Share News

AP High Court: పెద్దిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

ABN , Publish Date - May 23 , 2025 | 07:16 AM

అటవీ భూముల ఆక్రమణ కేసులో వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి హైకోర్టు గట్టి ఎదురుదెబ్బ ఇచ్చింది. క్రిమినల్‌ కేసులపై స్టే ఇవ్వాలన్న పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

AP High Court: పెద్దిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

  • అటవీ భూముల ఆక్రమణ వ్యవహారంలో క్రిమినల్‌ కేసులపై స్టేకు నిరాకరణ

అమరావతి, మే 22(ఆంధ్రజ్యోతి): అటవీ భూముల ఆక్రమణ వ్యవహారంలో వైసీపీ నేత, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అటవీశాఖ అధికారులు తమపై ప్రారంభించిన క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ను నిలుపుదల చేయాలంటూ పెద్దిరెడ్డి, ఆయన సోదరుడు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డి, కుమారుడు, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, పెద్దిరెడ్డి తమ్ముడి సతీమణి పి. ఇందిరమ్మ వేసిన అనుబంధ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. క్రిమినల్‌ కేసులపై స్టే విధించేందుకు నిరాకరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా గుణరంజన్‌ గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. పిటిషనర్ల అధీనంలో ఉన్న భూముల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తే చట్టనిబంధనలు అనుసరించాలని రెవెన్యూ, అటవీశాఖ అధికారులను ఆదేశిస్తూ గతంలో ఇదే హైకోర్టు ఉత్తర్వులిచ్చిందని గుర్తుచేశారు. చిత్తూరు జిల్లా మంగళంపేట పరిధిలోని వివిధ సర్వే నంబర్లలో తమ అధీనంలో ఉన్న 75.74 ఎకరాల భూమి నుంచి ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని పేర్కొంటూ పెద్దిరెడ్డి, ఆయన కుటుంబసభ్యులు హైకోర్టును ఆశ్రయించారు.

Updated Date - May 23 , 2025 | 07:18 AM