Share News

WEAVERS: నేతన్న నేస్తం అమలు చేయండి

ABN , Publish Date - Nov 25 , 2025 | 12:23 AM

చేనేత కార్మికులకు నేతన్న నేస్తం అమలు చేయాలని ఏపీ చేనేత సంఘం జిల్లా నాయకుడు శీల నారాయణస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

WEAVERS: నేతన్న నేస్తం అమలు చేయండి
Handloom workers submitting a petition to the RDO

పెనుకొండ, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): చేనేత కార్మికులకు నేతన్న నేస్తం అమలు చేయాలని ఏపీ చేనేత సంఘం జిల్లా నాయకుడు శీల నారాయణస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో నాయకులు ఆర్డీఓ ఆనంద్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. నారాయణస్వామి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేనేతలకు ఎన్నో హామీలు ఇచ్చిందన్నారు. అందులో ప్రధానమైనది నేతన్ననేస్తం అన్నారు. దీనిద్వారా ప్రతి కార్మికుడికి ఏడాదికి పెట్టుబడి సాయంగా రూ.25వేలు వారి బ్యాంక్‌ఖాతాకు జమచేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతున్నా హామీని నెరవేర్చలేదన్నారు. నేసిన చీరకు గిట్టుబాటు ధరలేక పవర్‌లూమ్స్‌లతో పోటీపడలేక చేనేత వ్యవస్థ అంతరించే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నేతన్న నేస్తం పథకం అమలు చేయాలని కోరారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుతను యుద్ధప్రాతిపదికన అమలు చేయాలన్నారు. మండల సమితి సభ్యులు దాసరి సుధాకర్‌, బెస్త కిష్టప్ప ఈశ్వర్‌, దేవాంగం వెంకటేశులు, ఈడిగ నాగరాజు, ఉప్పర సంజీవ, రమేష్‌, శంకరప్ప, పందిపర్తి రామదాసు పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2025 | 12:23 AM