Share News

MLA Budda Prasad: అమరావతిలో సెంట్రల్‌ లైబ్రరీ పెట్టాలి

ABN , Publish Date - Apr 28 , 2025 | 03:33 AM

అమరావతిలో సెంట్రల్‌ లైబ్రరీ నిర్మాణం అవసరమని, యువతను పఠనాభిమానులుగా మార్చాల్సిందని ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్‌ తెలిపారు. గ్రంథాలయాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు

MLA Budda Prasad: అమరావతిలో సెంట్రల్‌ లైబ్రరీ పెట్టాలి

యువతను పుస్తక పఠనం వైపు మళ్లించాలి: ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్‌

విజయవాడ, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): గ్రంథాలయాల వికాసం కోసం రాష్ట్రంలో సెంట్రల్‌ లైబ్రరీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. రాజధాని అమరావతిలో కేంద్ర గ్రంథాలయం నిర్మాణానికి కృషి చేస్తానని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. విజయవాడలో ఆదివారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రసంగించారు. విద్యార్థులను గ్రంథాలయాల వైపు నడిపించడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని తెలిపారు. నేటితరం యువతకు నేర్చుకోవాలనే ఆసక్తి తగ్గిపోతోందని, ఈ పరిస్థితుల్లో గ్రంథాలయ పునర్వికాస కార్యక్రమం నిర్వహించడం శుభపరిణామమని, ఇదొక జ్ఞానయజ్ఞమని పేర్కొన్నారు. గ్రంథాలయాల విషయాన్ని ఇప్పటికే శాసనసభలో ప్రస్తావించగా, మంత్రి లోకేశ్‌ సానుకూలంగా స్పందించారన్నారు.


గ్రంథాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసేలా ప్రయత్నం చేస్తానని చెప్పారని మండలి తెలిపారు. విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ ఆస్తిపన్నులో సెస్సు ద్వారా గ్రంథాలయాల అభివృద్ధికి రావాల్సిన 8శాతం నిధులను నేరుగా గ్రంథాలయ అభివృద్ధి నిధుల్లో జమయ్యేలా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ప్రభుత్వం నుంచి గ్రంథాలయ అభివృద్ధి శాఖకు సుమారు రూ.1,100 కోట్ల బకాయిలు రావాలని అన్నారు.

Updated Date - Apr 28 , 2025 | 03:33 AM