TRAFFIC: రోడ్డుపై వాహనాల పార్కింగ్
ABN , Publish Date - Nov 18 , 2025 | 12:20 AM
పట్టణంలోని రాజీవ్‌గాంధీ సర్కిల్‌లో కూరగాయల మార్కెట్ నిర్వహిస్తుండటంతో వాహనాలు అన్నీ రోడ్డుపైనే నిలిపివేస్తున్నారు. సంతరోజు ద్విచక్ర వాహనాలు అన్నీ రోడ్డుపైనే నిలపడం వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
పట్టించుకోని పోలీసులు, నగర పంచాయతీ అధికారులు
మడకశిర టౌన, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని రాజీవ్‌గాంధీ సర్కిల్‌లో కూరగాయల మార్కెట్ నిర్వహిస్తుండటంతో వాహనాలు అన్నీ రోడ్డుపైనే నిలిపివేస్తున్నారు. సంతరోజు ద్విచక్ర వాహనాలు అన్నీ రోడ్డుపైనే నిలపడం వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బస్సులు, కార్లు, లారీ ఇతర వాహనాలు వెళ్లేందుకు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. గతంలో మార్కెట్ ఏర్పాటుకు టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకొన్నా వైసీపీ ప్రభుత్వం రాగానే కనుమరుగు కావడంతో కూరగాయల మార్కెట్, డైలీ, వారపు సంత రాజీవ్‌గాంధీ సర్కిల్‌లోనే నిర్వహిస్తున్నారు. దీంతో వాహనాలు పార్కింగ్‌కు ప్రత్యేకంగా స్థలం లేకపోవడంతో రోడ్డుపైనే నిలపాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం డ్రైనేజీ పనులు జరుగుతుండటంతో వాహనాలు మరింత రోడ్డుపైన నిలుపుతున్నారు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ ద్విచక్ర వాహనాలు, ఆటోలు నిలుపుతుండటంతో కూరగాయల మార్కెట్‌కు వెళ్లే మహిళలు, కొనుగోలుదారులు పడరాని పాట్లు పడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలుపుతున్నా పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో సమస్యను పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో పోలీసులు ట్రాఫిక్ సమస్యను కొంత వరకు పరిష్కరించారు. పరిస్థితి మొదటికి వచ్చిందని పట్టణ వాసులు వాపోతున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన రైతులు, ప్రజలు కొనుగోలు చేయడానికి అనేక మంది వస్తుండటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు సమస్యను పరిష్కరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.