Share News

Vijayasai Reddy: పార్టీ ఎందుకు వీడానో గుట్టు విప్పిన విజయసాయిరెడ్డి

ABN , Publish Date - Apr 18 , 2025 | 05:58 PM

Vijayasai Reddy: ఏపీ మద్యం కుంభకోణం వ్యవహారంలో సిట్ అధికారుల ఎదుట విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఈ విచారణ పూర్తయిన అనంతరం విజయసాయిరెడ్డి సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధాన మిచ్చారు.

Vijayasai Reddy: పార్టీ ఎందుకు వీడానో గుట్టు విప్పిన విజయసాయిరెడ్డి
Ex MP VijayaSai Reddy

విజయవాడ, ఏప్రిల్ 18: గత జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం విక్రయాల్లో తాను ఎప్పుడు జోక్యం చేసుకోలేదని రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. నాటి మద్యం విక్రయాల్లో కర్మ, కర్త, క్రియ అంతా రాజ్ కసిరెడ్డి అని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారంపై విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన సిట్ విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యారు.

అనంతరం విజయసాయిరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. రాజ్‌ కసిరెడ్డి మూడు కంపెనీలు ఏర్పాటు చేసి.. కొత్త మద్యం బ్రాండ్‌లను తయారు చేసి విక్రయించిన సంగతి తనకు తెలియదన్నారు. అందులో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి పాత్ర గురించి సైతం తనకు తెలియదని సిట్ అధికారులకు స్పష్టం చేశానన్నారు.


ఆయనే మాత్రమే.. సమాధానం

అయితే తనను అడిగిన ప్రశ్నలన్నింటికి రాజ్‌ కసిరెడ్డి మాత్రమే సమాధానం చెప్పగలరని ఈ సందర్భంగా సిట్ అధికారుల ఎదుట చెప్పినట్లు విజయసాయిరెడ్డి వివరించారు. ఇక మూడు కంపెనీలను రాజ్‌ కసిరెడ్డి లీజుకు తీసుకున్నారా? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తాను పైవిధంగా సమాధాన మిచ్చానన్నారు. ఇక రాజ్‌ కసిరెడ్డి మోసం చేసింది తనను కాదని పార్టీని.. ప్రజలనని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.


కిక్ బాక్స్ గురించి చర్చించారా..?

అలాగే హైదరాబాద్‌, అమరావతిలో జరిగిన భేటీల్లో.. జరిగిన విషయాలపై ఉన్నతాధికారులు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పానన్నారు. నాటి సీఎం వైఎస్ జగన్ ఓఎస్‌డీ కృష్ణమోహన్ రెడ్డి, ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి ఈ సమావేశాలకు వచ్చారా? అని ప్రశ్నించగా.. తనకు గుర్తు ఉన్నంత వరకు వాళ్లెవరూ ఈ సమావేశాలకు రాలేదని తెలిపానన్నారు. కిక్‌ బాక్స్‌ గురించి చర్చించారా? అని ప్రశ్నించగా.. తనకు తెలియదని చెప్పానని పేర్కొన్నారు. అలాగే రాజ్‌ కసిరెడ్డి వసూలు చేసినవి ఎవరికి వెళ్లాయో కూడా తనకు తెలియదనిఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.


అరబిందో వద్ద రూ. 100 కోట్ల అప్పు..

అరబిందో వద్ద రూ. వంద కోట్లు అప్పుగా ఇప్పించానని.. అందుకు 12 శాతం వడ్డీకి చెల్లింపులు జరిగేలా అప్పు ఇప్పించానని సీట్ అధికారుల ఎదుట చెప్పినట్లు తెలిపారు. ఇక డీకార్ట్‌, అడాన్‌ కంపెనీలకు అప్పులు సైతం ఇప్పించానన్నారు. ఒకరికి రూ. 60 కోట్లు, మరొకరికి రూ. 40 కోట్లు ఇచ్చారని చెప్పానన్నారు.


ఎప్పుడు పిలిస్తే.. అప్పుడు..

ఈ విచారణలో మరోసారి పిలిచినా వస్తానని.. సిట్ అధికారులకు తాను చెప్పానన్నారు. ప్రాంతీయ పార్టీల్లో నెంబర్‌ 2 స్థానం ఉండదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. పార్టీ అధికారంలో లేని సమయంలో అన్నీ తానే చూసుకున్నానని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇక అధికారంలోకి వచ్చాక నెంబర్‌ 2 అనేది మిధ్యగా భావించానని తెలిపారు. తనను వెన్నుపోటు దారుడనని వైఎస్ జగన్‌కు చెప్పారని.. దీంతో 2వ స్థానం నుంచి తాను 2 వేల స్థానంకు పడిపోయానని చెప్పారు.


సాక్షి ఛానల్‌పై ఫైర్‌

తాను పెట్టించిన ఛానల్‌లో తనపై అనవసరంగా విమర్శలు చేశారని విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను వ్యవసాయం చేస్తాను.. ఇంకా ఏమైనా చేస్తానన్నారు. సాక్షి మీడియాకు ఎందుకు తనపై అనవసర రాతలు? అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. వ్యవసాయం చేసుకుంటానన్న వ్యక్తికి.. ఇంకా రాజకీయాలు ఎందుని అంటున్నారని ఆయన మండిపడ్డారు. అయితే దీని వెనుక బిగ్‌బాస్‌ ఉన్నాడా.. లేడా అనేది తనకు తెలియదన్నారు.


రాజ్యసభకు పోటీలో లేను..

ఇక రాజ్యసభకు తాను పోటీలోనే లేనన్నారు. ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. కోటరీ వల్లే తాను వేదన చెంది వైసీపీని వీడానంటూ పార్టీ వీడడానికి గల కారణాన్ని విజయసాయి ఈ సందర్భంగా వివరించారు.

Updated Date - Apr 18 , 2025 | 06:18 PM