CPM : గంజాయి బ్యాచను కఠినంగా శిక్షించాలి
ABN , Publish Date - Dec 02 , 2025 | 12:10 AM
నెల్లూరు నగరంలో సీపీఎం నాయకుడు పెంచలయ్యను హత్యచేసిన గంజాయి బ్యాచను కఠినంగా శిక్షించాలని సీపీఎం, సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. అంబేడ్కర్ సర్కిల్‌లో నిరసన తెలిపారు.
హిందూపురం, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): నెల్లూరు నగరంలో సీపీఎం నాయకుడు పెంచలయ్యను హత్యచేసిన గంజాయి బ్యాచను కఠినంగా శిక్షించాలని సీపీఎం, సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. అంబేడ్కర్ సర్కిల్‌లో నిరసన తెలిపారు. నాయకుడు రాము మాట్లాడుతూ పెంచ లయ్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గం చూపేవారన్నారు. మురళి, నరసింహమూర్తి, శ్రీరాములు, మంజు, రామాంజినప్ప, చంద్ర, బాలాజీ పాల్గొన్నారు.
సోమందేపల్లి, (ఆంధ్రజ్యోతి): గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేసిన పెంచలయ్యను హత్యచేసిన వారిని, అండదండలు అందించిన వారిని కఠినంగా శిక్షించాలని సీపీఎం నాయకులు సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో డీటీ రెడ్డిశేఖర్‌కు వినతిపత్రం అందించారు. లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో అనుబంధ సంఘాల నాయకులు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి రూ.50లక్షల పరిహారం ఇప్పించి ఇల్లు, భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు. హనుమయ్య, బోయ వెంకటేశులు, మాబు, రామక్రిష్ణ, రవి, నాగభూషణం, నేసే నాగరాజు పాల్గొన్నారు.
పెనుకొండ(ఆంధ్రజ్యోతి): ఇటీవల నెల్లూరు జిల్లాలో హత్యకు గురైన పెంచలయ్యకు స్థానిక సీపీఎం నాయకులు నివాళి అర్పించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో సీపీఎం నాయకులు హరి, నాగరాజు, బాబావలి, వెంకటరాముడు, పెంచలయ్య చిత్రపటానికి పూలమాలలువేసి నివాళి అర్పించారు. హత్యకు పాల్పడిన వారిని కొందరిని అరెస్ట్ చేశారని, మిగిలిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు.