AP State Central Library: అమరావతిలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ నిర్మాణం వేగవంతం.. ప్రత్యేక నిపుణుల కమిటీ ఏర్పాటు
ABN , Publish Date - Dec 02 , 2025 | 06:20 AM
ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులు, పరిశోధకులు, ఉద్యోగార్థులకు మరో అద్భుతమైన అవకాశం రాబోతోంది. దీనికి ఏపీ రాజధాని అమరావతి డెస్టినీ కాబోతోంది. ఇప్పటికే ప్రకటించిన స్టేట్ సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందుకోసం ప్రత్యేక ఎక్స్‌పర్ట్స్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లైబ్రరీ భవన డిజైన్, ఆర్కిటెక్ట్ కన్సల్టెంట్ ఎంపిక, నిర్మాణ ప్రణాళికల పరిశీలన కోసం ఏడుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కమిటీ ఛైర్మన్‌గా పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ కార్యదర్శిని నియమించగా, సభ్యులుగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, ఏపీ ఈడబ్ల్యూఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్, సమగ్ర శిక్షా చీఫ్ ఇంజినీర్, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నిపుణులతోపాటు ఇతర సాంకేతిక నిపుణులు ఉంటారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ, సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌లకు తదుపరి చర్యలు త్వరగా చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
ఈ తాజా ఉత్తర్వులను పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ జారీ చేశారు. దీంతో ఏపీ రాజధాని అమరావతిలో ఆధునిక సౌకర్యాలతో కూడిన స్టేట్ సెంట్రల్ లైబ్రరీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, పరిశోధకులకు మరింత అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టు రాజధాని అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలుస్తుందని అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి:
ఐటీ రిఫండ్స్ ఇంకా రాలేదా? అయితే..
ప్రమోషనల్ స్కీములపై జీఎస్‌టీ ఉంటుందా?
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి