Share News

PM Kisan: అన్నదాత కు అంతా సిద్ధం

ABN , Publish Date - Jun 28 , 2025 | 03:31 AM

అన్నదాతల ఆనందమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అతి త్వరలోనే అమలు చేయనుంది.

PM Kisan: అన్నదాత కు అంతా సిద్ధం

47.77లక్షల రైతు కుటుంబాలకు అర్హత

జూలై తొలి వారంలో ‘సుఖీభవ’ అమలు

  • పీఎం కిసాన్‌తో కలిపి నిధులు జమ

  • భూమి లేని రైతులకు కూడా సొమ్ము

  • ఏడాదికి ఒక్కో రైతుకు రూ.20 వేలు

  • కౌలు రైతులకు 2 విడతల్లో జమ

  • 98 శాతం రైతుల ఈ-కేవైసీ పూర్తి

  • మిగతా వారికి ఆర్‌ఎ్‌సకేల్లో నమోదు

  • ఏడీఎ్‌సబీ పోర్టల్‌లో గ్రీవెన్స్‌ స్వీకరణ

అమరావతి, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): అన్నదాతల ఆనందమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘అన్నదాత-సుఖీభవ’ పథకాన్ని అతి త్వరలోనే అమలు చేయనుంది. ఈ పథకం కింద 47.77 లక్షల రైతు కుటుంబాలను వ్యవసాయశాఖ అర్హులుగా తేల్చింది. భూమిలేని రైతులకూ ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. వ్యవసాయశాఖ గుర్తించిన లబ్ధిదారుల్లో 98 శాతం మంది రైతుల ఈ-కేవైసీ పూర్తయింది. మిగిలిన 2 శాతం(61వేల) మందికి రైతు సేవా కేంద్రాల్లో ఈ-కేవైసీ చేస్తున్నారు. జీఎస్‌డబ్ల్యూఎస్‌ ఫ్యామిలీ సర్వే ద్వారా జరిగిన ఈ-కేవైసీని ‘అన్నదాత-సుఖీభవ’ ఈ-కేవైసీతో జత చేయగా, మిగిలిన వారికి రైతు సేవా కేంద్రాల్లో పూర్తి చేయనున్నారు.


కూటమి ప్రభుత్వ ‘సూపర్‌ సిక్స్‌’ హామీల్లో భాగంగా అన్నదాత-సుఖీభవ పథకాన్ని ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి(పీఎం కిసాన్‌) పథకానికి అనుబంధంగా అమలు చేయనుంది. పీఎం కిసాన్‌లో మూడు దఫాలుగా ఏటా రూ.6 వేలు పొందే రైతులందరికీ అన్నదాత-సుఖీభవ కింద మరో రూ.14 వేలు లబ్ధి చేకూరనుంది. ఏటా రూ.20 వేలు సాయం చేస్తామన్న కూటమి ప్రభుత్వ హామీ ప్రకారం మొత్తంగా అర్హులైన రైతులకు ఏడాదికి రూ.20 వేలు అందనున్నాయి. కేంద్ర పీఎం కిసాన్‌ నిధులు విడుదల చేసిన రోజే రాష్ట్రంలో అన్నదాత-సుఖీభవ సొమ్ము కూడా విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు పీఎం కిసాన్‌ సొమ్ము జూలై నెల మొదటి వారంలో విడుదల కానున్నట్లు సమాచారం. అదే రోజు అన్నదాత-సుఖీభవ పథకం నిధులు కూడా జమకానున్నాయి.


అందరికీ సుఖీభవ!

సాగు భూమి ఉన్న రైతు కుటుంబాలతో పాటు అటవీ భూమిని సాగు చేసుకునే వారికి కూడా కేంద్రం పీఎం కిసాన్‌ అందిస్తోంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ‘అన్నదాత-సుఖీభవ’ అమలు చేయనుంది. వారితో పాటు రాష్ట్రంలో సొంతానికి భూమి లేని సాగుదారులకు కూడా ఈ పథకం కింద సాయం చేయనుంది. అయితే కౌలురైతులకు గతంలో మాదిరిగానే ఏటా అక్టోబరు, జనవరి నెలల్లో రెండు విడతలుగా మొత్తం లబ్ధిని అందిస్తారు. అన్నదాత-సుఖీభవ పథకంలో అర్హులను గుర్తించడానికి ’రెవిన్యూ వెబ్‌ల్యాండ్‌’లోని భూ యజమానుల డేటా, అటవీశాఖకి సంబంధించిన ’గిరి భూమి’ పోర్టల్‌ నుంచి గత మే నెల వరకు ఉన్న డేటా ప్రకారం అటవీ హక్కు భూ సాగుదారులను పరిగణనలోకి తీసుకున్నారు. సొంత భూమి ఉన్న డీ పట్టాదారులు, అసైన్డ్‌ భూములు, ఈ నామ్‌ భూములు కలిగిన రైతులను కూడా అన్నదాత-సుఖీభవ పథకానికి అర్హులుగా గుర్తించారు.


తహసీల్దార్‌ను కలవాలి!

ఏ రైతు పేరైనా ధ్రువీకరణకు రాకపోయినా, రెవిన్యూ వెబ్‌ల్యాండ్‌లోని భూమికి ఆధార్‌ జత కాకపోయినా, చనిపోయిన వ్యక్తి ఖాతాల విషయంలో ఏదైనా సమస్య ఉంటే మండల తహసీల్దారును సంప్రదించాలని వ్యవసాయశాఖ డైరెక్టర్‌ డిల్లీరావు శుక్రవారం తెలిపారు. ఆయా సమస్యలను పరిష్కరించుకుంటే అన్నదాత-సుఖీభవ పోర్టల్‌లో రైతు వివరాలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. త్వరలో గ్రీవెన్స్‌ మాడ్యూల్‌ను అన్నదాత-సుఖీభవ పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతామన్నారు. ఇక భూమి లేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కౌలు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి ముందుగా కౌలు గుర్తింపు కార్డును పొందాలని సూచించారు. అనంతరం, ‘ఈ-పంట’లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అర్హత ప్రమాణాల ఆధారంగా వీరికి కూడా లబ్ధి అందిస్తామన్నారు.


జగన్‌ కంటే 6,500 ఎక్కువ!

గత జగన్‌ ప్రభుత్వం రైతు భరోసా పేరిట అన్నదాతలకు సాయం చేసింది. అయితే, పీఎం కిసాన్‌ కింద కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి రైతన్నకు ఏడాదికి రూ.13,500 మాత్రమే అందించింది. అదేసమయంలో ఓసీ, కౌలు రైతులకు మొండిచేయి చూపింది. ఇప్పుడు అన్నదాత-సుఖీభవ కింద భూమి ఉన్న రైతులకు, గుర్తింపు కార్డున్న కౌలుదారులకు కూడా కూటమి ప్రభుత్వం పీఎం కిసాన్‌తో కలిపి ఏటా రూ.20 వేలు అందించనుంది. అంటే.. జగన్‌ ఇచ్చిన సొమ్ము కంటే రూ.6,500 ఎక్కువ లబ్ధి చేకూర్చనుంది.

Updated Date - Jun 28 , 2025 | 03:31 AM