Share News

CM Chandrababu: వ్యవసాయ శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష.. కీలక నిర్ణయాలు

ABN , Publish Date - Jun 05 , 2025 | 10:16 PM

నల్లబర్లీ పొగాకుకు బదులు ఇకపై ప్రత్యామ్నాయ పంటలు ఎంచుకోవాలని ఏపీ ప్రభుత్వం రైతుల్ని కోరింది. కోకో రైతులు నాణ్యమైన విత్తనాలు ఎంచుకోవాలని సూచించింది. పామ్ ఆయిల్ రైతులు నష్టపోకుండా..

CM Chandrababu: వ్యవసాయ శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష.. కీలక నిర్ణయాలు
CM Chandrababu

ఇంటర్నెట్ డెస్క్: నల్లబర్లీ పొగాకుకు బదులు ఇకపై ప్రత్యామ్నాయ పంటలు ఎంచుకోవాలని ఏపీ ప్రభుత్వం రైతుల్ని కోరింది. కోకో రైతులు నాణ్యమైన విత్తనాలు ఎంచుకోవాలని సూచించింది. పామ్ ఆయిల్ రైతులు నష్టపోకుండా కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాజధాని అమరావతి ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో మామిడి, పొగాకు, కోకో పంటలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

రైతుల దగ్గర మిగిలిపోయిన నల్లబర్లీ పొగాకును మార్క్ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేయాలని సీఎం నిర్ణయించారు. పొగాకు కొనుగోళ్లకు దాదాపు రూ.350 కోట్లు ఖర్చయినా ప్రభుత్వం ఆ భారం భరించేందుకు సిద్ధమైంది. ఏడు మార్కెట్ యార్డుల్లో ఈ కొనుగోళ్లు ప్రభుత్వం ద్వారా రేపటి నుంచి జరుగుతాయని ఏపీ సర్కారు తెలిపింది. మామిడి రైతులు నష్ట పోకుండా కేజీ రూ.12 చెల్లిస్తామని, కేజీ పై రూ.8 ప్రాసెసింగ్ కంపెనీలు చెల్లిస్తే.. మిగిలిన రూ.4 ప్రభుత్వం రైతులకు చెల్లిస్తుందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇలా రూ.150 కోట్ల భారం భరిస్తూ ప్రభుత్వం దాదాపు ఐదున్నర లక్షల టన్నుల మామిడి కొనుగోళ్లు చేసి రైతుల్ని ఆదుకుంటామని తెలిపారు.

కోకో పంట కేజీ రూ.450కి కంపెనీలు కొనుగోలు చేస్తే, ప్రభుత్వం మరో రూ.50 అదనంగా చెల్లిస్తుందని సీఎం వెల్లడించారు. ఇలా దాదాపు వెయ్యి మెట్రిక్ టన్నుల కోకోను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 3 పంటలకూ ధరల స్థిరీకరణ నిధి ద్వారా దాదాపు రూ.550 కోట్లు ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. ప్రతీ రైతు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని, ప్రభుత్వం అందించే లబ్ది నేరుగా రైతుల ఖాతాలో జమ అవుతుందని సూచించారు చంద్రబాబు. మామిడి, నల్లబర్లీ, కోకో పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విషయoలో రాజీ లేదని అన్నారు.


రైతులెవ్వరూ నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఎం చెప్పారు. నల్లబర్లీ అధిక దిగుబడి రావటంతో కంపెనీలు కొనుగోలుకు ముందుకు రాలేదని, ఇప్పటి వరకూ 85మిలియన్ కేజీల పొగాకులో 25 మిలియన్ కేజీల పొగాకు కొనుగోళ్లు మాత్రమే జరిగాయని తెలిపారు. జీపీఐ, ఐటీసీ కంపెనీలు మరో 25మిలియన్ కేజీల కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఆయా కంపెనీలు కొనుగోళ్లకు అంగీకారం తెలిపాయి.

మిగిలిన పొగాకును ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేస్తుందని సీఎం వెల్లడించారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతుల్ని ఆదుకుంటుందన్నారు. గత 5ఏళ్లలో ధరల స్థిరీకరణ నిధి అంటూ అసత్యాలతో కాలయాపన చేశారు తప్ప వైసీపీ ప్రభుత్వం రైతుల్ని ఆదుకుంది లేదని సీఎం గుర్తు చేశారు.


ఇవి కూడా చదవండి

చిన్నస్వామి స్టేడియం విషాదం.. విచారణ జరిపిన హైకోర్టు

గుడ్ న్యూస్.. ఇకపై హైదరాబాద్‌లో రాఫెల్ విడిభాగాల తయారీ..

Updated Date - Jun 05 , 2025 | 10:19 PM