Share News

Andhra Jyothi MD Radhakrishna: ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణ ఫోన్‌ ట్యాప్‌

ABN , Publish Date - Jun 26 , 2025 | 03:34 AM

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఫోన్‌ ట్యాపింగ్‌కు గురైన ప్రముఖుల జాబితా రోజురోజుకూ పెరిగిపోతోంది. ‘ఏబీఎన్‌, ఆంధ్రజ్యోతి’ సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ ఫోన్‌ను కూడా ట్యాప్‌ చేసినట్లు సిట్‌ అధికారులు గుర్తించారు.

Andhra Jyothi MD Radhakrishna: ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణ ఫోన్‌ ట్యాప్‌

మావోయిస్టుల సమాచారం కోసమంటూ

  • బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ట్యాపింగ్‌

  • రివ్యూ కమిటీకి 615 మంది నంబర్లు

  • వాటిలో ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ నంబరు కూడా

  • రాధాకృష్ణకు సిట్‌ అధికారుల సమాచారం

  • వాంగ్మూలం ఇవ్వాలని కోరే అవకాశం

  • పెన్‌డ్రైవ్‌లో ఫోన్‌ ట్యాపింగ్‌ సంభాషణలు

  • నాటి ప్రభుత్వంలోని పెద్దలకు అందజేత?

హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఫోన్‌ ట్యాపింగ్‌కు గురైన ప్రముఖుల జాబితా రోజురోజుకూ పెరిగిపోతోంది. ‘ఏబీఎన్‌, ఆంధ్రజ్యోతి’ సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ ఫోన్‌ను కూడా ట్యాప్‌ చేసినట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. మావోయిస్టుల సమాచారం కోసమంటూ అక్రమంగా ట్యాపింగ్‌ చేయించిన ఫోన్‌ నంబర్లలో ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ నంబర్‌ కూడా ఉన్నట్లు నిర్ధారించారు. రాధాకృష్ణ ఫోన్‌ను ట్యాప్‌ చేయించడం ద్వారా ఆయన సంభాషణలను రోజుల తరబడి విన్నారు. ఆయన కదలికలపై నిఘా పెట్టారు. ఈ మేరకు సిట్‌ అధికారులు బుధవారం సాయంత్రం ‘ఆంధ్రజ్యోతి’ ఎండీకి ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఎస్‌ఐబీలో అక్రమంగా ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఆపరేషన్‌ టీం(ఎస్‌వోటీ) నాయకులతో పాటు జర్నలిస్టులు, న్యాయమూర్తులు, పలువురు సినీ ప్రముఖుల ఫోన్లను ట్యాప్‌ చేయడంపై సిట్‌ అధికారులు సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు. ఈ మేరకు ఫోన్‌ ట్యాపింగ్‌ బాధితులకు ఫోన్లు చేసి పిలిపించుకుని వారి వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంటున్నారు. రాధాకృష్ణ నుంచి కూడా వాంగ్మూలం కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


మావోయిస్టుల సమాచారం కోసమంటూ..

ఆనాటి ఎస్‌ఐబీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలోని బృందాలు మావోయిస్టుల సమాచారం పేరిట అనుమతులు తీసుకుని ప్రముఖుల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్‌ చేశారు. ‘ఆంధ్రజ్యోతి’ ఎండీతోపాటు 615 మంది ఫోన్‌ నంబర్లను ప్రభాకర్‌రావు మావోయిస్టుల సమాచారం కోసమంటూ ట్యాపింగ్‌కు అనుమతి కోరుతూ రివ్యూ కమిటీకి పంపారు. ఈ నంబర్లను పరిశీలించి పంపాల్సిన నాటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌, డీజీపీ అంజనీకుమార్‌.. సాధారణ నంబర్లుగా భావించి రివ్యూ కమిటీకి పంపారు. అయితే రివ్యూ కమిటీలోని సభ్యులు సైతం వీటిని పరిశీలించకుండానే ఫోన్‌ ట్యాపింగ్‌కు అనుమతి ఇవ్వడంతో ప్రభాకర్‌రావు టీం అక్రమానికి పాల్పడ్డారు. ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించి మోసపూరితంగా అనుమతులు పొందిన విషయ మై హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా ఇప్పటికే ఆగ్రహ ం వ్యక్తం చేశారు. ప్రభాకర్‌రావు మోసపూరితంగా వ్యవహరించారని అఫిడవిట్‌లో హైకోర్టుకు అందజేశారు. నాటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌, ఇతర ఉన్నతాధికారులు సైతం ప్రభాకర్‌రావు తమను మోసం చేశారన్న కోణంలోనే సిట్‌ ప్రశ్నలకు జవాబులు ఇచ్చినట్లు తెలుస్తోంది.


పెన్‌డ్రైవ్‌లో పెద్దలకు సంభాషణలు..

మావోయిస్టుల సమాచారం కోసమంటూ వందల సంఖ్యలో ఫోన్‌ ట్యాపింగ్‌ అనుమతులు పొందిన ప్రభాకర్‌రావు.. అసలు అనుమతే తీసుకోకుండా వివిధ ప్రాంతాల్లో రహస్యంగా ఏర్పాటు చేసిన ప్రైవేటు వ్యవస్థ ద్వారా వేల సంఖ్యలో ఫోన్‌ నంబర్లను ట్యాపింగ్‌ చేసి సంభాషణలు విన్నట్లు సిట్‌ దర్యాప్తులో వెల్లడైంది. వాటిలో ముఖ్యమైన వారి సంభాషణల్ని రికార్డు చేసి పెన్‌డ్రైవ్‌లో నాటి ప్రభుత్వ పెద్దలకు పంపించినట్లు అయితే.. పెన్‌డ్రైవ్‌లు ఎవరికి చేరాయి? ఎవరు తీసుకెళ్లి ఇచ్చారు? ట్యాపింగ్‌ చేయాల్సిన ఫోన్‌ నంబర్లను ఎస్‌ఐబీకి ఎవరిచ్చారు? నాటి ప్రభుత్వంలోని పెద్దల పాత్ర ఏంటి? అనే విషయాలకు సంబంధించి ఇంకా పూర్తిస్థాయి సాక్ష్యాధారాలు సిట్‌కు లభించలేదని తెలుస్తోంది. ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావును సిట్‌ అధికారులు పలుమార్లు ప్రశ్నించినప్పటికీ.. రాజకీయపరమైన ఆదేశాలకు సంబంధించి ఆయన పెదవి విప్పలేదని తెలుస్తోంది. నాటి డీజీపీలు, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌లు చెబితేనే చేశానంటూ వాదిస్తున్నారని సిట్‌ అధికారులు అంతర్గత సంభాషణల్లో పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో విచారణకు ప్రభాకర్‌రావు సహకరించడం లేదన్న విషయాన్ని అఫిడవిట్‌ రూపంలో సుప్రీంకోర్టుకు తెలియచేసి మధ్యంతర ఉపశమనాన్ని రద్దు చేయాల్సిందిగా కోరతామని అంటున్నారు.

Updated Date - Jun 26 , 2025 | 03:34 AM