశ్వరరావు...

మాలిలో ఇద్దరు ఏపీ వాసుల కిడ్నాప్
సిమెంట్ ఫ్యాక్టరీపై దాడి చేసిన అల్‌ఖైదా అనుబంధ సంస్థ ఉగ్రవాదులు
రక్షించాలని కుటుంబ సభ్యుల వేడుకోలు
మాచర్ల రూరల్, జూలై 6(ఆంధ్రజ్యోతి): ఉపాధి కోసం ఆఫ్రికాలోని మాలి దేశం వెళ్లి ఆరు రోజుల క్రితం ఉగ్రవాదుల చేతిలో కిడ్నా్‌పకు గురైన ఇద్దరు ఆంధ్రప్రదేశ్ వాసుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. కిడ్నాప్ అయిన వారిలో పల్నాడు జిల్లా మాచర్ల మండలం జమ్మలమడక గ్రామానికి చెందిన కూరాకుల అమరలింగేశ్వరరావు, ఒడిసాలోని గంజాంలో స్థిరపడిన ఏపీ వాసి వెంకటరమణ ఉన్నారు. ఆరు రోజులు కావస్తున్నా సమాచారం తెలియకపోవడంతో అమరలింగేశ్వరరావు, వెంకటరమణ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఉగ్ర చెర నుంచి విడిపించి స్వదేశం రప్పించాలని కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అమరలింగేశ్వరరావు పుట్టినరోజు నాడే కిడ్నా్‌పకు గురైనట్టు తెలుస్తోంది. ఆయన భార్య, పిల్లలు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. అమరలింగేశ్వరరావుకు సుమారు 20 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడకు చెందిన వెంకటరమణతో వివాహం జరిగింది. ఆయన పదేళ్ల క్రితం మాలి దేశానికి ఉపాధి కోసం వెళ్లారు. అక్కడ డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో మెకానికల్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. గంజాంలో స్థిరపడ్డ వెంకటరమణ కూడా ఇదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. గతేడాది ఆయన మాలికి వెళ్లినట్టు సమాచారం. ఈ నెల 1న ఫ్యాక్టరీలోకి అల్‌ఖైదా అనుబంధ సంస్థ జేఎన్‌ఐఎం ఉగ్రవాదులు చొరబడి అమరలింగేశ్వరరావు, వెంకటరమణతో పాటు మహారాష్ట్రకు చెందిన వెంకటేశ్వరరావును కిడ్నాప్ చేశారు.