Share News

Outer Ring Road: 2 నెలల్లో ఓఆర్‌ఆర్‌ ఆర్థిక ప్రతిపాదనలు!

ABN , Publish Date - Jul 24 , 2025 | 05:17 AM

అమరావతి అవుటర్‌ రింగ్‌ రోడ్డును(ఓఆర్‌ఆర్‌) 140 మీటర్లుకు విస్తరించి, గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్టుగా

Outer Ring Road: 2 నెలల్లో ఓఆర్‌ఆర్‌ ఆర్థిక ప్రతిపాదనలు!

శరవేగంగా అడుగులు వేస్తున్న ఎన్‌హెచ్‌ యంత్రాంగం

  • క్షేత్ర స్థాయిలో సర్వేలో నిమగ్నమైన కన్సల్టెన్సీ సంస్థ

  • వెడల్పు రెట్టింపు కావడంతో భూ సేకరణ వ్యయమూ రెండింతలు

  • భూమి కోసం 5,200 కోట్లు... మొత్తం అంచనా వ్యయం 21 వేల కోట్లు

  • అనుమతుల కోసం కేంద్ర పర్యావరణ, అటవీ శాఖలకు లేఖలు

  • విద్యుత్‌ టవర్ల ఎత్తు పెంచాలని ట్రాన్స్‌కో, పవర్‌ గ్రిడ్‌లకు సూచన

(ఆంధ్రజ్యోతి - విజయవాడ): అమరావతి అవుటర్‌ రింగ్‌ రోడ్డును(ఓఆర్‌ఆర్‌) 140 మీటర్లుకు విస్తరించి, గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్టుగా పట్టాలెక్కించడానికి జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌) శరవేగంగా అడుగులు వేస్తోంది. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన తొలి అడుగు... ఆర్థిక ప్రతిపాదనల(ఫైనాన్షియల్‌ ప్రపోజల్స్‌) రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా కన్సల్టెన్సీ సంస్థ ఇప్పటికే క్షేత్రస్థాయిలో సర్వే చేస్తోంది.

70 నుంచి 140 మీటర్లకు...

అమరావతి డివిజన్‌ ఎన్‌హెచ్‌ అధికారులు గతంలో 70 మీటర్ల వెడల్పుతో ఓఆర్‌ఆర్‌ నిర్మాణానికి ఆర్థిక ప్రతిపాదనలను రూపొందించారు. వాటిలో ప్రధానంగా భూ సేకరణ, నిర్మాణ వ్యయం అంతర్భాగంగా ఉంటాయి. ప్రాజెక్టుకు మొత్తంగా రూ.16,200 కోట్లు ఖర్చవుతుందనీ, అందులో భూ సేకరణకు రూ.2,600 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. తాజాగా ఓఆర్‌ఆర్‌ వెడల్పును 140 మీటర్లకు విస్తరించడానికి కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో తిరిగి ఆర్థిక ప్రతిపాదనలను రూపొందించాల్సి వచ్చింది. రెట్టింపు భూ సేకరణ చేయాల్సి ఉండటంతో అందుకు గతంలో కేటాయించిన దానికంటే రెట్టింపు... అంటే సుమారుగా రూ.5,200 కోట్లు వ్యయం అవుతుందని భావిస్తున్నారు. దీనితోపాటే సహజంగానే నిర్మాణ ఖర్చు కూడా పెరుగుతుంది. మొత్తం మీద 140 మీటర్ల వెడల్పున ఓఆర్‌ఆర్‌ను విస్తరించాలంటే సుమారుగా రూ.21 వేల కోట్లు వ్యయాన్ని ఎన్‌హెచ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కన్సల్టెన్సీ సంస్థ సర్వే రిపోర్టులను క్రోడీకరించి, రెండు నెలల్లోగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పింపించాలని ఎన్‌హెచ్‌ అధికారులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత ్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాగానే క్షేత్ర స్థాయిలో పనులకు శ్రీకారం చుడతారు..


GAS.jpg

ప్రాజెక్టులో సమన్వయ భారం ఎక్కువే

అమరావతి ఓఆర్‌ఆర్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్టు. దీనిని పట్టాలెక్కించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలోని పలు శాఖలతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్‌హెచ్‌ అధికారులు ఇప్పటికే ఆయా కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నారు. తొలిగా... కేంద్ర పర్యావరణ శాఖ ఉన్నతాధికారులకు గ్రీన్‌ ఫీల్డ్‌ ప్రాజెక్టు అనుమతుల కోసం లేఖ రాశారు. వారికి పంపించాల్సిన వాయు, ధ్వని, నీటి కాలుష్యాలకు సంబంధించిన నివేదికలనూ సిద్ధం చేస్తున్నారు. అత్యంత కీలకమైనది అటవీ భూముల అంశం. కేంద్ర అటవీశాఖ అధికారులకూ ఆమేరకు ఎన్‌హెచ్‌ అధికారులు లేఖ రాశారు. అటవీ విస్తీర్ణంలో అలైన్‌మెంట్‌ పరిధి వరకు సరిహద్దులను ఆశాఖ నిర్ణయించాల్సి ఉంటుంది. ఎంత విస్తీర్ణం పోతుందో అంతమేర రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా అడవిని అభివృద్ధి చేసేందుకు భూములు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ భూములను జిల్లా ఫారెస్ట్‌ అధికారి (డీఎ్‌ఫఓ) పరిశీలించి సూటబిలిటీ సర్టిఫికెట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని జల వనరుల శాఖకూ ఎన్‌హెచ్‌ అధికారులు లేఖ రాశారు. ఓఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ పరిధిలోని కాలువలు, ఇతర జల వనరులను గుర్తించాలని కోరారు. అవసరమైతే కాలువలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాల్సి ఉంటుంది. విజయవాడ పశ్చిమ బైపాస్‌ ఇబ్బందులను దృష్టిలోఉంచుకుని విద్యుత్‌ లైన్ల అలైన్‌మెంట్‌ మార్చకుండా ఎక్కడికక్కడ టవర్ల ఎత్తు పెంచాలని పీజీసీఐఎల్‌, ట్రాన్స్‌కో అధికారుల కు ఎన్‌హెచ్‌ అధికారులు ప్రతిపాదించారు. ఈ క్రమంలోనే త్వరలో గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్‌, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో గ్రామసభలు నిర్వహించనున్నారు.

BFX.jpg

ఆరు నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభం!

సాధారణంగా ఒక గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి ప్రాజెక్టును పట్టాలెక్కించాలంటే కనిష్ఠంగా ఏడాది కాలం పడుతుంది. అయితే అమరావతి ఓఆర్‌ఆర్‌ నిర్మాణ పనులను ఆరు నెలల్లో ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. అందుకనే ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. టెండర్ల దశకు ప్రాజెక్టును వీలైనంత త్వరగా తీసుకొని వెళ్లాలని భావిస్తున్నారు. టెండర్లు పిలిచిన తరువాత ఆలస్యం కాకుండా పనులు ప్రారంభం కావాలంటే భూములు సిద్ధంగా ఉండాలి. అందుకనే భూ సేకరణలో భాగంగా నోటిఫికేషన్‌ ఇవ్వవలసిందిగా ఎన్‌హెచ్‌ అధికారులు ఐదు జిల్లాల జాయింట్‌ కలెక్టర్లను ఇప్పటికే కోరారు


Also Read:

దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!

శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!

For More Health News

Updated Date - Jul 24 , 2025 | 05:17 AM