Pawan Kalyan: హరిహర వీరమల్లు సినిమా టికెట్ రేట్లు పెంపు
ABN , Publish Date - Jul 19 , 2025 | 03:21 PM
పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ఏపీ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. అయితే, నిర్మాత చేసిన 14 రోజుల పెంపు విజ్ఞప్తిని తిరస్కరించి..

అమరావతి, జులై19: పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ఏపీ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. 14 రోజుల పాటు టికెట్ రేటు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని నిర్మాత ఏ ఏం రత్నం నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, 14 రోజుల పెంపు విజ్ఞప్తిని తిరస్కరించిన ఏపీ సర్కారు పది రోజులకు మాత్రమే టికెట్ ధరను పెంచుకునేలా అనుమతి ఇస్తూ నిర్ణయం చేసింది. తద్వారా అన్ని సినిమాలను సమానంగానే చూస్తామంటూ సంకేతాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈసారి టిక్కెట్ ధర పెంపు పై స్వయంగా నిర్ణయం వెలువరించిన ముఖ్యమంత్రి కార్యాలయం.. మరి కాసేపట్లో దీనిపై అధికారి ఉతర్వులు జారీ చేసే అవకాశం ఉంది.
కాగా, ఈ ఏడాది విడుదల కానున్న భారీ చిత్రాల్లో ‘హరి హర వీరమల్లు’ ఒకటి. పవన్ కళ్యాణ్ కథానాయకుడు. జ్యోతి కృష్ణ దర్శకుడు. ఏ.ఎం.రత్నం సమర్పణలో ఏ.దయాకర్‌రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై అభిమానుల అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ నటిస్తున్నారు. మొఘల్ రాజుల నుంచి కోహినూర్ వజ్రాన్ని చేజిక్కించుకోవడంతో పాటు, ప్రేక్షకుల మనసు దోచుకునేందుకు వీరమల్లు సిద్ధమవుతున్నారు. అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని మొదట మార్చి 28న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే, కొన్ని సాంకేతిక కారణాల రిత్యా ఈ సినిమా జులై 24వ తేదీన రిలీజ్ కానుంది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రాన్నిమెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఎ ఎం రత్నం నిర్మించారు. ఏపీ సర్కారు తాజా నిర్ణయంతో 'హరిహర వీరమల్లు పార్ట్-1' సినిమాకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని థియేటర్ల యాజమాన్యాలకు 23.07.2025 రాత్రి 9.00 గంటలకు ప్రీమియర్ షో కోసం ప్రతి టికెట్‌పై రూ.600/- ప్లస్ GST మేరకు టిక్కెట్ రేట్లను పెంచడానికి అనుమతి లభించింది. ఆ తర్వాతి షోలకు ప్రతి టికెట్‌పై దిగువ తరగతికి 100/- (GSTతో సహా), ఉన్నత తరగతికి రూ.150/- (GSTతో సహా), మల్టీప్లెక్స్‌కు రూ.200/- (GSTతో సహా) రేట్లు ఫిక్స్ చేశారు. సినిమా విడుదల తేదీ 24.07.2025 నుండి 02.08.2025 వరకు పది (10) రోజుల పాటు టిక్కెట్టు పెంపుకు అనుమతిచ్చారు. రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు & లైసెన్సింగ్ అథారిటీలు (సినిమాలు) ఇంకా పోలీసు కమిషనర్లు ఈ విషయంలో అవసరమైన చర్య తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించనుంది. మరికాసేపట్లో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార విశ్వజిత్ ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రభుత్వ బడుల్లో నో వేకెన్సీ పరిస్థితి తేవాలి
Read latest AP News And Telugu News