AP Minister Nara Lokesh In Australia: చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు బ్రాహ్మణి ఇదే అడిగింది: నారా లోకేశ్
ABN , Publish Date - Oct 19 , 2025 | 03:03 PM
ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. ఆదివారం సిడ్నీలోని ది ఆస్ట్రేలియన్ డయాస్పోరాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి నారా లోకేశ్ మాట్లాడారు.
అమరావతి, అక్టోబర్ 19: 180 బిలియన్ డాలర్ల ఎకానమీగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 240 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడానికి కృషి చేయాలని ఆస్ట్రేలియాలోని తెలుగు వారికి రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఆదివారం సిడ్నీలో ది ఆస్ట్రేలియా తెలుగు డయాస్పోరాలో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తనకు గూగుల్ ఎంత ముఖ్యమో ఎంఎస్ఎంఈ కూడా అంతే ముఖ్యమన్నారు. రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టి.. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తే మీకు అండగా నిలుస్తానని ఈ సందర్భంగా వారికి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఈ రోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్ననంటే ఆస్ట్రేలియా ప్రభుత్వమే అందుకు కారణమని ఆయన పేర్కొన్నారు.
టెక్నికల్ ఎడ్యూకేషన్‌లో మంచి పద్దతులు, స్పోర్ట్స్, మైనింగ్ తదితర విషయాల్లో సహకరించుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే.. ఏ ఒక్కరి వల్ల కాదని.. అందరం కలిసి ఒక తాటిపైకి వచ్చి ఆ పని చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఇటీవల పక్క రాష్ట్రాలతోనూ చిన్నచిన్న యుద్దాలు జరుగుతున్నాయని.. ఆ క్రమంలో తనను ఎన్నో మాటలు అంటున్నారని తెలిపారు. అవేమీ తాను పట్టించుకోనని లోకేశ్ చెప్పుకొచ్చారు. రాష్ట్రాలు పోటీ పడితే ఇండియా గెలుస్తుందని తాను విశ్వసిస్తానన్నారు. అందరూ వచ్చి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములం కావాలని తాను కోరుతున్నానని తెలిపారు.
గతేడాది దీపావళికి తాను యూఎస్‌ఏలో ఉంటే.. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నానని గుర్తు చేసుకున్నారు. ప్రపంచం మొత్తంలో తెలుగువారు ఉండరని.. కానీ అమెరికా నుంచి ఆస్త్రేలియా వరకూ మనదే డామినేషన్ అని ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. 'చంద్రబాబు నాయుడిని విజనరీ అంటాం.. ఇంకొకరిని ప్రిజనరీ అంటాం.. అర్థమయ్యిందా రాజా?' అంటూ లోకేశ్ చమత్కరించారు. అయితే 'గౌరవంగా గడిపేవాళ్లం.. మనకు ఈ రాజకీయాలు అవసరమా?' అని తన భార్య బ్రాహ్మణి.. తన తండ్రి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు ప్రశ్నించిందని.. ఆ సమయంలో మీ స్పందన చూసి.. అందుకోసం మనం రాజకీయాల్లో ఉండాలని బ్రాహ్మణికి స్పష్టం చేశానని లోకేశ్ తెలిపారు.
గత ఎన్నికల్లో విదేశాల్లోని వారు సైతం కూటమి గెలుపు కోసం ఎంతో సహకరించారన్నారు. అందువల్లే 94 శాతం సీట్లు కూటమి గెలిచిందని చెప్పారు. ఆ ఎన్నికల్లో ఇంత వేవ్ రావడం వెనుక ఇక్కడి ప్రతి వ్యక్తి కష్టం ఉందని తెలిపారు. తనతో సహా 50 మంది కొత్త ఎమ్మెల్యేలు.. ఈ సారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారని పేర్కొన్నారు. గత 16 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టబడులు ఆంధ్రప్రదేశ్‌కి వచ్చాయని వివరించారు. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని.. అభివృద్ధి వికేంద్రీకరణే తమ లక్ష్యమని ఆనాడే చెప్పామన్నారు. ఉత్తరాంధ్ర ఫార్మాహబ్‌గా, స్టీల్ సిటీగా ఇప్పుడు డేటా హబ్ కూడా రూపాంతరం చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఏపీకి గూగుల్ వచ్చిందంటే అందుకు కేంద్రం సహకారం సైతం ఉందన్నారు. ఈ సంస్థ ఏర్పాటుకు కొన్ని చట్టాలు అడ్డు వస్తున్నాయని ప్రధాని దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకు వెళ్లారన్నారు. ఈ విషయాన్ని వెంటనే ఆర్ధిక మంత్రికి చెప్పి అందుకు సంబంధించిన చట్టాలను సైతం ప్రధాని మోదీ సవరణ చేయించారని వివరించారు. ఒక క్లారిటీతోనే తామంతా కలిసికట్టుగా ముందుకు వెళుతున్నామన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి క్లారిటీతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. పొత్తు అన్న తర్వాత చిన్నచిన్న సమస్యలుంటాయని .. ఒకే కుటుంబంలోనూ సమస్యలు ఉంటాయని ఈ సందర్భంగా లోకేశ్ చమత్కరించారు. ఏపీలో రానున్న 15 సంవత్సరాలు కలికట్టుగా ముందుకు వెళ్లాలని పవన్ కల్యాణ్ చెపుతున్నారని తెలిపారు. అయితే అన్ని విషయాల్లోనూ తాము అంగీకరిస్తామని చెప్పడం లేదని.. ఎజెండా ఒక్కటే ఏపీ నెంబర్ వన్ కావాలని ఆకాంక్షిస్తున్నట్లు నారా లోకేశ్ తెలిపారు.
గత అయిదేళ్లు తలదించుకుని బతికే పరిస్థితిని తెచ్చారంటూ వైసీపీ నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మీ కంపెనీలో బ్రాండ్ అంబాసిడర్లు కావాలి... ఏపీ గురించి మాట్లాడండంటూ ఆస్ట్రేలియాలోని తెలుగు వారికి మంత్రి లోకేశ్ సూచించారు. ఒక కంపెనీ ఇండియాలో పెట్టుబడులు పెట్టాలంటే వెంటనే తమకు తెలియజేయాలని ఆ డీల్ క్లోజ్ చేసే బాధ్యత తాము తీసుకుంటామని వారికి మంత్రి నారా లోకేశ్ క్లియర్ కట్‌గా స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అల్పాహారంలో పురుగులు.. హోటల్ యజమాన్యానికి షాక్ ఇచ్చిన అధికారులు
చివరి నిమిషంలో ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాక్
For More AP News And Telugu News