Share News

AP Govt: గంజాయి నిందితులకు ‘సంక్షేమం’ కట్‌!

ABN , Publish Date - Mar 04 , 2025 | 03:58 AM

ఇప్పటికే ఈగల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి, మత్తుపదార్థాల కట్టడికి చర్యలు తీసుకొంటున్న ప్రభుత్వం తాజాగా కీలక ముందడుగు వేసింది.

AP Govt: గంజాయి నిందితులకు ‘సంక్షేమం’ కట్‌!

  • ప్రజాభిప్రాయం తీసుకున్నాక తుది నిర్ణయం

అమరావతి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): ఇప్పటికే ఈగల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి, మత్తుపదార్థాల కట్టడికి చర్యలు తీసుకొంటున్న ప్రభుత్వం తాజాగా కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలో గంజాయు సరఫరా కేసుల్లో పట్టుబడే వ్యక్తుల కుటుంబాలకు సంక్షేమ పథకాలు తొలగించేందుకు నిర్ణయించింది. గత వైసీపీ ప్రభుత్వంలో సుమారు 1800మంది, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో 2500మంది వరకూ గంజాయి కేసుల్లో పట్టుబడ్డారు. సాగు చేస్తూ, సరఫరా చేస్తూ, విక్రయిస్తూ పట్టుబడిన వారిలో మన రాష్ట్రానికి చెందిన వారి ఆధార్‌ కార్డులు సేకరించి ఆయా వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఏ ఒక్క సంక్షేమ పథకం ఇవ్వరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆఖరికి వృద్ధులకు పెన్షన్‌ ఉన్నా నిలిపివేసేందుకు కసరత్తు చేస్తోంది. గంజాయి, మత్తు కట్టడిపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం గతంలోనే ప్రభుత్వానికి ఈ సిఫారసు చేసింది. గంజాయి వల్ల యువత నిర్వీర్యమైపోతోందని, భావితరాల భవిష్యత్తు, యువత, పిల్లల జీవితాలను దృష్టిలో పెట్టుకుని ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయంపై అధికారిక ప్రకటన చేసి ప్రజాభిప్రాయం కోరిన తర్వాతే అమలు చేయనున్నట్లు తెలిసింది.

Updated Date - Mar 04 , 2025 | 03:58 AM