Share News

MINISTER SAVITHA: ప్రజాసమస్యలు వెంటనే పరిష్కరించండి

ABN , Publish Date - Apr 21 , 2025 | 11:52 PM

ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించేలా కృషిచేయాలని మంత్రి సవిత సూచించారు. సోమవారం స్థానిక వెలుగు కార్యాలయంలో వివిధశాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొన్నారు.

MINISTER SAVITHA: ప్రజాసమస్యలు వెంటనే పరిష్కరించండి
Minister anointing CM's portrait with milk along with DSC candidates

సోమందేపల్లి, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించేలా కృషిచేయాలని మంత్రి సవిత సూచించారు. సోమవారం స్థానిక వెలుగు కార్యాలయంలో వివిధశాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. గ్రామ స్వరాజ్యం గ్రామాల అభివృద్ధితోనే సాధ్యం అవుతుందని ముఖ్యమంత్రి కలలు కంటున్నారన్నారు. ఆయన కలలను సాకారం చేయాలంటే అధికారుల సహకారం అవసరమన్నారు. అధికారులు, నాయకులు సమన్వయంతో గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషిచేయాలన్నారు.

పంచాయతీల అభివృద్ధికి కృషి చేయండి

పంచాయతీలను అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు మంత్రి సవిత సూచించారు. సోమవారం స్థానిక వెలుగు కార్యాలయ సమావేశ భవనంలో పంచాయతీలవారీగా నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నాయకులు తమ తమ పంచాయతీల్లో నెలకొన్న సమస్యలను మంత్రికి వివరించారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, భూసమస్యలు మంత్రి దృష్టికి తెచ్చారు. వ్యక్తిగత సమస్యలు పక్కనపెట్టి పార్టీకోసం, పంచాయతీ అభివృద్ధికి కృషిచేయాలని సూచించారు. డీబీ ఆంజనేయులు, నీరుగంటి చంద్ర, వెంకటరాముడు, వెంకటేశులు, సిద్దలింగప్ప, సూరీ, కిష్టప్ప, సూర్యనారాయణ, ఆకుల రమణ, నాగరాజుయాదవ్‌, మద్దిలేటి పాల్గొన్నారు.

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

చెప్పిన విధంగా డీఎస్సీ నోటిఫికేషన విడుదల చేసి మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్రపటానికి సోమవారం మంత్రి సమక్షంలో డీఎస్సీ అభ్యర్థులు క్షీరాభిషేకం చేశారు. మంత్రి సవిత మాట్లాడుతూ మాది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమన్నారు. విద్యారంగంలో అనేక సంస్కరణలకు లోకేష్‌ శ్రీకారం చుట్టారన్నారు. చంద్రబాబు జన్మదినం సందర్భంగా మెగా డీఎస్సీ నోటిఫికేషన విడుదల చేశారన్నారు. ఈ విద్యా సంవత్సరానికి 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీచేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో 1.80లక్షలు ఉపాధ్యాయ పోస్టులు భర్తిచేసిన ఘనత ముఖ్యమంత్రిదేనన్నారు.

వైసీపీ దగాకోరు ప్రభుత్వం

డీఎస్సీ పేరుతో ఐదేళ్లు కాలయాపనచేసి నిరుద్యోగ యువతను మోసం చేసిన దగాకోరు ప్రభుత్వం వైసీపీ అని మంత్రి సవిత మండిపడ్డారు. ఒక ఉపాధ్యాయ పోస్టు సైతం భర్తీచేయలేదని ఎద్దేవా చేశారు. సోమవారం వెలుగు కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. జగన అసమర్థతవల్ల నిరుద్యోగుల విలువైన సమయం వృథా అయిందన్నారు.

Updated Date - Apr 21 , 2025 | 11:52 PM