Andhra Pradesh Development: అవకాశాల గని ఏపీ..మీకిదే ఆహ్వానం
ABN , Publish Date - Jul 30 , 2025 | 03:59 AM
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

సింగపూర్ సీఈవోలతో సీఎం చంద్రబాబు
సుదీర్ఘ తీరం అభివృద్ధికి ముఖద్వారం
పోర్టులు, వాటి ఆధారిత పరిశ్రమలు, షిప్ బిల్డింగ్, టూరిజంలో అవకాశాలు
అమరావతిలో తొలి క్వాంటమ్ వ్యాలీ
ఇందులో పెట్టుబడులు పెట్టండి
డేటా సెంటర్ల ఏర్పాటుకు విశాఖ బెస్ట్
గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ సహా పలు ఐటీ కంపెనీలు వస్తున్నాయ్
లాజిస్టిక్ కారిడార్‌గా కాకినాడ-మచిలీపట్నం-కృష్ణపట్నం
ప్రపంచ శ్రేణి రిఫైనరీ రానుంది: సీఎం
పారిశ్రామికవేత్తలతో రౌండ్‌టేబుల్ భేటీ
అమరావతి, జూలై 29 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. సుదీర్ఘ తీరప్రాంతం పెట్టుబడులకు గమ్యస్థానమని, అభివృద్ధికి ముఖద్వారమని తెలిపారు. తీర ప్రాంతాన్ని ఆదాయార్జన వనరుగా మార్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. సింగపూర్ పర్యటనలో భాగంగా మూడోరోజు మంగళవారం ఆయన పలు కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో)లతో సమావేశమయ్యారు. సింగపూర్ కంపెనీలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. జురాంగ్ పెట్రోకెమికల్ ఐలాండ్‌ను కూడా సందర్శించారు. ఆయా కార్యక్రమాల్లో ఆయన వెంట మంత్రులు లోకేశ్, పి.నారాయణ, టీజీ భరత్ తదితరులు పాల్గొన్నారు. సీఈవోలతో మారిటైం ఆపరేషన్స్, మౌలిక వసతుల కల్పనపై ఆయన చర్చించారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో గ్లోబల్ భాగస్వాములుగా కలసి రావాలని కోరారు. ఏపీలో అన్ని అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసే ప్రణాళికల్లో భాగంగా పోర్టుల నిర్మాణం, పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం వెంబడి ఆరు ఆపరేషనల్ పోర్టులు ఉన్నాయని చెప్పారు. మరో నాలుగు కొత్త పోర్టులు రానున్నాయని తెలిపారు. శ్రీసిటీకి దగ్గరలోనేఐదు పోర్టులు ఉన్నాయని అన్నారు. లాజిస్టిక్ ఖర్చులు తగ్గించాలని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. డ్రైపోర్టు నిర్మాణంపైనా దృష్టి సారించామని చెప్పారు. ఇన్‌లాండ్ వాటర్‌వేస్ ద్వారా కూడా సరుకు రవాణా చేపట్టే ఆలోచనలు చేస్తున్నామని తెలిపారు. టూరిజానికి కూడా పెద్ద పీట వేస్తున్నామన్నారు. కొత్త పోర్టులతో అనేక అవకాశాలు వస్తాయని సీఈవోలు అభిప్రాయపడ్డారు.
డేటా, ఐటీ కంపెనీలకు ఏపీ అనువు
డేటా సెంటర్లు, ఐటీ కంపెనీల స్థాపనకు ఆంధ్రప్రదేశ్ అనువుగా ఉంటుందని సీఎం సింగపూర్ పారిశ్రామికవేత్తలతో జరిగిన రౌంట్‌టేబుల్ భేటీలో అన్నారు. డేటా సెంటర్ల ఏర్పాటుకు విశాఖ అత్యుత్తమ ప్రదేశమని చెప్పారు. ఇప్పటికే గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ సహా పలు ఐటీ కంపెనీలు విశాఖకు వస్తున్నాయని తెలిపారు. అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్‌వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. క్వాంటమ్ వ్యాలీ ఎకో సిస్టమ్‌లో సింగపూర్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉందని చెప్పా రు. ఆప్రాజెక్టు నుంచి ప్రయోజనాలు పొందడంతోపాటు పరిశోధనలు కూడా చేయొచ్చన్నారు.
జురాంగ్ ఐలండ్‌లో మౌలిక వసతులపై ఆరా
కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నాలను కలుపుతూ లాజిస్టిక్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కృష్ణపట్నం సమీపాన ప్రపంచ శ్రేణి చమురు రిఫైనరీ ఏర్పాటు కానుందని తెలిపారు. జురాంగ్ ఐలండ్‌లో సింగపూర్ సృష్టించిన సమీకృత పారిశ్రామిక ప్రాజెక్టు సహా ఇతర మౌలిక సదుపాయాలను ముఖ్యమంత్రి బృందం పరిశీలించింది. సముద్రాన్ని పూడ్చి నిర్మించిన దీవి సందర్శనకు వచ్చిన ఈ బృందానికి సుర్బానా జురాంగ్ డిప్యూటీ డైరెక్టర్ టియో ఎంగ్ కియాటీ స్వాగతం పలికారు. మొబిలిటీ మోడల్స్, లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాలు, ముడిచమురు ప్రాసెసింగ్ ప్రక్రియ, ఇతర అత్యుత్తమ పాలిమర్లు, ఇంధనాలు, స్పెషాలిటీ కెమికల్స్ గురించి సీఎం బృందానికి ఆయన వివరించారు. మొత్తం 32 చదరపు కిలోమీటర్ల మేర సముద్రాన్ని పూడ్చి, భూభాగంగా మార్చి అంతర్జాతీయ ప్రమాణాలతో పెట్రో కెమికల్ హబ్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును చేపట్టామని వివరించారు. ఈ భారీ ప్రాజెక్టులో వ్యర్థాల నిర్వహణతో పాటు భద్రతా వ్యవస్థనూ ఏర్పాటు చేశామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
గుడ్ న్యూస్.. రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏనుగుల గుంపు కదలికలపై వాట్సాప్ ద్వారా హెచ్చరికలు.. పవన్ కల్యాణ్ న్యూ ప్లాన్
Read latest AndhraPradesh News And Telugu News